Site icon NTV Telugu

కోవిడ్‌పై బూస్టర్‌ డోస్‌.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక వ్యాఖ్యలు

కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.. మహమ్మారిపై విజయం సాధించడానికి భారత్‌లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 58,14,89,377 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు అధికారులు.. ఇందులో ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నవారు.. ఫస్ట్‌ మరియు సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.. అయితే, ఇప్పుడు, ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ మాత్రమే కొనసాగుతోంది.. మరోవైపు బూస్టర్‌ డోస్‌ (మూడో డోసు)పై కూడా చర్చ సాగుతోంది. ఈ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా బూస్టర్‌ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బూస్టర్‌ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని స్పష్టం చేసిన డాక్టర్‌ గణదీప్ గులేరియా.. వచ్చే ఏడాది మొదటట్లో సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.. యూఎస్‌, యూకే, ఇజ్రాయెల్‌ సహా అనేక దేశాలు మహమ్మారిపై పోరాడేందుకు ప్రజలకు బూస్టర్‌ డోసులు వేయాలని ఆలోచన చేస్తున్నాయి.. థర్డ్ డోస్‌తో అధిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలో గులేరియా మాట్లాడుతూ.. భారత్‌లో డేటా ప్రస్తుతం బూస్టర్‌ డోస్‌ అవసరమని చెప్పడానికి తమ వద్ద తగినంత డేటా ఉందని అనుకోవడం లేదన్న ఆయన.. వ్యాక్సిన్ల నుంచి ప్రజలకు కలిగే రక్షణపై పూర్తి డేటా ఉన్నప్పుడే.. దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనికోసం మరిన్ని పరిశోధన అవసరమని, మరికొద్ది నెలలు సమయం పట్టే అవకాశం ఉందని.. బహుశా వచ్చే ఏడాది నాటికి బూస్టర్‌ డోస్‌ ఏంటి? అది ఎవరికి అవసరం? అనే డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వేసుకున్నవారు మహమ్మారి నుంచి రక్షణ పొందడం చూస్తున్నాం.. ఆస్పత్రుల్లో చేరే సంఖ్య కూడా భారీగా తగ్గిందన్న గులేరియా.. ఏదో ఒక సమయంలో బూస్టర్‌ డోస్‌ కూడా అవసరం కావొచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version