దాదాపు ఏడేనిమిదేళ్ళ క్రితం తీసిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘మస్కా’ తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తాండ్ర రమేశ్ నిర్మించారు. మూడు నాలుగేళ్ళుగా ఈ సినిమా ఇదిగో వస్తోంది, అదిగో వస్తోందంటూ నిర్మాత ప్రచారం చేశారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. అందుకు సంతోషపడాలి.
శివ (గోపీచంద్) బెజవాడలో పుట్టి, హైదరాబాద్ లో పెరుగుతాడు. పెద్దగా చదువు అబ్బదు. ప్రభుత్వ అధికారి అయిన అతని తండ్రి మూర్తి (ప్రకాశ్ రాజ్) ఓ బిల్డర్ తో మాట్లాడి ముంబైలో శివకు ఉద్యోగం వేయిస్తాడు. కుటుంబాన్ని వదిలి దూరంగా ఉండలేని శివ అక్కడ గొడవపెట్టుకుని తిరుగు టపాలో వచ్చేస్తాడు. తండ్రికి బెజవాడ ట్రాన్స్ ఫర్ కావడంతో తనూ అక్కడికే వెళతాడు. బెజవాడని తన కన్నుసన్నలతో శాసించే రౌడీ కాశీతో ఊహించనవి విధంగా శివకు గొడవ జరుగుతుంది. ఆ రౌడీయిజం ఉచ్చులోంచి శివ ఎలా బయటపడ్డాడు? తనను తప్పుపట్టే తండ్రితోనే భేష్ అని ఎలా అనిపించుకున్నాడు? కుటుంబం కోసం ప్రేయసిని దూరం చేసుకున్న శివ, తిరిగి ఆమె ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగతా కథ.
రౌడీయిజం నేపథ్యంలో తెలుగులో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అందులోనూ బెజవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలూ ఉన్నాయి. అయితే… ఆ రౌడీయిజాన్ని ఎదుర్కొనే హీరోకు ఫాదర్ సెంటిమెంట్ ను జత చేయడం మాత్రమే ఈ కథలోని కొత్తదనం. ఇక కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెట్టే హీరోల కథలను చాలానే చూశాం. ఓ రకంగా ఇదీ ఆ కోవలోకి వచ్చే చిత్రమే. వక్కంతం వంశీ ఇచ్చిన ఇంత సాదాసీదా కథను డైరెక్టర్ బి. గోపాల్, హీరో గోపీచంద్ ఎలా అంగీకరించారో అర్థం కాదు. ఇదేదో ఏడేనిమిదేళ్ళ క్రితం తీసిన సినిమా కాబట్టి ఇలా ఉందని అనుకోవడానికి లేదు. ఆ టైమ్ లో వచ్చినా, రెండు దశాబ్దాల ఆలస్యంగా వచ్చినట్టే లెక్క. ఎప్పుడో ఎయిటీస్ లో వచ్చిన సినిమాలను ఇది తలపించేలా ఉంది.
సినిమాలో ఏదో ఊహించని ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకుడు అలా ఎదురు చూస్తూ ఉండగానే, ఎలాంటి మెరుపులు, మెలికలు లేకుండా క్లయిమాక్స్ వచ్చేస్తుంది. తెర మీద శుభం కార్డు పడిపోతుంది. కొడుకును అపార్థం చేసుకునే తండ్రి, తండ్రిని అర్థం చేసుకోలేని కొడుకు, ప్రేమించిన వ్యక్తికి ఫ్యామిలీ పట్ల ఉండే కమిట్ మెంట్ ను గ్రహించని ప్రియురాలు, పోలీస్ వ్యవస్థ అనేదే లేనట్టుగా పేట్రేగిపోయే రౌడీ… ఇలా ఏమాత్రం కన్వెన్సింగ్ గా లేని అంశాలతో అల్లిన ఈ కథను బేస్ చేసుకుని ఎవరు మాత్రం ఏం చేయగలరు!? అబ్బూరి రవి మాటలు అక్కడక్కడా బాగానే ఉన్నాయి. బాల మురగున్ సినిమాటోగ్రఫీ ఓకే. ఉన్న నాలుగు పాటలనూ విదేశాలకు సింగిల్ ట్రిప్ వేసి అక్కడే తీసేశారు. వాటికి సమకూర్చిన కొరియోగ్రఫీ మాత్రం బాగుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా అతి చేయలేదు. మణిశర్మ స్వరపరిచిన బాణీలేవీ కొత్తగా లేవు! ఒక్క ‘లైఫ్ అంటే గాలిపటం’ సాంగ్ ఆకట్టుకుంటుంది. యాక్షన్స్ సీన్స్ ఫర్వాలేదు.
నటీనటుల్లో గోపీచంద్ నటన ఓకే. ఆవేశపూరితమైన యువకుడిగా బాగానే చేశాడు. కానీ క్యారెక్టరైజేషన్ సరిగా లేకపోవడంతో ఆడియెన్స్ ఆ పాత్రతో ఎంత మాత్రం కనెక్ట్ కారు. అదే పరిస్థితి ప్రకాశ్ రాజ్ ది కూడా. ఇక నయనతార కాసేపు కామెడీని, కాసేపు ఎమోషన్స్ ను పండించే ప్రయత్నం చేసింది కానీ ఏదీ పండలేదు. కోట శ్రీనివాసరావు, ఉత్తేజ్, చలపతి రావు, జీవా ఒక్కో సీన్ లో దర్శనం ఇచ్చారు. ఇప్పటికే కాలం చేసిన ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, గుండు హనుమంతరావులను ఈ సినిమాలో చూడొచ్చు. ఇతర పాత్రల్లో అభిమన్యుసింగ్, సలీమ్ బేగ్, రమా ప్రభ, సంధ్యాజనక్, మధునందన్, సురేఖావాణి, సన, గీతాసింగ్ తదితరులు నటించారు. వినోదాన్ని పండించడానికి ద్వితీయార్థంలో బ్రహ్మానందాన్ని తెరమీదకు రప్పించారు కానీ ఉపయోగం లేకపోయింది. మొత్తం మీద గోపీచంద్, బి. గోపాల్ కు ఈ మూవీ రిలీజ్ తో బ్యాగ్ లాగ్ ఒకటి తగ్గింది తప్ప, ప్రేక్షకులకు ఆశించిన వినోదం మాత్రం దక్కలేదు.
ప్లస్ పాయింట్స్
గోపీచంద్, బి. గోపాల్ ఫస్ట్ కాంబినేషన్
ఫాదర్ సెంటిమెంట్
అబ్బూరి రవి డైలాగ్స్
యాక్షన్ సీన్స్
మైనెస్ పాయింట్స్
కథాబలం లేకపోవడం
ఆసక్తికలిగించని కథనం
పండని ఎమోషన్ సీన్స్
రేటింగ్ : 2.25 /5
ట్యాగ్ లైన్ : బుల్లెట్ గురి తప్పింది!