NTV Telugu Site icon

సిరివెన్నెల శివతత్వం!

సిరివెన్నెల పేరులో సీతారాముడున్నా, ఆయన మనసులో మాత్రం కైలాసవాసుడే కొలువై ఉన్నాడని చెప్పకతప్పదు. నుదుట త్రిపుండ్రాలు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ కవిత్వం పలికించేవారు సీతారామశాస్త్రి. సందర్భం ఏదైనా సరే, అలవోకగా పదబంధాలు పేర్చేవారు. తన కెరీర్ లో శివునిపై పలు పాటలు పలికించి పులకింప చేశారు సీతారామశాస్త్రి. ‘సిరివెన్నెల’లోనే “ఆది భిక్షువు వాడినేది కోరేది… బూడిదిచ్చేవాడినేది అడిగేది…” అంటూ నిందాస్తుతితో శివునిపై ఆయన పలికించిన గీతం ఈ నాటికీ భక్తకోటిని పులకింప చేస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కెరీర్ లో మొత్తం మూడు వేలకు పైగా పాటలు పలికించారు. వాటిలో దాదాపు పది శాతం అంటే మూడువందల పాటలలో శివతత్త్వాన్నే వినిపించారు సిరివెన్నెల.

‘చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా…’ అంటూ ‘రుద్రవీణ’లో సీతారామశాస్త్రి పలికించిన పాటలోని పదాలను పరిశీలిస్తే, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడు ముక్కంటి అని ఇట్టే తెలిసిపోతుంది. అంటే పసిపిల్లలు దేవునితో సమానం అనే పోలికను చెప్పకనే చెప్పారు సిరివెన్నెల. ‘స్వర్ణకమలం’ కథావస్తువే నాట్యం చుట్టూ తిరుగుతూ సాగుతుంది. దాంతో నటరాజును పలుమార్లు ధ్యానిస్తూ తన్మయం చెందారు సీతారామశాస్త్రి. అందులోని నాయికను నాయకుడు “శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా…” అంటూ సంబోధించేలా సీతారాముని కవిత పొంగిపొరలింది. అదే చిత్రంలో “నటరాజు తాండవమాడె…” పాటను, “ఓం నమశ్శివాయ…” అంటూ మొదలై, “అందెలరవమిది పదములదా…” అంటూ సాగే పాటనూ శివనర్తన పూజతోనే నింపేశారు సిరివెన్నెల. ఆ చిత్రంలోనే “ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు…” పాటలోనూ శివతత్వమే కనిపిస్తుంది.
‘గాయం’సినిమాలో “సురాజ్యమవలేని… స్వరాజ్యమెందుకని…” పాటలో “ఆవేశంలో ప్రతినిమిషం ఉరికే నిప్పుల జలపాతం…” అంటూ సీతారాముని కలం పదబంధాలు పేర్చింది. కంఠంలో గరళాన్ని నింపుకున్న శివుని శిరసుపైనే జల ఉంటుంది. అర్థం చేసుకుంటే ఈ పాటలోనూ శివతత్వం బోధపడుతుంది.

‘చక్రం’ చిత్రంలోని “జగమంత కుటుంబం నాది…” పాటను పరికించి చూడండి. అందులో అణువణువునా శివతత్వమే నిండి ఉంది. లోకమంతా శివునిదే అయినా, ఆయన మాత్రం కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఒంటరిగానే ఉంటారు. మేనిలో సగమైన గిరినందన సువాసనలు వెదజల్లుతున్నా, బూడిద పూసుకుతిరుగుతుంటాడు శివుడు. అదే భావాన్ని ఈ పాటలో “మల్లెల దారిలో మంచు ఎడారిలో…” అంటూ పలికించారు సీతారామశాస్త్రి. అందులోనే “మంటల మాటున వెన్నెల నేనై… వెన్నెల కూతల మంటను నేనై…” అంటూ పలికించారు. తలపై వెన్నెల రాజును పెట్టుకున్న నీలకంఠుని గళంలో మంటలేగా ఉన్నది.

‘గమ్యం’లోని “ఎంతవరకూ ఎందుకొరకు…” పాటలో “మన్నూ మిన్నూ నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా…” అంటారు సీతారామశాస్త్రి. ఇందులోనూ శివతత్వమే గోచరిస్తుంది. మన్నూ, మిన్నూ అంతటా గంగాధరుడే ఉన్నాడన్నది ఇందులో దాగిన సత్యం. ‘పట్టుదల’లో కోసం ఆయన కలం పలికించిన “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి…” అనే గీతం నిజంగానే యువతకు స్ఫూర్తిదాయకం. అందులోనూ ఓ చోట “నిరాశకే నిరాశ పుట్టదా…” అంటూ ఆశలు రేకెత్తిస్తారు. పంచముఖుని కోసం పార్వతి తపించిన రోజుల్లో ఆమెలో నిరాశ ఏమాత్రం చోటు చేసుకోలేదు, ఆ అర్థం వచ్చేలా స్ఫూర్తి నింపుతూ అలా పలికించారు సీతారామశాస్త్రి.

‘పౌర్ణమి’ సినిమా కోసం సిరివెన్నెల పలికించిన “భరత వేదముగ నిరత నాట్యముగ… పలికిన పదమిది ఈశా…” గీతమయితే, భక్తికీర్తనగా అనేక శివాలయాలలో మారుమోగింది. ఇలా చెప్పుకుంటూ పోతే సీతారాముని కలం నుండి శివతత్వ గీతాలు బోలెడు వెలుగు చూశాయి. 300 పాటలతో ‘శివకావ్యం’ రచనలో ఆయన నిమగ్నమై ఉన్నారని వినిపించేది. అది పూర్తయి ఉంటే ఆ శివునికి సీతారాముడు చేసిన అక్షరార్చనగా ఆ కావ్యం నిలచిపోతుంది. ఆయన వారసులు ఆ కావ్యం వెలుగు చూసేలా చేస్తారని ఆశిద్దాం.

https://youtube.com/watch?v=bB9f2ttINxU