NTV Telugu Site icon

30 ఏళ్ళ ‘చిత్రం భళారే విచిత్రం’

30 Years completed to Chitram Bhalare Vichitram Movie

(జూన్ 7తో ‘చిత్రం భళారే విచిత్రం’కు 30 ఏళ్ళు)
గిలిగింతలు పెట్టే చిత్రాలు కొన్ని, కితకితలతో మురిపించే సినిమాలు మరికొన్ని ఉంటాయి. కొన్నిసార్లు గిలిగింతలు, కితకితలు కలిపి ఆకట్టుకొనే చిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో పి.యన్.రామచంద్రరావు రూపొందించిన ‘చిత్రం భళారే విచిత్రం’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ‘అషి హి భన్వా భన్వీ’ అనే మరాఠీ చిత్రం ఆధారంగా ఈ ‘చిత్రం భళారే విచిత్రం’ తెరకెక్కింది. ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తూ ఈ సినిమా సాగింది. పెళ్ళికాని కుర్రాళ్ళకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వని పరిస్థితుల్లో ఓ అబ్బాయి అమ్మాయిగా వేషం వేసుకొని, తన మిత్రులకు కూడా వేషాలు వేయించి, ఓ ఇంట్లో అద్దెకు దిగడం ఈ చిత్రంలోని అసలు అంశం. దాని చుట్టూ సాగిన నవ్వుల యాత్ర నిజంగానే ‘చిత్రం భళారే విచిత్రం’ అనిపించక మానదు. నైజామ్ ఏరియాలో ప్రముఖ పంపిణీ సంస్థ సాయిరామ్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. 1991 జూన్ 7న విడుదలైన ‘చిత్రం భళారే విచిత్రం’ అనూహ్య విజయం సాధించింది.

కథ విషయానికి వస్తే, పట్నంలో పనిచేసుకుంటున్న మిత్రుడు సుధాకర్ దగ్గరకు చేరతారు రాజా, రాఘవ, బ్రహ్మానందం. అయితే అందరికీ సుధాకర్ ఆశ్రయమవుతాడు. ఆ ఇంటి ఓనర్ ఒకే గదిలో నలుగురు ఉన్నట్టు తెలుసుకొని బయటకు గెంటేస్తాడు. ఆ సమయంలో ఈ బ్రహ్మచారులకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. నాటకాల్లో ఆరితేరిన రాజా, తన బుద్ధిబలంతో అమ్మాయిగా వేషం కడతాడు. సుధాకర్ భార్యనని చెబుతారు. సుధాకర్ తండ్రిగా బ్రహ్మానందం, తమ్మునిగా రాఘవ నటిస్తూంటారు. ఆ ఇంటి ఓనర్ కూతురును రాజా ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం మగాడిలా, ఇంటి కోసం అమ్మాయిలా వేషాలు మార్చుకుంటూ భలే తంటాలు పడతాడు రాజా. సుధాకర్ ను అతని లేడీ బాస్ ప్రేమిస్తుంది. అయితే అతనికి పెళ్ళయిందని తెలిసి, ఆమె అభిమానం పటాపంచలవుతుంది. అన్నిటినీ సర్దుకొనేలా చేసి, చివరకు అసలు విషయం బయటపెట్టి ఎవరికి నచ్చిన వారిని వారు పెళ్ళాడడంతో కథ ముగుస్తుంది.

రాజాగా నరేశ్ నటించిన ఈచిత్రంలో శుభలేఖ సుధాకర్, మహర్షి రాఘవ, బ్రహ్మానందం, రాజీవి, తులసి, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, అత్తిలి లక్ష్మి, చిట్టిబాబు, రావి కొండలరావు, రాధాకుమారి, గిరిబాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం కూడా ఓ ఎస్సెట్. “బ్రహ్మచారులం…”, “నవ్వుకొనే మన…”, “మహాశయా మత్తుగా…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. తోటపల్లి మధు రాసిన సంభాషణలు కితకితలు పెట్టాయి.

‘చిత్రం భళారే విచిత్రం’ అని ‘దానవీరశూర కర్ణ’లో దుర్యోధనునికి, భానుమతికి మధ్య సాగే యుగళగీతంలోని పల్లవిని ఈ సినిమాకు టైటిల్ గా పెట్టుకోవడమే పెద్ద ఎస్సెట్! అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా జనాన్ని రంజింప చేసింది. అనేక కేంద్రాలలో డైరెక్ట్ గా వందరోజులు ప్రదర్శితమైన ‘చిత్రం భళారే విచిత్రం’ హైదరాబాద్ శ్రీనివాసలో నేరుగా 175రోజులు ప్రదర్శితమయింది. ఆ యేడాది డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ మూవీస్ లో ‘చిత్రం భళారే విచిత్రం’ ఒకటిగా నిలచింది. ఈ కథను తరువాతి రోజుల్లో కన్నడలో ‘బంబాట్ హెండ్తీ’గా, తమిళంలో ‘అనళగన్’గా రూపొంది అక్కడి వారినీ అలరించింది. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో తరువాత మరికొందరు హీరోలు లేడీ గెటప్ తో అలరించే ప్రయత్నం చేశారు. కానీ, వారి చిత్రాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. నరేశ్ లేడీ గెటప్ లో అచ్చు వాళ్లమ్మ విజయనిర్మలను తలపించాడని పలువురు ప్రశంసించారు.