NTV Telugu Site icon

రివ్యూ: ఆకాశవాణి

Ashwin Gangaraju Aakashavaani Movie Review

Ashwin Gangaraju Aakashavaani Movie Review

ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఆకాశవాణి’. శుక్రవారం నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘వివాహ భోజనంబు’, ‘ప్రియురాలు’ తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రమిది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్న అశ్విన్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ.

ఒకానొక సమయంలో, ఒకానొక చోట జరిగే కథ ఇది. నాగరిక ప్రపంచానికి సుదూరంగా, కొండకోనల్లో ఉండే ఓ గూడెంకు చెందిన వ్యక్తుల వ్యథ ఇది. చెట్టు తొర్రలోని ఓ బండ రాయిని దేవుడిగా కొలిచే గూడెం వాసులంతా, తమను దారుణంగా దండించే దొర (వినయ్ వర్మ) దేవుడి ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నాడని పిచ్చిగా నమ్ముతుంటారు. ఊహించని విధంగా ఆ దేవుడి బండ స్థానంలోకి రేడియో వచ్చి చేరుతుంది. దాన్నీ దేవుడిగానే వారు భావించి కొలుస్తుంటారు. అలాంటి వారి జీవితంలోకి చంద్రం మాస్టర్ (సముతిర కని) వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆకాశవాణి’ చిత్రం.

ఈ సినిమాలో చూపించినంత అమాయకంగా, స్వచ్ఛంగా గూడెం జనాలు ఇవాళ ఉన్నారా అనే ప్రశ్న ఉదయించక మానదు. అయితే వారి శాతం తక్కువే అయినా… కొంతమంది అయితే లేకపోలేదు. మరీ అంత అమాయకంగా ఉండకపోయినా, వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్న దొరలకు బానిసగా బతుకీడుస్తున్న వారు ఉన్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తే… ‘ది గాడ్స్ మస్ట్ బీ క్రేజీ’ మూవీ సీరిస్ గుర్తొస్తుంది. గూడెం జనాల అమాయకత్వం, రక్త సంబంధీకులతో బంధం తెగిపోయినప్పుడు దేవుడి మీదనే భారం వేయడం, గూడెంలోని మనిషి కనుమరుగు కాగానే దీపంగా మారిపోయాడని భావించడం, దొర దాష్టికం తెలిసినా మౌనంగా భరించడం… ఇలాంటివి చూస్తుంటే… ఈ తరహా జనాలు ఇంకా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. రేడియోను దేవుడిగా భావించే వారికి హిరణ్యకశ్యప – ప్రహ్లాద గాథ ద్వారా వాస్తవాన్ని తెలియచెప్పడం ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో దొర చావుకు కూడా ఆ పౌరాణిక గాథను బేస్ చేసుకోవడం బాగుంది.

ఈ సినిమాకు ప్రధాన బలం కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం, సురేశ్ రగుతు ఛాయాగ్రహణం. అలానే బుర్ర సాయిమాధవ్ మాటలు, అనంత శ్రీరామ్ పాటలు కూడా సందర్భాను సారంగా ఉన్నాయి. ఓ పాటలో అనంత శ్రీరామ్ సైతం గొంతు కలిపాడు. థింసారే సాంగ్ పిక్చరైజేషన్ చక్కగా ఉంది. బుర్ర కథను రిపీట్ చేయకుండా ఉండాల్సింది. ఈ చిత్రానికి సీనియర్ ఎడిటర్ శ్రీకర ప్రసాద్ వర్క్ చేయడం విశేషం. సినిమా ప్రథమార్థంలో గూడెం జనం అమాయకత్వాన్ని తెలియచేయడానికి దర్శకుడు అధిక సమయం కేటాయించడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యే ఛాన్స్ ఉంది. ఇక రేడియో ఇరవై నాలుగు గంటలూ ఆన్ చేసి ఉన్నా… బ్యాటరీలు నెలల తరబడి ఎలా పనిచేశాయో దేవుడికెరుక. అలానే బాలనటుడి మెడలో రాగి రేకు విషయంలో కంటిన్యుటీని డైరెక్షన్ టీమ్ చూసుకోలేదనిపిస్తోంది. రాజమౌళి శిష్యుడి సినిమా అంటే ఇలాంటి చిన్న చిన్న అంశాలలో నిర్లక్ష్యం చూపిస్తారని ఎవరూ ఊహించారు. నిజానికి దర్శకుడు తాను చెప్పాలనుకున్న అంశాన్ని ముగింపులో ప్రభావవంతంగా చెప్పారు. కానీ సహజత్వం పేరుతో దర్శకుడు చాలా కాలహరణం చేయడంతో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హమ్మయ్యా… మొత్తానికి సినిమా పూర్తయ్యింది అనే భావనే వీక్షకులకు కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే… గిడ్డడుగా నటించిన మాస్టర్ ప్రశాంత్ తన అమాయకత్వంతో ఆకట్టుకున్నాడు. అతని తండ్రిగా మైమ్ మధు కూడా చక్కగా చేశాడు. ఇప్పటికే ‘దొరసాని’లో దొర పాత్ర చేసిన వినయ్ వర్మకు ఇది కొనసాగింపు పాత్ర అనుకోవచ్చు. అరవీర భయంకరుడు సాంబడుగా కనిపించే తేజ కాకుమాను ఆహార్యం… ‘విక్రమార్కుడు’లో అజయ్ పోషించిన టిట్లా పాత్రను, ‘బాహుబలి’లో ప్రభాకర్ చేసిన కాలకేయ పాత్రను గుర్తు చేస్తోంది. ఇటీవల వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’లో కులపెద్దగా నటించిన పెద్దాయన ఇందులో గూడెం పూజారిగా చక్కగా నటించాడు. గెటప్ శ్రీనును సరిగా ఉపయోగించుకోలేదు. అలానే సముతిర కని వంటి చక్కని నటుడిని చంద్రం మాస్టర్ పాత్రకు తీసుకోవడం మంచి నిర్ణయమే అయినా… ఆ పాత్రను దర్శకుడు ప్రభావవంతంగా రాసుకోలేదనిపిస్తుంది. సముతిర కని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

నిజానికి మూడేళ్ళ క్రితం ఈ సినిమాను ప్రారంభించినప్పుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ దీనికి నిర్మాత. కానీ ఆ తర్వాత మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో అతనీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో నిర్మాణ బాధ్యతలను పద్మనాభరెడ్డి భుజానికెత్తున్నారు. సినిమా ప్రారంభం నుండి విడుదల సమయం వరకూ ప్రచారం భారీగానూ, భిన్నంగానూ జరుగుతూ వచ్చింది. దాంతో సహజంగానే మూవీ మీద అంచనాలూ పెరిగాయి. జూన్ 4న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాను ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అదే మంచిదయ్యింది. ఎందుకంటే ఇలాంటి చిత్రాలను థియేటర్లలో ప్రేక్షకులు ఓపికగా చూడటం చాలా కష్టం. అదే ఓటీటీలో అయితే… సమయం చిక్కినప్పుడు, చూడగలిగినంత సేపు చూసి వదిలేయవచ్చు. కథతో కనెక్ట్ అయిన వారు ఎలానూ ఓపికగా చివరి వరకూ చూస్తారు. సో… ఎవరికీ ఏమీ ఇబ్బంది ఉండదు!

చివరగా ఓ మాట… దర్శకుడు తన తొలి చిత్రానికి ఇలాంటి కథను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్యలో షుగర్ కోటెడ్ పిల్ గా సందేశాన్ని అందిస్తే ఓకే కానీ… ఇలా సూటిగా, స్పష్టంగా చెప్పడంతో జనాలు జీర్ణించుకోలేరు. ఏదేమైనా… రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ పొందిన అశ్విన్ గంగరాజుతో సురేశ్ బాబు ఓ మర్డర్ మిస్టర్ మూవీని తీయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దానితో అయినా అశ్విన్ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.

ప్లస్ పాయింట్స్

మైనెస్ పాయింట్స్

ట్యాగ్ లైన్: సిగ్నల్స్ కట్!

రేటింగ్ : 2 / 5