(సెప్టెంబర్ 21న బిపాసా తొలి చిత్రం ‘అజ్ నబీ’కి 20 ఏళ్ళు)
దర్శకద్వయం అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అనిపించుకున్నారు. యాక్షన్ మిళితం చేసి తమ కథలను రంజింపచేయడంలోనూ అబ్బాస్- ముస్తాన్ సఫలీకృతులయ్యారు. అక్షయ్ కుమార్ ను ‘ఖిలాడీ’గా జనం ముందు నిలిపినా, షారుఖ్ ఖాన్ ను నెగటివ్ రోల్ లో ‘బాజీగర్’గా తెరకెక్కించినా వారికే చెల్లింది. ఇక బాబీ డియోల్ ను ‘సోల్జర్’గా రూపొందించిందీ వాళ్ళే. 2001లో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ నబీ’ చిత్రంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్ నటించారు. ఈ సినిమా ద్వారానే బిపాసా బసు తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. ఇందులో మరో నాయికగా నటించిన కరీనా కపూర్ పుట్టినరోజు కానుకగా 2001లో సెప్టెంబర్ 21న ‘అజ్ నబీ’ విడుదలయింది. ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ గా రూపొంది మంచి విజయం సాధించింది.
‘అజ్ నబీ’ అంటేనే అపరిచితుడు. కథలో రాజ్, ప్రియ అనే దంపతులకు స్విట్జర్లాండ్ లో విక్రమ్, సోనియా అనే జంట పరిచయం అవుతుంది. విక్రమ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉండడం రాజ్ చూస్తాడు. రాజ్ ను సోనియా ఆకర్షించాలనుకుంటుంది. ఓ రోజు రాజ్ దంపతులకు విక్రమ్ పార్టీ ఇస్తాడు. సోనియా హత్యకు గురవుతుంది. ఆధారాలను బట్టి సోనియాను రాజ్ హత్య చేశాడని పోలీసులు వెంటాడుతారు. రాజ్ ను అతని భార్య ప్రియ నమ్ముతుంది. ఎలాగైనా తన భర్తను నిర్దోషిగా నిరూపించాలని చూస్తుంది. రాజ్, ప్రియకు అసలు విషయం తెలుస్తుంది. అదేమిటంటే, విక్రమ్ కేవలం డబ్బు కోసమే సోనియాను పెళ్ళాడడని. అంతకు ముందు విక్రమ్ క్లోజ్ గా ఉన్న ఆవిడ, అతని అసలు భార్య. సోనియాతో పది మిలియన్ల పాలసీ చేయించి, ఆమెను అంతమొందించి, ఆ డబ్బు కొట్టేయాలన్నది విక్రమ్ ప్లాన్. అది అమలు పరచి విక్రమ్ మారిషస్ పారిపోతాడు. అతణ్ణి పట్టుకోకపోతే, తానే హంతకుడని అనుకుంటారని రాజ్ భయపడతాడు. అతనికి ఓ వ్యక్తి సహకరిస్తాడు. రాజ్, ప్రియా మారిషస్ చేరుకుంటారు. అక్కడ తెలివిగా విక్రమ్ స్వయంగా అసలు ప్లాన్ చెప్పేలా చేస్తాడు రాజ్. విక్రమ్ తరచూ ‘ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్” నే మాట అంటూ ఉంటాడు. అదే అతని పాస్ వర్డ్ గా తెలుసుకున్న రాజ్, అతనికి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన మొత్తాన్ని తెలివిగా ఆ కంపెనీకే తిరిగి పంపిస్తాడు. దాంతో విక్రమ్, రాజ్ తో తలపడతాడు. ఆ పోట్లాటలో మరణిస్తాడు. రాజ్ నిర్దోషి అని తేలుతుంది. రాజ్, ప్రియ ఆనందంగా ఇండియాకు రావడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో విక్రమ్ గా అక్షయ్ కుమార్, రాజ్ గా బాబీ డియోల్, ప్రియగా కరిష్మా కపూర్, సోనియాగా బిపాషా బసు నటించారు. మిగిలిన పాత్రల్లో మింక్ బ్రార్, జానీ లీవర్, అమితా నంగియా, దాలిప్ తాహిల్, శరత్ సక్సేనా, షీలా శర్మ అభినయించారు. ఈ చిత్రానికి నీరజ్ ఓరా కథ అందించగా, విజయ్ గలానీ ఈ సినిమాను నిర్మించారు. సురీందర్ సోధీ నేపథ్య సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలకు అనుమాలిక్ స్వరకల్పన చేశారు. ఇందులోని ఎనిమిది పాటలు సమీర్ కలం నుండి జాలువారాయి. “మొహబ్బత్ నామ్ హై…”, “మేరీ జిందగీ మే అజ్ నబీ…”, “జబ్ తుమ్‌నే ఆషిఖీ మాలూమ్…”, “కసమ్ సే తేరీ ఆంఖే అయ్యారే అయ్యా…” పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో కరీనా కపూర్ అందం, బిపాసా కైపెక్కించే చందం ఆకట్టుకున్నాయి. బిపాసా తొలి చిత్రమే అయినా భలేగా మెరుపులు మెరిపించింది.