Site icon NTV Telugu

చండీగఢ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అనూహ్య విజయం.. బీజేపీ వెనక్కి..

దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం కావడం కాదు.. క్రమంగా ఇతర ప్రాంతాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పటికే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఇదే సమయంలో ఆ పార్టీని అనూహ్య విజయం పలకరించింది.. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన ఆప్‌.. 14 స్థానాల్లో విజయం సాధించింది. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 35 స్థానాలు ఉండగా.. అందులో 14 కైవసం చేసుకుంది ఆప్‌.. ఇక, గత ఎన్నికల్లో 20 స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి వెనుకబడి 12 స్థానాలకే పరిమితం అయ్యింది.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో విజయం సాధించగా.. శిరోమణి అకాలీదళ్ ఒక సీటు తన ఖాతాలో వేసుకుంది.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఫలితాలతో ఆమ్‌ఆద్మీ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి ఆప్ శ్రేణులు.. ఇక, ఈ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ విజయం ‘మార్పునకు సంకేతం’గా సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం పంజాబ్‌లో చోటుచేసుకోనున్న మార్పులకు సంకేతం. అవినీతి రాజకీయ నాయకులను చండీగఢ్ ప్రజలు తోసిపుచ్చి, ఆప్ నిజాయితీ రాజకీయాలకు పట్టంకట్టారు అని పేర్కొన్నారు..

https://ntvtelugu.com/theatre-owners-and-distributors-try-to-talk-with-ap-government-over-movie-ticket-rates-issue/
Exit mobile version