ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశం ముగిసింది.. ఒడిశా సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చించారు.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కానుంది.. ఒడిశా అభ్యంతరాలతో సుదీర్ఘంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ సాగగా.. సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి పాల్గొన్నారు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు గ్రామాలు, ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం ఎజెండాగా సాగింది.
ఆరు అంశాల పై పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు సీఎంలు.. కొఠియా గ్రామాల సమస్య, నేరడి బ్రిడ్జ్, జంఝావతి రిజర్వాయర్, పోలవరం, బహుదా నది ద్వారా నీటి విడుదల, బలిమెల,ఎగువ సీలేరు విద్యుత్ అంశాల పరిష్కారం కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. గంజాయి ఉత్పత్తి-రవాణా, వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవటానికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. శ్రీకాకుళం జిల్లాలోని బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒరిస్సా భాషకు, ఒరిస్సాలోని భరంపూర్ యూనివర్సిటీలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల్లో ఇరు భాషల బోధనకు ఉపాధ్యాయుల నియామకం, భాషా పుస్తకాల ముద్రణ, పరీక్షల ద్వారా ప్రజల్లో సోదర భావం పెంచే దిశగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
