NTV Telugu Site icon

పారాలింపిక్స్‌.. చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించారు… టేబుల్‌ టెన్నిస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి ఇప్పటికే పతకాన్ని ఖాయం చేసుకున్న ఆమె.. ఇవాళ గోల్డ్ మెడల్‌ కోసం జరిగిన పోరులో పరాజయాన్ని చవిచూసింది.. ప్రపంచ నంబర్‌ వన్‌, చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు.. దీంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కాగా, మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్భుత విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. ఇక, చైనాకు చెందిన మియావో జాంగ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక, ఇవాళ జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడినా పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన చరిత్ర సృష్టించింది. ఇక, పారాలింపిక్స్‌లో కొత్త రికార్డు సృష్టించిన భవీనా పటేల్‌కు అభినందనలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.