NTV Telugu Site icon

దాదాపు 500 కోట్ల పంట నష్టం జరిగింది : అన్వేష్ రెడ్డి

అకాల వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం రైతులు తీవ్రంగా నష్టపోయారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకీల విత్తనాల కారణంగా మిర్చి రైతులకు వచ్చే క్వింటాల్‌ మిర్చి కూడా అకాల వర్షాలతో రాకుండా పోయిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోయిందని ఆయన వెల్లడించారు. దాదాపు 500 కోట్ల పంట నష్టం జరిగిందని, పంట నష్టం జరిగితే ఏడేళ్లలో ఇంత వరకు ఒక్క పైసా కూడా వచ్చింది లేదన్నారు. 2018 నుండి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింది ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల పంటల బీమా పథకం ద్వారా రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

ఒకవైపు రైతులు నష్టపోతుంటే.. రైతు బంధు సంబరాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే లకు సిగ్గుండాలని ఆయన విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంటలకు విత్తన, ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని, మిర్చి రైతులు 2 లక్షల ఎకరాల పంట నష్టపోయారని ఆయన అన్నారు. మిర్చి విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు.