Site icon NTV Telugu

వరవరరావుకి వైద్యపరీక్షలు..బాంబే హైకోర్ట్ ఆదేశం

విప్లవ కవి వరవరరావుని మెడికల్ పరీక్షల కోసం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాలని ఎన్ఐఏను ఆదేశించింది బాంబే హైకోర్టు. మెడికల్ టెస్ట్ లకు అయ్యే ఖర్చులను ఎన్ఐఏ భరించాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. వరవరరావుకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని గతంలోనే బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టత ఇచ్చింది బాంబే హైకోర్టు.

భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. కేసు, ఆ నిర్బంధం మూడు సంవత్సరాలుగా కొనసా……గుతూనే ఉన్నది. గత ఎనిమిది నెలలుగా ఆరోగ్య కారణాలపై షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మినహాయింపు. కాని ఈ మధ్యంతర బెయిల్ షరతులు ఆయన నిర్బంధాన్ని పూర్తిగా తొలగించలేదు. ఈ ముప్పై ఆరు నెలలలో ఆయన పదిహేను నెలలు పూణేలోని యరవాడ జైలులో, ఎనిమిది నెలలు నవీ ముంబాయిలోని తలోజా జైలులో, నాలుగు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో ముంబాయి లోని ఆస్పత్రులలో, ఎనిమిది నెలలు గృహనిర్బంధం లాంటి మధ్యంతర బెయిల్ పై గడిపారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఇప్పటి వరకు వరవరరావు బెయిల్‌ను రెండుసార్లు పొడిగించింది. వరవరరావుకి ఈనెల 13న అపెండిక్స్ ఆపరేషన్ అయింది. లాపరోస్కోపిక్ సర్జరీ చేశారు డాక్టర్లు. అయితే ఎన్ఐఏ ఆయన ఆరోగ్యం బాగానే వుందని వాదించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ మీరే నానావతి ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది.

ఆరోగ్య కారణాల మీద వరవరరావుకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ పొడిగించాలని వేసిన పిటిషన్ పై ఇవాళ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో, ఆయనను నానావతి ఆస్పత్రికి తీసుకువెళ్లి, పరీక్షలు చేయించాలంది. ప్రస్తుత ఆరోగ్య స్థితి మీద నివేదిక తయారు చేయించి కోర్టుకు ఇచ్చే బాధ్యతను ఎన్ ఐ ఎ కు అప్పగించింది. మరుసటి వాయిదా డిసెంబర్ 3 మధ్యాహ్నం 2.30 కు వేసింది. వరవరావు జైలుకు తిరిగి వెళ్లడానికి గడువు డిసెంబర్ 6 గా నిర్దేశించింది.

Exit mobile version