NTV Telugu Site icon

secunderabad: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి

Swapna Lok Fire Accident

Swapna Lok Fire Accident

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్‌ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు. మృతులు ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. పొగతో ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Off The Record: టీఎస్‌పీఎస్సీపై లీకేజీల మచ్చ..! చైర్మన్‌ కంట్రోల్‌ తప్పిందా?

ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వ్యక్తులు కాంప్లెక్స్‌లో కార్యాలయం ఉన్న మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారేమోనని రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై జీహెచ్‌ఎంసీ, సంబంధిత అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు.

Also Read: AP Assembly: హీరో గారు అంటూ మంత్రి పలకరింపు.. జోకులు పేల్చిన బాలయ్య..

సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్‌లో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఎనిమిది అంతస్తుల్లో ఉంది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు.. తర్వాత 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరగడంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. కొందరు మాత్రం బయటకు రాలేక చిక్కుకుపోయారు. దట్టమైన పొగలు అలముకోవడంతో చాలామంది బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. కాగా, సికింద్రాబాద్‌లోనే వరుసగా అగ్నిప్రమాద ఘటనలు జరగడం గమనార్హం. దక్కన్ మాల్ ఘటనను మర్చిపోకముందే..తాజాగా స్వప్నలోక్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.