NTV Telugu Site icon

30 ఏళ్ళ ‘మామగారు’

(ఆగస్టు 30తో ‘మామగారు’కు 30 ఏళ్ళు పూర్తి)

నటునిగానూ దర్శకరత్న దాసరి నారాయణరావు విశ్వరూపం చూపించిన చిత్రం ‘మామగారు’. తమిళ చిత్రం ‘నాన్ పుడిచ మాప్పిళ్ళై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రీమేక్ మూవీస్ రూపొందించడంలో మేటి అనిపించుకున్నఎడిటర్ మోహన్ ఈ చిత్రాన్ని ఎమ్.ఎమ్.మూవీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఐదేళ్ళకు ఎడిటర్ మోహన్ నిర్మించిన రీమేక్ ‘హిట్లర్’లోనూ దాసరి కీలక పాత్ర పోషించగా, ఆ చిత్రానికి కూడా ముత్యాల సుబ్బయ్య నిర్దేశకత్వం చేశారు. ఎడిటర్ మోహన్ నిర్మించిన మరో చిత్రం ‘శుభమస్తు’లోనూ దాసరి నటించారు. నటునిగా ఈ చిత్రాలు దాసరికి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ‘మామగారు’ చిత్రంతో ఉత్తమనటునిగా దాసరికి నంది అవార్డు లభించడం విశేషం. 1991 ఆగస్టు 30న విడుదలైన ‘మామగారు’ విజయఢంకా మోగించింది.

‘మామగారు’ కథ ఏమిటంటే – సత్తెయ్య పేదవాడైనా, నిజాయితీ పరుడు. అతని మంచితనం పక్కఊరి ప్రెసిడెంట్ విజయ్ కి బాగా నచ్చుతుంది. సత్తెయ్య కూతురు లక్ష్మిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు విజయ్. ఉన్నంతలో అల్లుడిని, కూతురిని బాగా చూసుకోవాలని తపిస్తాడు సత్తెయ్య. ప్రమాదవశాన లక్ష్మి మరణిస్తుంది. దాంతో సత్తెయ్య బలవంతం మీదనే విజయ్ తన అక్క కూతురు రాణీని పెళ్ళి చేసుకుంటాడు. అయితే రాణీ తండ్రి పోతురాజుకు సత్తెయ్యను ఇంకా తన అల్లుడు ఇంట్లో ఉంచుకొని, అతనికే పెత్తనం అప్పచెప్పడం నచ్చదు. ఎలాగైనా సత్తెయ్యను ఇంట్లోంచి బయటకు పంపాలని పోతురాజు పన్నాగం పన్నుతూ ఉంటాడు. చివరకు సత్తెయ్యకు ఓ స్త్రీతో సంబంధం ఉందని చూపించి, అతణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. విజయ్ వచ్చి నిజం తెలుసుకొనే లోపే సత్తెయ్య ఆత్మహత్య చేసుకొని ఉండటంతో కథ ముగుస్తుంది.

సత్తెయ్యగా దాసరి నారాయణరావు నటించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, యమున, ఐశ్వర్య, అన్నపూర్ణ, నిర్మలమ్మ, పాకీజా, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ నటించారు. వి.శేఖర్ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి తోటపల్లి మధు మాటలు రాశారు. రాజ్-కోటి స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, డి.నారాయణవర్మ, వేదవ్యాస పాటలు పలికించారు. ఇందులోని “ఈ నాడే అచ్చమైన దీపావళి…” పాట బాగా పాపులర్ అయింది. “దండాలు పెట్టేము దుర్గమ్మా… గండాలు దాటించు మాయమ్మా…”, “శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే…”, “ఈ రాతిరి శివరాతిరి…”, “కొట్టరో గట్టిగా పెళ్ళి డోలు దెబ్బ…” వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి.

‘మామగారు’ చిత్రం ఘనవిజయం సాధించింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఉత్తమ నటునిగా దాసరికి, ఉత్తమ సహాయనటునిగా వినోద్ కుమార్ కు, ఉత్తమ హాస్యనటునిగా బాబూమోహన్ కు నంది అవార్డులు లభించాయి. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ జోడీ కామెడీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత అనేక చిత్రాలలో వీరిద్దరి హాస్యం పకపకలు పంచింది.