నటన, సమాజసేవను బ్యాలెన్స్ చేస్తున్న గౌతమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 2 నటి గౌతమి పుట్టిన రోజు సందర్భంగా)
విశాఖలో పుట్టి, బెంగళూరులో పెరిగింది అందాల గౌతమి. 1968 జూలై 2న జన్మించిన గౌతమి ఇవాళ 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. ‘దయామయుడు’ సినిమాలో సరదాగా కనిపించినా, పి.ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన ‘గాంధీనగర్ రెండో వీధి’లో హీరోయిన్ గా నటించింది. మోడర్న్ గర్ల్ ను తలపించే గౌతమికి కెరీర్ ప్రారంభంలోనే తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్, ప్రభు హీరోలుగా నటించిన ‘గురుశిష్యన్’లో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించింది గౌతమి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ నటిగా అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకుంది. తెలుగులో ‘శ్రీనివాస కళ్యాణం, బజార్ రౌడీ, భార్యభర్తలు, తోడల్లుళ్ళు, ఆగస్ట్ 15 రాత్రి’ వంటి సినిమాలలో నటించింది. అలానే ‘బామ్మ మాట బంగారు బాట, చైతన్య, సంకల్పం, అన్న’ వంటి చిత్రాలూ గౌతమికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే మాస్ హీరోలతో సూపర్ హిట్స్ మాత్రం గౌతమికి తెలుగులో లభించలేదు. అదే సమయంలో తమిళనాడులో టాప్ హీరోస్ గా రాణిస్తున్న రజనీకాంత్, కమల్ హాసన్ సరసన పలు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా ‘అపూర్వ సోదరంగళ్, రాజా చిన్ని రోజా, దేవర మగన్’ వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇక గౌతమి వెనుదిరిగి చూసుకోలేదు. అటు కన్నడ, మలయాళ, ఇటు హిందీ భాషల్లోనూ అవకాశాలు గౌతమిని వెతుక్కుంటూ వచ్చాయి. అర్జున్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘జంటిల్మాన్’లో ప్రభుదేవాతో కలసి ‘చికుబుకు చికుబుకు రైలే’ పాటలో నర్తించిన గౌతమి కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం పొందేసింది. నటిగా పుష్కర కాలం పాటు ప్రేక్షకులను మెప్పించిన ఆమె 1998లో సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వారికి సుబ్బులక్ష్మీ అనే పాప పుట్టింది. ఆ వెంటనే గౌతమి భర్తకు విడాకులిచ్చేసింది. బాధాకరం ఏమంటే… కూతురుకు ఐదేళ్ళ వయసులో గౌతమి క్యాన్సర్ బారిన పడింది. అయితే తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన మోరల్ సపోర్ట్ తో గౌతమి క్యాన్సర్ ను జయించింది.
Also Read
వివాహబంధం విఫలమైనా, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనా గౌతమి చలించలేదు. మనోధైర్యంతో చిత్రసీమలో నిలిచి, తన సత్తాను చాటుకుంది. సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ, లేనప్పుడు టీవీ షోస్ చేస్తూ నెగ్గుకొచ్చింది. తమిళంలో ‘ఇందిర’ సీరియల్ లో గౌతమి ప్రధాన పాత్ర పోషించింది. అదే సమయంలో ఆమెకు కమల్ హాసన్ బాసటగా నిలిచాడు. ఐదేళ్ళ పాటు ఒంటరి పోరాటం చేసిన గౌతమి 2004లో కమల్ హాసన్ నీడన చేరింది. ఆ సమయంలో కమల్ హాసన్ నటించి, నిర్మించిన పలు చిత్రాలకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. క్యాన్సర్ ను జయించిన అనంతరం తానే ఓ మోటివేటర్ గా మారి, క్యాన్సర్ రోగులలో ధైర్యాన్ని నింపే పనిని గౌతమి చేపట్టింది. ఈ క్రమంలో లైఫ్ అగైన్ ఫౌండేషన్ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది గౌతమి. దాదాపు 16 సంవత్సరాల తర్వాత గౌతమి మలయాళ చిత్రం ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశనం’లో కమల్ సరసన నటించింది. అయితే 13 సంవత్సరాల కమల్ తో సహజీవనానికి గౌతమి బ్రేక్ చెప్పేసింది. కమల్ హాసన్ నీడలో తనకు ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ కరువు అవుతున్నాయంటూ కూతురుతో కలిసి కమల్ ఇంటి నుండీ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పరభాషా చిత్రాలలోనూ నటించడం మొదలు పెట్టింది. ఆ రకంగా మోహన్ లాల్ సరసన తెలుగు సినిమా ‘మనమంతా’లో గౌతమి నాయికగా నటించింది. చాలా యేళ్ళ తర్వాత గౌతమి నటించిన స్ట్రయిట్ తెలుగు చిత్రం ఇదే.
ప్రస్తుతం గౌతమి తమిళంతో పాటు మలయాళ చిత్రాలలోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తోంది. అంతే కాకుండా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల సమయంలో రాజకీయంగానూ క్రియాశీల పాత్రను పోషించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలైన గౌతమి, కమల్ హాసన్ పార్టీకి వ్యతిరేకంగా పలు సభలలో పాల్గొంది. కమల్ హాసన్ ఓటమిలోనూ గౌతమి పాత్ర ఉందనడంలో సందేహం లేదు. నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, రాజకీయ నేతగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం తనని తాను అప్ డేట్ చేసుకోవడం గౌతమికి అలవాటు. అందుకే ఈ తరంతోనూ కలిసి ముందడుగు వేస్తోందామె. నటన – సమాజసేవలను బ్యాలెన్స్ చేస్తోంది. 54వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమి సంపూర్ణ ఆరోగ్యంతో మరికొంత కాలం నటిగా చిత్రసీమకు సేవ చేయాలని కోరుకుందాం.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?