Site icon NTV Telugu

సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం

ఏపీలో సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ వైఫల్యాలపై 28వ తేదీన ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆహ్వానించామన్నారు. ఆర్ధిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ కొట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం వనరులు వినియోగించుకోకుండా అప్పులు చేస్తుంది. కాగ్ కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. ఆదాయం సమకూర్చకుండా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో అన్ని రంగాలను ప్రముఖులు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. విద్యార్థులు, యువత, పారిశ్రామిక వేత్తలు తెలంగాణ, కర్ణాటకకు వలస వెళ్తున్నారు.

వ్యవస్థలను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. సినిమా రంగంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటుందన్నారు. కొన్ని థియేటర్లను మాత్రమే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తుంది..?ప్రభుత్వం పట్ల సానుకూల భావన లేదని సినిమా రంగంపై దాడులు చేయిస్తున్నారా..?ప్రభుత్వ వైఖరి కారణంగా సినిమా రంగంపై ఆధారపడిన వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.వికేంద్రీకరణ పేరుతో ఏకీకృత వ్యవస్థను అమలు చేసి జె టాక్స్ అమలు చేయాలని చూస్తున్నారు.

రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు ప్రభుత్వం గురి చేస్తుంది.రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రభుత్వం బెదిరిస్తుంది.జగన్ ఆస్తులు తెలంగాణ, కర్ణాటకలో ఉండటంతో ఆయా రాష్ట్రాలకు వ్యాపారులను తరిమేసినట్లుగా అనిపిస్తుందన్నారు మాధవ్.

Exit mobile version