(సెప్టెంబర్ 27తో ‘స్టూడెంట్ నం.1’కు 20 ఏళ్ళు)
యంగ్ టైగర్ యన్టీఆర్ తొలి ఘనవిజయం, దర్శకధీరుడు రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’. 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నంబర్ వన్’ జనం ముందు నిలచింది.వారి మదిని గెలిచింది. ఆ సినిమా చూసినప్పుడే నందమూరి అభిమానులు ‘మనవాడు మహా గట్టివాడు… స్టార్ హీరో అయిపోయాడు…’ అనుకున్నారు. ‘ఎవరో కొత్త దర్శకుడు రాజమౌళి అట… భలేగా తీశాడు…’ అని ప్రేక్షకులు అన్నారు. వారిద్దరూ రాబోయే కాలంలో అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటారని, వారి చిత్రాలకోసం జనం కళ్ళింతలు చేసుకొని థియేటర్ల ముందు పడిగాపులు కాసే రోజు వస్తుందని ఆ రోజున ఎంతమంది అనుకున్నారో తెలియదు కానీ, తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ చరిత్రను సొంతం చేసుకున్నారు వారు. నవతరం స్టార్ హీరోస్ లో జూనియర్ యన్టీఆర్ బాణీ ప్రత్యేకమైనది. ఇక దర్శకునిగా రాజమౌళి పంథా ఏమిటో చెప్పక్కర్లేదు. వారిద్దరినీ కలిపిన ఘనత మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ కు దక్కుతుంది. స్వప్న సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందింది.
‘స్టూడెంట్ నంబర్ వన్’ కథలోకి తొంగిచూస్తే… లాయర్ కావాలన్న అభిలాషతో ఆదిత్య లా కాలేజ్ లో చేరతాడు. అక్కడ అతని మంచితనం చూసి అంజలి మనసు పడుతుంది. కానీ, ఎప్పటికప్పుడు ఆమెను దూరం పెడుతూ ఉంటాడు ఆదిత్య. అదే కాలేజ్ లో చదువుకొనే సత్య అందరిపై పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అంజలి ప్రేమకోసం పలు పాట్లు పడతాడు. చివరకు ఆమె ఛీ కొట్టడంతో అవమానిస్తాడు. అది చూసిన ఆదిత్య అడ్డుకుంటాడు. ఆదిత్యను సత్య, అతని మిత్రులు ఏదో పిల్లకాకి అనుకుంటారు. అయితే వారికి దేహశుద్ధి చేసిన తరువాత ఆదిత్య తన గతాన్ని వివరిస్తాడు. అమ్మానాన్న, చెల్లితో ఆనందంగా జీవిస్తూంటాడు ఆదిత్య. ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ లో చేరాలన్నది ఆదిత్య అభిలాష. కానీ, వాళ్ళ నాన్న అతణ్ణి లాయర్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఆదిత్య ఓ సారి ఓ అమ్మాయిని రక్షించడంలో ఓ గూండా ప్రాణాలు తీస్తాడు. దాంతో జైలు పాలవుతాడు. తండ్రి అతణ్ణి చూడటానికే ఇష్టపడడు. జైలులో ఉంటూనే లా కాలేజ్ లో లా చేస్తూంటాడు. ఆదిత్య చెప్పిన కథ విని, అందరూ అతణ్ణి అభిమానిస్తారు. లా పూర్తయిన తరువాత ఓ కేసులో ఇరుక్కుపోయిన తండ్రిని తన వాగ్దాటితో కాపాడతాడు ఆదిత్య. దాంతో కథ సుఖాంతమవుతుంది.
కన్నకొడుకు తప్పు చేస్తే, అతణ్ణి అసహ్యించుకొనే తండ్రి, ఆ తండ్రినే కాపాడే కొడుకు కథలతో అంతకు ముందు కూడా సినిమాలు రూపొందాయి. అయితే ఈ కథను రాజమౌళి నడిపిన తీరు ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే రాశారు. దాంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించినా, చాలామంది ఆ క్రెడిట్ రాఘవేంద్రరావుదే అన్నారు. ఈ సినిమా తరువాత మళ్ళీ జూనియర్ యన్టీఆర్ తోనే రెండోచిత్రం ‘సింహాద్రి’ రూపొందించి, అనూహ్య విజయం సాధించారు రాజమౌళి. ఆ తరువాత నుంచీ దర్శకునిగా రాజమౌళి పేరు మారుమోగి పోతూనే ఉంది.
ఈ చిత్రంలో జూ.యన్.టి.రామారావు, గజాలా, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, గుండు సుదర్శనమ్, అజయ్, తనికెళ్ళ భరణి, శేఖర్, ప్రీతి నిగమ్, సమీర్, మల్లాది తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ పృథ్వీరాజ్ అందించగా, కేవీ మాటలు రాశారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇందులోని అన్ని పాటలనూ చంద్రబోస్ పలికించారు. “కూచిపూడి కైనా…” , “కాస్త నన్ను నువ్వునేను తాకుతుంటే…”, “ఒకరికి ఒకరై ఉంటుంటే… ఒకటిగ ముందుకు వెళ్తుంటే….”, “పడ్డానండి ప్రేమలో మరీ…”, “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి…”, “ఏమెట్టి చేశాడే ఆ బ్రహ్మ…” పాటలు జనాన్ని భలేగా కట్టి పడేశాయి. ‘ఒకరికి ఒకరై వెంటుంటే…’ పాటలో జూనియర్ యన్టీఆర్ రాజకుమారుడి గెటప్ లో కనిపించగానే అభిమానుల ఆనందం వెల్లువెత్తింది.
‘స్టూడెంట్ నంబర్ వన్’ చిత్రం 73 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం చూసింది. 42 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. కొన్ని కేంద్రాలలో రజతోత్సవం కూడా సాగింది. ఆదోని ద్వారకా థియేటర్ లో ఏకధాటిగా 201 రోజులు ప్రదర్శితమై అప్పట్లో రికార్డ్ సృష్టించింది. నిర్మాతలకు, పంపిణీదారులకు మంచి లాభాలు సంపాదించి పెట్టింది.