NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

9am News Head Lines

9am News Head Lines

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. విగ్రహ మార్పుపై సభలో వివరణ
ఇవాల్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు 2 నివేదికలను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ముందుగా.. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సభలో సీఎం ప్రస్తావించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు. విగ్రహ మార్పుపై సభలో సీఎం రేవంత్ వివరించనున్నారు.

నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ..
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ (సోమవారం) సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహ రూపులేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నేడు టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్‌టీయూలో కొనసాగనుంది. ఈ నెల 5న ఈ నియోజకవర్గం పరిధిలోని కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్ ప్రక్రియలో 15, 495 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 రౌండ్స్ లో 9 టేబుల్స్ పై ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టననున్నారు అధికారులు. ఇక, బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు.. కాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి రెండేళ్ల 2 నెలల పదవీ కాలంలో కొనసాగుతారు.

నేటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్ల తనిఖీ
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నేటి (డిసెంబర్ 9) నుంచి రెండు రోజులు పాటు అధికారులు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు. రాష్ట్రంలో నకిలీ పెన్షన్‌ దారులను ఏరి వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని కంప్లైంట్స్ రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ చర్యలకు సిద్ధమైంది. ఇక, తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను అధికారులు సేకరణ చేయనున్నారు. ఇందు కోసం పక్క మండలానికి చెందిన సిబ్బందికి డ్యూటీ వేశారు. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలన చేయాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

టెన్షన్.. టెన్షన్.. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
బాంబు పేలుళ్ల బెదిరింపుతో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. స్కూల్ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని పిల్లలను వెనక్కి పంపించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాఠశాల ఆవరణలో తనిఖీలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఎలాంటి పేలుడు పదార్థాన్ని కనుగొన్నట్లు ధృవీకరించబడలేదు. కానీ.. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇమెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన తర్వాత పాఠశాలల్లో నిఘా పెంచారు.

ఈ జాబితాలో చైనా, జర్మనీ, జపాన్‌ల కంటే భారత్‌ టాప్..
భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌లు ముందున్నాయి. అయితే డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మాత్రమే ముందున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారతదేశం 2023లో 257 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేస్తుంది. భారతదేశ డిజిటల్ ఎగుమతులు 2022 సంవత్సరంలో 17 శాతం పెరిగాయి. ఈ కాలంలో చైనా, జర్మనీల నుంచి ఎగుమతులు నాలుగు శాతం పెరిగాయి. నాలుగేళ్లలో భారత్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో డిజిటల్ డెలివరీ సేవలు గణనీయంగా వృద్ధి చెందాయి. ప్రపంచ సేవల వాణిజ్యంలో దీని వాటా 20 శాతానికి చేరుకుంది.

సిరియా అధ్యక్షుడు సేఫ్.. ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారంటే?
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు. అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది” అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. కాగా.. రెబల్స్ దూకుడుతో సిరియర్ బలగాలు, వారికి అండగా నిలిచిన రష్యన్ బలగాలు తోకముడిచాయి. అధికారం పోవడం ఖాయంగా కనిపించడంతో అస్సాద్ ముందుగా తన భార్య, పిల్లల్ని రష్యాకు తరలించారు. అనంతరం ఆయన కూడా దేశం వదిలిపెట్టారు. శాంతియుతంగా అధికారాన్ని అప్పగించాలనే ఆదేశాలు ఇవ్వడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ తన పదవి నుంచి దిగిపోయి, దేశం వదిలిపెట్టినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పలేమని, అతని నిష్క్రమణకు సంబంధించిన చర్చల్లో రష్యా పాల్గొనలేదని పేర్కొంది. అయితే.. సిరియాలోని రష్యా సైనిక స్థావరాలను హైఅలర్ట్‌లో ఉంచామని, ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని చెప్పింది.

నేటి నుంచి పుష్పరాజ్ కు అసలైన పరీక్ష
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్పకు సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పుష్ప మాదిరిగానే పుష్ప -2 కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి ముఖ్యంగా నార్త్ లో పుష్ప క్రేజ్ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కవ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. పుష్ప -2 టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి.
ఇటు తెలుగు స్టేట్స్ లోను కలెక్షన్స్ లో దూకుడు చూపించింది పుష్ప -2. ఇదంతా నిన్నటి వరకు కానీ ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. ఎంతటి స్టార్ హీరో సినిమా ఆయిన మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్స్  అవడం అనేది రెగ్యులర్ గా ఉండేదే. అసలైన సినిమా కనిపించేది సోమవారం మాత్రమే. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందా లేదా ఎంత కలెక్షన్స్ తెస్తుంది అనేది తేలుతుంది. పుష్ప -2 విషయంలో నార్త్ గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మండే అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఎటొచ్చి తెలుగు స్టేట్స్, కేరళ, తమిళ్, కన్నడపైనే అందరి చూపు. పుష్ప -1 కూడా తెలుగు స్టేట్స్ లో నష్టాలు తెచ్చింది. టికెట్ ధరలు నేటి నుండి తగ్గించడంతో కలెక్షన్స్ స్టడీ గా ఉంటాయని ట్రేడ్ అంచనావేస్తుంది. మండే టెస్ట్ లో ఏ మేర మార్కులు సాధిస్తుందో చూడాలి.

నిగమ్ తో నిహారిక రొమాంటింక్ సాంగ్.. చలి కాలంలో చెమటలు గ్యారెంటీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాని అవేవి నిహారికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో సినిమాలను పక్కన పెట్టి తాను ప్రేమించిన చైతన్యను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ కొన్నాళ్ళకు ఆ బంధానికి బీటలు పడడంతో విడాకులు తీసుకుని మరల సినిమాల్లో యాక్టివ్ అయింది నిహారిక. ప్రస్తుతం నిహారిక మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘మద్రాస్ కారన్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఆమె నటించిన సినిమాలలో పక్కింటి అమ్మాయిలా నటించిన నిహారిక ఈ సినిమాలో ఓ రెంజ్ లో అందాలు ఆరబోసింది. తాజాగా ఈ సినిమా నుండి ‘కాదల్ సదుగువు’ అని సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో షేన్ నిగమ్ తో నిహారిక చేసిన రొమాన్స్ చలికాలంలో కూడా చెమటలు పుట్టిస్తుందనే చెప్పాలి. బౌండరీస్ చెరిపేస్తూ నిగమ్ తో అద్భుతంమైన కెమిస్ట్రీ పండించింది. అదే విధంగా ఈ సాంగ్ లో నిహారిక అద్భుతమైన డాన్స్ చేసింది. అలాగే సాంగ్ లో తన హావభావాలు కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉన్నయనే చెప్పాలి. చూస్తుంటే నిహారిక ఇక నుండి సినిమాలపై సీరియస్ గా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది అందుకు తగ్గట్టు తనని తాను మార్చుకుని అన్నిటికి రెడీ అన్నట్టు కనిపిస్తోంది ఈ మెగా డాటర్.