NTV Telugu Site icon

విశాల్ మనవాడే!

Vishal Birthday Special

Vishal Birthday Special

(ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు)

యంగ్ హీరో విశాల్ సినిమాలంటే మాస్ మసాలాతో నిండి ఉంటాయి. అన్ని వర్గాలను అలరించే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. విశాల్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ఇప్పటికీ విశాల్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూసేవారు తెలుగునాట ఎంతోమంది ఉన్నారు.

విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఆయన తండ్రి జి.కె.రెడ్డి గతంలో చిత్ర నిర్మాత. చిరంజీవి హీరోగా ‘ఎస్.పి.పరశురామ్’ అనే చిత్రాన్ని జి.కె.రెడ్డి నిర్మించారు. తరువాత తమిళంలోనూ జి.కె.రెడ్డి కొన్ని చిత్రాలకు భాగస్వామిగా ఉన్నారు. దాంతో చిన్నతనం నుంచే విశాల్ కు, అతని అన్న విక్రమ్ కృష్ణకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. చెన్నైలోని లయోలా కాలేజ్ నుండి విజువల్ కమ్యునికేషన్స్ లో పట్టా పొందారు విశాల్. చదువు పూర్తయిన తరువాత అన్నదమ్ములిద్దరూ చిత్రసీమలో అడుగు పెట్టారు. తొలుత అర్జున్ హీరోగా రూపొందిన ‘వేదం’ చిత్రంలో చిన్న పాత్రలో నటించారు విశాల్. ఆ సినిమాకు అర్జున్ దర్శకుడు. ఆయనకు అసిస్టెంట్ గానూ పనిచేశారు. తరువాత గాంధీ కృష్ణ దర్శకత్వంలో ‘చెల్లమే’ చిత్రంలో హీరోగా నటించారు విశాల్. ఈ సినిమాను తెలుగులో ‘ప్రేమచదరంగం’ పేరుతో అనువదించగా మంచి ఆదరణ చూరగొంది. తరువాత లింగు స్వామి దర్శకత్వంలో విశాల్ అన్న విక్రమ్ కృష్ణ నిర్మించిన ‘సందై కోడి’ తెలుగులో ‘పందెం కోడి’గా విడుదలై విజయం సాధించింది. ఆ పై విశాల్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోనూ అనువాదమై ఇక్కడా విజయకేతనం ఎగురవేశాయి.

తెలుగువాడయిన విశాల్ తమిళనాట జయభేరీ మోగిస్తూన్నారు. ఆయన స్పీడును అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించారు. విశాల్ మాత్రం చెదరక బెదరక ముందుకు సాగారు. ‘నడిగర్ సంఘం’లో అంతకు ముందు జరిగిన లొసుగులను ఎత్తి చూపుతూ, విశాల్ ఆయన మద్దతుదారులు పోటీ చేసి, పాత టీమ్ ను చిత్తుగా ఓడించారు. విశాల్ ఘాటు విమర్శలు విని ‘తమిళ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ తట్టుకోలేక పోయింది. దాంతో విశాల్ ను నిర్మాతల మండలి నుండి బహిష్కరించింది. అయితే వారిపై సవాల్ చేసి మరీ విశాల్ 2017లో జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షునిగా విజయం సాధించారు. ఇలా తమిళనాట తనదైన బాణీ పలికిస్తున్న విశాల్ మనవాడే కావడంతో తెలుగునాట కూడా ఆయనకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే కొంత కాలంగా విశాల్ వివాదాలలో చిక్కుకుని విజయానికి దూరంగా సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నారు విశాల్. వాటి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టినరోజు నుంచైనా విశాల్ మళ్ళీ సక్సెస్ బాట పడతాడేమో చూద్దాం.