NTV Telugu Site icon

షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖ యాంకర్

తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… సమాజంలో మార్పు తెచ్చేందుకు షర్మిల చేపట్టిన పాదయాత్రలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

Read Also: తెలంగాణ లో మరో కొత్త పార్టీ

తాను మొదటి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానిని అని యాంకర్ శ్యామల వెల్లడించారు. అందుకే షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. గత 8 రోజులుగా తన అక్క షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని.. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అక్కతో చెప్పడం తాను స్వయంగా చూశానన్నారు. ఒకవైపు మహానేత కుమార్తె, మరోవైపు సీఎంకు సోదరి అయిన అక్క షర్మిల సంతోషంగా జీవించొచ్చని.. కానీ ఆమె తన నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు కొనసాగుతుండటం చాలా గొప్ప విషయమని యాంకర్ శ్యామలా అభిప్రాయపడ్డారు. కాగా వైఎస్ఆర్ తన పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.