బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో బుధవారం ఆసక్తికరమైన ఆటలను ఆడించడం విశేషం. 23వ తేదీ రాత్రి భోజనం చేయకుండానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిద్రపోయారు. చిత్రం ఏమంటే సన్నీ మానస్ వెయిట్ లాస్ కావడం కోసం రాత్రి 1.30 అయినా లాన్ లో రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. మర్నాడు ఉదయం, అంటే 24వ రోజు హౌస్ లోని సభ్యులంతా ఎప్పటిలానే 9.00 గంటలకు నిద్రలేచి, దినచర్యను మొదలు పెట్టారు. ముందు రోజు రాత్రి ఆహారం తీసుకోకపోవడంతో అందరూ చాలా నీరసంతో కనిపించారు. ప్రియాంక లాంటి వాళ్ళైతే బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ ఇస్తే… అందులో పాల్గొనడం వల్ల కాస్తంత వెయిట్ లాస్ అవుతామనే భావన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కాస్తంత సమయం చిక్కడంతో… విశ్వ, నటరాజ్, లోబో, రవి, ప్రియ కలిసి ఓ టీమ్ గా ఏర్పడి ‘ఆకలి రాజ్యం’ మూవీలోని ఆకలికి సంబంధించిన సీన్ ను ఇమిటేట్ చేశారు. ఆహారం దొరకనప్పుడే ఆకలి విలువ తెలుస్తుందని, అనవసరంగా ఆహారాన్ని పడేసి కొందరు ఎంత తప్పు చేస్తుంటారో ఇప్పుడు అర్థమౌతోందని కొందరు మనసులో మాటను బయటకు చెప్పేశారు.
కెప్టెన్సీ నుండి జెస్సీ తొలగింపు
బిగ్ బాస్ చెప్పిన ఆదేశాలను పాటించనందుకు జెస్సీ కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించబడ్డాడు. మంగళవారం ఇంటిలోని ఆహారం మొత్తాన్ని స్టోర్ రూమ్ లో పెట్టేయమని బిగ్ బాస్ చెప్పినా, కొందరు కంటెస్టెంట్స్ తమ దగ్గర దాచుకున్న ఆహారాన్ని తినే ప్రయత్నం చేశారు. వారిని ఇచ్చేయమని జెస్సీ రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఇవ్వలేదు సరికదా మిగిలిన వాళ్ళు ‘మానవత్వం లేదా!’ అంటూ జెస్సీని విమర్శించారు. దాంతో అతను మిన్నకుండి పోయాడు. అదే బిగ్ బాస్ ఆగ్రహానికి కారణమైంది. సంచాలకుడిగా జెస్సీ సరిగా వ్యవహరించలేదని భావించిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నుండి జెస్సీని తొలగించడంతో పాటు అతనితో జోడీ కట్టిన ఆర్జే కాజల్ ను గేమ్ నుండి తొలగించాడు. అయితే కొంతలో కొంత కాజల్ కు ఓదార్పును కలిగిస్తూ, ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ కు ఆమెను సంచాలకురాలిగా నియమించాడు. తనను అందరూ లైట్ తీసుకున్నారని, దాంతో తానే బిగ్ బాస్ హౌస్ లో టార్గెట్ అయిపోయానని జెస్సీ వాపోయాడు. అయితే… అరవడం కాకుండా ఇతర సభ్యుల మీద కమాండ్ చూపించి ఉంటే బాగుండేదని షణ్ణు.. జెస్సీకి హిత బోధ చేశాడు. కానీ జెస్సీకి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది.
అబద్ధాల మాస్టర్ గా మారిపోయిన రవి!
బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ టైమ్ థండర్ సౌండ్ రాగానే విశ్వ బటన్ పై చేయి మొదట పెట్టాడు. దాంతో విశ్వ – రవి జంటకు తమ అపోనెంట్ ను టాస్క్ లో ఎంపిక చేసుకునే ఛాన్స్ దక్కింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి, టాస్క్ ఏమిటో తెలుసుకుని, ఆ తర్వాత తమకు అపోనెంట్ టీమ్ గా ప్రియా – ప్రియాంకను విశ్వ అండ్ రవి ఎంపిక చేసుకున్నారు. ఇంతకూ టాస్క్ ఏమిటంటే… గార్డెన్ ఏరియాలో ఉండే చెక్కలను రెండు ముక్కలుగా గొడ్డలితో కట్ చేయాలి. ఇది ఫిజికల్ స్ట్రెన్త్ ఉంటే కానీ గెలవలేని టాస్క్. ఈ టాస్క్ గురించి పూర్తిగా చదివిన తర్వాతే ప్రియాంక – ప్రియ జంటను ఎంపిక చేసుకున్న రవి… బయటకు వచ్చాక మాత్రం… టాస్క్ ఏమిటనేది తమకు తెలియదని, తెలికుండానే ప్రియా – ప్రియాంకను ఎంపిక చేసుకున్నామని చాలా తేలికగా అబద్ధం ఆడేశాడు. ముందు అనుకున్నట్టుగా ‘వేటు’గాళ్ళు అనే ఈ టాస్క్ లో విశ్వ – రవి టీమ్ గెలిచింది. మొత్తం 26 కట్టెలను వీరిద్దరూ కలిపి కొట్టగా, ప్రియా – ప్రియాంక కేవలం 16 కట్టెలనే కొట్టగలిగారు. సోమవారం షణ్ముఖ్ తనను నామినేట్ చేయడాన్ని రవి జీర్ణించుకోలేకపోయాడు. దాంతో డౌట్ ను షణ్ణును అడిగేశాడు రవి. దానికి షణ్ణు చాలా క్లియర్ గా కారణం చెప్పేశాడు. రవి తనకు తెలియకుండానే ఇతరులను ఇన్ ఫ్లుయెన్స్ చేస్తున్నాడని స్పష్టం చేశాడు. ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ టాస్క్ లో పెళ్ళిళ్ల పేరయ్య పాత్ర పోషించిన తనను రవినే మొదట బ్రోకర్ అని పిలిచాడని, ఆ తర్వాత ఐదారుగురు అదే పేరుతో పిలవడం మొదలెట్టారని, అది తనను చాలా హర్ట్ చేసిందని షణ్ణు చెప్పాడు.
మునుగుతారా… తేలతారా!!
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మూడోసారి థండర్ సౌండ్ రాగానే సన్నీ బటన్ పై మొదట చేయి పెట్టాడు. దాంతో సన్నీ – మానస్ జంటకు అపోనెంట్స్ ను ఎంపిక చేసుకునే ఛాన్స్ దక్కింది. దాంతో వాళ్ళు నటరాజ్ మాస్టర్ కు ముందే మాట ఇవ్వడం వల్ల వారినే ఎంపిక చేసుకున్నారు. ఇది ముందుగా తమ మధ్య ఏర్పడి అండర్ స్టాండింగ్ అని సన్నీ – మానస్ హౌస్ మేట్స్ అందరికీ చెప్పడం గొప్ప విషయం. లోబో ఆహారం తీసుకోకుండా ఎంతో కష్టపడుతున్నాడని, అలానే నటరాజ్ మాస్టర్ సిన్సియర్ గా ఆడుతున్నారని, ఇప్పటికే ఓ టాస్క్ లో ఓడిపోయిన వారు ఈసారి అయినా గెలవాలనే మంచి మనసుతోనే వారికి ఛాన్స్ ఇచ్చామని వారు చెప్పారు. ఇప్పుడు బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ‘మునుగుతారా… తేలతారా’. గార్డెన్ ఏరియాలో ఓ పెద్ద వాటర్ టబ్ ను ఏర్పాటు చేశారు. ఇంటిలో నిత్యం ఉపయోగించే వస్తువులు అందులో వేస్తే మనుగుతాయో, తెలతాయో బుర్రను ఉపయోగించి రెండు జట్లు చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ సరైన జవాబులు చెబితే వారు గెలిచినట్టు. ఇందులో కళ్ళజోడు, పంచదార ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్, ఎరైజర్, కీర, అనాస, పుచ్చకాయలను ఇచ్చి అవి మనుగుతాయో తేలతాయో చెప్పమని కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ కోరాడు. అందులో లోబో అండ్ నటరాజ్ కు 8 మార్కులు రాగా, మానస్ – సన్నీ 9 మార్కులతో విజేతలుగా నిలిచారు. మరోసారి లోబో అండ్ నటరాజ్ ఓడిపోవడంతో వారి వెయిట్ మరో హాఫ్ కేజీ పెరిగిపోయినట్టు అయ్యింది.
దమ్ ఘోష్ బిర్యానీతో విందు!
గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్ లో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ ఘనాహారం తినకూడదని షరతు పెట్టిన బిగ్ బాస్ మరోపక్క వాళ్ళను టెంమ్ట్ చేస్తూ రకరకాల ఆహార పదార్థాలను విందు బండిలో సమయానుసారంగా పెడుతూ వచ్చాడు. మొదటగా వచ్చిన పావ్ బాజీని ఎవరూ తినకుండా రిజెక్ట్ చేశారు. అయితే ‘వేటు’గాళ్ళు టాస్క్ లో పాల్గొని అలసి పోయిన ప్రియాంక ఆ తర్వాత ఫ్రైడ్ చికెన్ బర్గర్ రాగానే దాన్ని ఆరగించేసింది. ‘మునుగుతారా… తేలతారా’ టాస్క్ అయిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరి కోసం దమ్ ఘోష్ బిర్యానీ పంపాడు. అయితే… కంపల్సరీగా దానిని తినాలనే రూల్ ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు తినకుండా ఉండొచ్చునని చెప్పాడు. దాంతో సిరి, షణ్ముఖ్; శ్రీరామ్, హమీదా; మానస్ – సన్నీ జంటలు బిర్యానీని తినలేదు. అలానే లోబో గట్టిగా బిర్యానీని లాగించినా అతనితో జత కట్టిన నటరాజ్ మాస్టర్ బిర్యానీని ముట్టలేదు. మరి గురువారం బిగ్ బాస్ ఇంకే విధమైన టాస్కులను మిగిలిన సభ్యులకు ఇస్తాడో, వాటిలో విజేతలుగా నిలిచి ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.