NTV Telugu Site icon

సెకండ్ వీక్ సైతం నామినేట్‌ అయిన ఆర్జే కాజల్!

Bigg-Boss-5

బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం మొదలయ్యే సరికీ ఆవేశకావేశాలు పీక్స్ కు చేరిపోయాయి. మరీ ముఖ్యంగా సోమవారమే రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవ మర్యాదలు ఏ పాటివో తేటతెల్లమైపోయింది. ఒకరిద్దరు ఎదుటివారిని ప్రోత్సాహకరంగా నామినేట్‌ చేశామని చెప్పినా, నామినేట్‌ అయిన వ్యక్తి దాన్ని స్పోర్టీవ్ గా తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది. కాజల్ ఎప్పటిలానే ఈ రోజు ఉదయం జెస్సీని హౌస్ లో నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరంటూ ఆరా తీసే పనిలో పడింది. అయితే ఇప్పుడు మాత్రం జెస్సీ కాస్తంత తెలివిగానే వ్యవహరించాడు. సిరి అంటే తనకు సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పి టాపిక్ ను డైవర్ట్ చేశాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటిలోని 18మంది సభ్యులను ఊల్ఫ్ – ఈగల్ అంటూ రెండు గ్రూప్స్ గా విడగొట్టాడు. ఊల్ఫ్ గ్రూప్‌లో ఉమ, లహరి, రవి, మానస్, జస్వంత్, నటరాజ్, కాజల్, సన్ని, శ్వేతవర్మ ఉండగా; ఈగల్ గ్రూప్‌లో లోబో, యాని, శ్రీరామచంద్ర, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక ఉన్నారు. ఈ వారం హౌస్ కెప్టెన్ గా సిరి ఉన్న కారణంగా ఆమెను ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో సిరి మొదటే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టయ్యింది.

రంగు పడింది!
నామినేషన్ చేసే కార్యక్రమాన్ని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు అపోజిట్ గ్రూప్ లోని ఇద్దరు సభ్యుల ముఖానికి ఎర్రరంగు పూసి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆర్డర్ జారీ చేశాడు. దాంతో సిరి.. ఉమ, నటరాజ్‌ను; నటరాజ్… ప్రియ, ప్రియాంకను; యాని.. ఉమ, కాజల్‌ ను; సన్ని.. ప్రియ, ప్రియాంకను; ప్రియాంక… నటరాజ్, సన్నీను; మానస్‌.. లోబో, ప్రియను నామినేట్ చేశారు. ఆ తర్వాత విశ్వ… ఉమ, కాజల్ ను; లహరి.. హమీదా, యానిలను నామినేట్ చేశారు. ఆపైన ఉమ… యాని, విశ్వను; లోబో… శ్వేతవర్మ, రవిని; శ్వేతవర్మ.. లోబో, హమిదను; కాజల్… యాని, విశ్వను; షణ్ముఖ్… ఉమ, జస్వంత్ ను; ప్రియ… సన్నీ, నటరాజ్ ను; జస్వంత్… శ్రీరామచంద్ర, లోబోను; శ్రీరామచంద్ర… నటరాజ్, కాజల్ ను; రవి… ప్రియాంక, శ్రీరామచంద్రను నామినేట్ చేశారు. అయితే గతవారం కంటే కూడా ఈసారి నామినేషన్ ప్రక్రియ కాస్తంత వాడిగా వేడిగా జరిగింది. యాని మాస్టర్ పై ఉమ గొంతు పెంచి మాట్లాడింది. అలానే లోబో.. మానస్ సైతం మాటా మాటా అనుకున్నారు. ఉమ.. యాని ముఖం మీద ఎర్రరంగును ఎక్కువగా పూయడాన్ని ఖండించిన శ్వేతవర్మ తన వంతు వచ్చినప్పుడు అంతకంటే రఫ్ గా హమీదా, లోబో ముఖాలపై రంగు పూసింది. హార్ష్ గా ఆ రంగను వారి ముఖాలపై రాయడంతో కళ్ళలోకీ కొంత వెళ్ళి వారిద్దరూ ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న శ్వేతవర్మ… హమీదాకు సారీ చెప్పింది. నిజానికి శ్వేతవర్మ చేసిన ఆరోపణలు వాస్తవమే అయినా… ఆమె ప్రవర్తించిన తీరుతో అది కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రకంగా వారందరి మీద రెండోవారం రంగు పడింది!

పుట్టలో వేలు పెడితే ఊర్కోనంటున్న ఉమా!
రెండోవారం మొదటి రోజు ఉమా, యానీ మాస్టర్ మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం సాగింది. ‘ఇద్దరం సినిమా రంగానికి చెందిన సీనియర్లం. కాస్తంత గౌరవం ఇచ్చి పుచ్చుకుందాం’ అని యాని చేసిన విజ్ఞప్తిని ఉమా త్రోసిపుచ్చింది. తనకు వయసు కారణంగా ఇచ్చే గౌరవం అక్కర్లేదని చెప్పేసింది. అంతే కాదు… నాన్ వెజిటేరియన్ వంటకాలు చేసుకోవడం, తినడం, ఆ పైన ప్లేట్స్ కడగటంలో ఇతరులు చేస్తున్న పనితో తాను మానసికంగా ఎంత క్షోభకు గురి అవుతోందీ ఉమా తోటి కంటెస్టెంట్స్ కు చెప్పే ప్రయత్నం చేసింది. అయితే… ఆమె మాటలను మెజారిటీ సభ్యులు రూల్డ్ అవుట్ చేశారు. గతంలో కాజల్ చెప్పిన ‘నా పుట్టలో వేలు పెడితే ఊరుకోను’ అనే డైలాగ్ నే ఇప్పుడు యానిని ఉద్దేశించి ఉమ చెప్పడం విశేషం.

మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ రెండోవారం ఏకంగా ఏడుగురు సభ్యులను నామినేట్ చేశారు. అందులో ఊల్ఫ్ గ్రూప్ నుండి ఉమ, నటరాజ్, కాజల్ ఉండగా; ఈగల్ గ్రూప్ నుండి లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. విశేషం ఏమంటే.. 8వ రోజు రాత్రి పడుకునే ముందు బిగ్ బాస్ ను ఉద్దేశ్యించి నటరాజ్ మాస్టార్ మాట్లాడుతూ, ‘ఈ హౌస్ లోకి ఓ గుంటనక్క మేకరూపంలో వచ్చి, గొర్రెల్లాంటి ఏడుగురిని చెడగొట్టింది’ అన్న మాట కలకలం రేపింది. మరి మంగళవారం బిగ్ బాస్ హౌస్ సభ్యుల మధ్య నామినేషన్ వ్యవహారమే ఎక్కువగా చర్చకు వచ్చే ఆస్కారం ఉంది. తొలివారం నామినేషన్ అయిన వాళ్ళలో కేవలం కాజల్ రెండో వారం కూడా నామినేషన్స్ ఉంది. మిగిలిన వారందరికీ నామినేట్ కావడం ఇదే మొదటిసారి. మరి వారికి ప్రేక్షకుల నుండి ఏ రీతిన ఓట్లు దక్కుతాయో చూడాలి.