NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ రోజు (మార్చ్ 27) ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి వెళ్తున్నారు. పునరావాసం, పరిహారం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు సహా పలు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించి.. కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 10 గంటల 55 నిమిషాలకు పోలవరం వ్యూ పాయింట్ ​కు వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలన చేయనున్నారు. అనంతరం అధికారులతో ప్రాజెక్ట్ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోంది. ఇక, సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రస్తుత పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేయనున్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వడం ద్వారా ఏపీలో సాగు నీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకు తాగు నీరు కూడా అందుబాటులోకి వస్తుంది.

నేడు కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధం..
నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు మూడు మండల పరిషత్ వైస్ చైర్మన్ లు, ఒక ఉప సర్పంచ్ కు ఎన్నికలు నిర్వహించనున్నారు.. కడప జిల్లా పరిషత్తులు 50 మంది జడ్పీటీసీలలో 49 వైసీపీ, ఒకటి టిడిపి లెక్కించుకున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో కడప జిల్లా పరిషత్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి 38 మంది జడ్పిటిసి మద్దతు ఉండడంతో దాదాపు కడప జిల్లా పరిషత్ వైసీపీ కైవసం అయ్యే అవకాశం ఉంది.

సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం!
గురువారం ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు డీలిమిటేషన్‌పై ప్రభుత్వ తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ తీర్మానం అనంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లు, అవయవ దానం బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 12వ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలతో సభ జోరుగా సాగింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం దృష్టి అభివృద్ధి, సంక్షేమం పైనేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డం పడుతోందని, పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిన్న హోం, అడ్మినిస్ట్రేషన్‌ పద్దుపై చర్చ జరిగింది.

కాపాడాలంటూ మేస్త్రీ ఆర్తనాదాలు.. చివరకు..!
భద్రాచలం పట్టణంలో ఓ ఆధ్యాత్మిక సంస్థ నిర్మిస్తున్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భవనం కింద శిథిలాల్లో ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు. బుధవారం సాయంత్రం నుంచి శిథిలాల తొలగింపు చర్యలు ప్రారంభించారు. గత రాత్రి బతికి ఉన్నాడని భావించి కామేష్ అనే మేస్త్రీని బయటికి తీసుకు రావడానికి సింగరేణి రెస్క్యూ బృందం తీవ్రంగా ప్రయత్నం చేసింది. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అయితే బయటకు తీసుకొచ్చే సమయానికి అతడు మృతి చెందాడు. దాంతో కామేష్ కుటుంబసభ్యులు బోరున ఏడ్చారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. ఉపేందర్ అనే మరో మేస్త్రీ శిథిలాల లోపలే ఉన్నాడు. అయితే అతను కూడా మృతి చెందాడని భావిస్తున్నప్పటికీ.. అందులో స్పష్టత రావలసి ఉంది. అయితే ఇప్పటి వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదని ఉపేందర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ను పోల్చము: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ ను పోల్చమని యూఎస్‌ తెలిపింది. భారత్‌- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సుంకాలు తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచిస్తున్నారు. లేకపోతే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ట్రంప్ టారిఫ్ బాంబు! అమెరికాలో విదేశీ కార్లపై 25% పన్ను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాల నిర్ణయం శాశ్వతమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ దేశంలో తయారు కాని అన్ని కార్లపై అమెరికా 25% సుంకాన్ని సమర్థవంతంగా విధిస్తుందని ట్రంప్ అన్నారు. యూఎస్‌లో తయారైన కార్లకు ఎటువంటి సుంకం ఉండదని ఆయన అన్నారు. ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుంది. దాని పునరుద్ధరణ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో “అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధించబోతున్నాం” అని ఓవల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. ఈ విధానం దేశీయ తయారీని ప్రోత్సహిస్తుందని, అమెరికాలో కార్లు తయారైతే వాటిపై ఎటువంటి సుంకం ఉండదని కూడా ఆయన అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆటోమేకర్ల సరఫరా గొలుసును దెబ్బతీస్తుందని, అమెరికన్ వినియోగదారులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రధాన ఆటో తయారీదారులతో చర్చించానని, సుంకాలు మొత్తం మీద సమతుల్యంగా ఉంటాయని లేదా టెస్లాకు ప్రయోజనకరంగా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు.

‘మ్యాడ్’ కామెడీ సీన్స్ చూస్తూ నా ఒత్తిడిని దూరం చేసుకుంటా
ఎలాంటి అంచనాలు లేకుండా 2023లో చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’  ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వ‌స్తోంది. ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా  అక్కినేని నాగచైతన్య హాజరవగా, ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఇందులో భాగంగా చైతన్య మాట్లాడుతూ.. మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్ అన్నాలి ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ ఈవెంట్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ ఒత్తిడి దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచివి. డల్‌గా ఉన్నప్పుడు, మూడ్ బాగోలేనప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం.

నైజాంలో రాబిన్ హుడ్ కు థియేటర్స్ నయ్‌.. నయ్‌..
నైజాంలో థియేటర్స్ కేటాయింపుల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పడు నైజాం అంటే దిల్ రాజు అనే సిచుయేషన్. కానీ ఇప్పుడు రింగ్ లోకి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ వచ్చి చేరింది. సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆసియన్ సురేష్ వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు. రెగ్యులర్ డేస్ లో అంతా సజావుగానే సాగుతుంది కానీ స్టార్ హీరోల సినిమాలు, పండగ రిలీజ్ టైమ్ లో థియేటర్స్ పంచాయితీ వస్తోంది. ఎదో ఒక సినిమాకు అన్యాయం జరుగుతుంది. రేపు రిలీజ్ కానున్న రాబిన్ హుడ్, ఎంపురాన్, వీర ధీర సూరన్, మ్యాడ్ స్క్వేర్ విషయంలో థియేటర్స్ తలనొప్పి మొదలైంది. నితిన్ రాబిన్ హుడ్, విక్రమ్ వీర ధీర సూరన్ మైత్రీ రిలీజ్ చేస్తుండగా. ‘మ్యాడ్ స్క్వేర్’ ఎంపురాన్ ను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల దిల్ రాజు రిలీజ్ చేసిన కోర్ట్ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అన్ని ముఖ్య కేంద్రాల్లో మూడవ వారం కూడా ఆ సినిమాను రన్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో రాబిన్ హుడ్ కు చాలా అంటే చాలా తక్కువ స్క్రీన్స్ దొరికాయి. వాటి సంఖ్య కాస్త పెంచమని మైత్రీ డిమాండ్. సినిమాలకు అడ్డా అయిన ప్రసాద్ ముల్టీప్లెక్స్ లో మైత్రీ సినిమాలు వేయరు.

లక్నోలో స్టార్ పేసర్ ఎంట్రీ.. సన్‌రైజర్స్‌ను ఆపేనా! తుది జట్లు ఇవే
ఐపీఎల్‌ 18వ సీజన్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోసారి భారీ స్కోరుతో విరుచుకుపడాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఐపీఎల్ 2025లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తరం పోరు ఖాయంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌లోనే 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి మరోసారి పరుగుల వరద పారించాలని భావిస్తోంది. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించారు. వీరందరూ మరోసారి చెలరేగితే.. 300 స్కోర్ ఖాయమే. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీలతో పేస్ విభాగం బలంగానే ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడమ్ జంపా ఆడే అవకాశాలు ఉన్నాయి.