Site icon NTV Telugu

సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం

దీపావళి అనగానే సదర్ ఉత్సవాలు స్పెషల్. ఏటా హైదరాబాద్ లో జరిగే సదర్ ఉత్సవాలకు రంగం సిద్ధమయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దున్నపోతులు సందడి చేస్తాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో సదర్‌ ఉత్సవాలు జరుగుతాయి. ఖైరతాబాద్‌ గణపతి ప్రాంగణం నుంచి మార్కెట్‌ చౌరస్తా వరకు శుక్రవారం సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్‌ ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, రఘునందన్‌రావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి అతిథులుగా పాల్గొంటారు. ఖైరతాబాద్‌ సోమాజిగుడ, పంజాగుట్ట, దోమల్‌గూడ, చింతలబస్తీ, పురానాపూల్‌ తదితర ప్రాంతాల నుంచి దున్నపోతులు ఊరేగింపుగా వస్తాయన్నారు.ఉత్సవాలకు హర్యానా నుంచి రూ.16 కోట్ల విలువచేసే కింగ్‌, సర్తాజ్‌ దున్నపోతులను తీసుకువస్తున్నారు. ఈ దున్నపోతులు ఎంత ఘనంగా వుంటాయో వాటి ధరలు కూడా మామూలుగా వుండవు.

కింగ్‌ దున్నపోతు వయస్సు నాలుగున్నరేళ్ళు. బరువు 1500 కిలోలు. పొడవు 15 అడుగులు, ఎత్తు 5.6 అడుగులు. ప్రతిరోజు దీని ఆహారం ఖర్చు రోజుకు రూ.2,500-3,000. రోజూ 10 కిలోల ఆపిల్‌, 8 లీటర్ల పాలు, కిలో బెల్లం, 2 కిలోల చొప్పున కందిపప్పు, శనగపప్పు తదితరాలు అందిస్తారు. నిత్యం రెండుమార్లు స్నానం చేయించి కిలోన్నర ఆవ నూనెతో మసాజ్‌ చేస్తారు. సర్తాజ్‌ వయసు ఏడేళ్ళు. బరువు 1600 కిలోలు, ఎత్తు 7 అడుగులు, పొడవు 15 అడుగులు. ఈ దున్నకు కింగ్‌లాగే ఖర్చు చేస్తారు. సదర్ ఉత్సవాలు ఈ ఖరీదైన దున్నపోతులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. వాటి కొమ్ములను కూడా అందంగా తీర్చిదిద్దుతారు.

Exit mobile version