NTV Telugu Site icon

Australia floods: ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు.. భారతీయురాలి మృతి

Australia Floods

Australia Floods

ఆస్ట్రేలియాను (Australia floods) భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, భవనాలు అన్ని ఏకమైపోయాయి. పలు కార్లు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇదిలా ఉంటే ఈ వరదల్లో ఓ భారతీయురాలు ప్రాణాలు కోల్పోయింది. క్వీన్స్‌లాండ్‌లోని మౌంట్ ఇసా ( Mount Isa) సమీపంలో ఆమె మృతిచెందినట్లు ఆస్ట్రేలియాలోని భారత హైకమిషన్ తెలిపింది.

క్వీన్స్‌లాండ్‌లో (Queensland) ఫిబ్రవరి 16న వరద నీటిలో భారతీయ జాతీయ మహిళ శవాన్ని అధికారులు కనుగొన్నారు. మరణవార్త తెలియగానే ఆమె కుటుంబానికి భారత్ కమీషన్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. సహాయం కోసం ఫ్యామిలీ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కమీషన్ పేర్కొంది.

ఆస్ట్రేలియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితులు భయానకరంగా మారాయి. కొన్ని రోజులుగా క్వీన్స్‌లాండ్ ప్రాంతం ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. సన్‌షైన్ కోస్ట్ కౌన్సిల్ ఏరియాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు తీవ్రమైన పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షపాతం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫాను ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని క్వీన్స్‌లాండ్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బ్రిస్బేన్‌లోని కొన్ని ప్రాంతాలలో 200 మిల్లీమీటర్ల వరకు వర్షం నమోదైందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసినా.. రక్షించడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ క్వీన్స్‌లాండ్‌లో భయంకరమైన వరదలు కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆస్త్రేలియాలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని క్వీన్స్‌లాండ్ పోలీసులు కోరారు. వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. వరద నీటిలోకి ప్రవేశించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.