(ఆగస్టు 6న యన్టీఆర్ ‘అదృష్టజాతకుడు’కు 50 ఏళ్ళు)
నటరత్న యన్.టి.రామారావుకు సినిమారంగంలోనూ ఎందరో అభిమానులు. యన్టీఆర్ తో పనిచేసిన దర్శకనిర్మాతలు సైతం ఆయనను అమితంగా అభిమానించేవారు. అలాంటి వారిలో దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు ఒకరు. యన్టీఆర్ కథానాయకునిగా కె.హేమాంబరధర రావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘కలవారి కోడలు’ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘దేవత’. ఈ సినిమాతోనే ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మాతగా మారారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత హేమాంబరధర రావు నిర్మాతగా మారి సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో యన్టీఆర్ తో ‘ఆడపడచు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి హేమాంబరధర రావు గురువు, ప్రఖ్యాత దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయగా, హేమాంబరధర రావు సోదరుడు కె.ప్రత్యగాత్మ సంభాషణలు పలికించడం విశేషం. ఆపై యన్టీఆర్, హేమాంబరధర రావు కాంబినేషన్ లో వచ్చిన ‘కథానాయకుడు’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత మళ్ళీ యన్టీఆర్ తో సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై హేమాంబరధర రావు నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అదృష్టజాతకుడు’. 1971 ఆగస్టు 6న విడుదలైన ‘అదృష్టజాతకుడు’ పార్ట్ లీ కలర్ లో రూపొందింది.
‘అదృష్టజాతకుడు’ కథ విషయానికి వస్తే – స్థలం కోసం ఓ రాజావారు ఓ పాఠశాలను తగలబెడతాడు. బడిపంతులు అందులో చనిపోగా, ఆయన పిల్లలు ప్రసాద్, శారద అనాథలవుతారు. పెద్దయ్యాక ప్రసాద్ మెకానిక్ అవుతాడు. అతని చెల్లెలిని ప్రసాద్ యజమాని కొడుకు గోపాల్ మోసం చేస్తాడు. గర్భవతి అయిన శారద పాట్లు పడుతుంది. ప్రసాద్ ను పెళ్ళాడిన విజయ, మరదలిని చేరదీస్తుంది. గోపాల్ తండ్రి పరంధామయ్య మోసం చేసి ప్రసాద్ ను జైలుకు పంపిస్తాడు. శారదకు పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. ప్రసాద్ కు ఓ పిచ్చివాడు తారసపడతాడు. అతణ్ణి ఇంటికి తీసుకు వస్తాడు ప్రసాద్. ఆ పిచ్చివాణ్ణి ప్రసాద్ దంపతులు బాగా చూసుకుంటారు. ఆ పిచ్చివాడు ఎవరో కాదు స్కూల్ తగలబెట్టిన రాజావారు. ప్రసాద్ తండ్రి చావుకు తానే కారణమని, తన గతం చెప్పుకొని వాపోతాడు. ఆస్తి మొత్తం ప్రసాద్ చేతుల్లో పెడతాడు. ప్రసాద్ కుమారారాజా పేరుతో పరంధామయ్య కొడుకు గోపాల్ కు తన చెల్లెలినిచ్చి పెళ్లి చేస్తాడు. చివరకు అసలు విషయం తెలుసుకొని పరంధామయ్య లబోదిబో అంటాడు. డబ్బే ముఖ్యం అనుకుంటే నా ఆస్తిలో సగం రాసిస్తా అంటారు రాజావారు. నిస్వార్థ పరుడైన ప్రసాద్ అదృష్టజాతకుడుగా మారడం అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పు తెలుసుకొని పరంధామయ్య లెంపలేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
కె.బాలమురుగన్ రాసిన కథతో తెరకెక్కిన ‘అదృష్టజాతకుడు’ ఆ రోజుల్లో అత్యధిక థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు రంగుల్లో ఉంటుంది. యన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో నాగభూషణం, పద్మనాభం, రావి కొండలరావు, రాధాకుమారి, మిక్కిలినేని, ధూళిపాళ, రామకృష్ణ, సాక్షి రంగారావు, అల్లు రామలింగయ్య, జ్యోతిలక్ష్మి నటించారు. ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతం సమకూర్చగా, కొసరాజు, దాశరథి, సినారె పాటలు రాశారు. “చిరు చిరు నవ్వుల శ్రీవారు…చిన్నబోయి ఉన్నారు…” , “చల్లని చెల్లెమ్మా…”, “ఏదీ నిజమైన పుట్టినరోజు… ఏదీ అసలైన పండుగ రోజు…” వంటి పాటలు అలరించాయి.
కథాబలం అంతగా లేని ఈ సినిమా ఆ రోజుల్లో పరాజయం పాలయింది. రిపీట్ రన్స్ లో నిర్మాతకు కాసులు రాల్చింది.