NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నేడు భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం..
నేడు సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11.30గంటలకు ఈ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై ప్రధానంగా చర్చించనున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటి నివేదికపై సుధీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పారు. దీంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయనుంది. దీంతో పాటు అనర్హులను తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంటలు పండించని భూ యజమానులకు రూ.21 వేల కోట్లకు పైగా డబ్బులు వేసిందనీ, కానీ ఇప్పుడు నిజమైన రైతులందరికీ రైతు భరోసా పథకం ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది.

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. అభినందించిన వైఎస్ జగన్
ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణమన్నారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతో పాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు మరింత స్ఫూర్తిదాయకమన్నారు. కోనేరు హంపి నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ అభినందనలు చెప్పుకొచ్చారు.

పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఏమైందన్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కుటుంబాలు కనబడలేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మంచితనంతో బ్రతికిపోతున్నారు.. ఆయన మంచితనంతో కార్యకర్తల చేతులు కట్టేశాడని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాడు అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

పక్షి ఢీకొనడం, గేర్ ఫెయిల్యూర్, బెల్లీ ల్యాండిగ్.. 179 మందిని బలి తీసుకున్న కారణాలు..
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 179 మంది విమాన ప్రయాణీకులు మరణించారు. బోయింగ్ 737-800 విమానంలో వరసగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రన్ వే నుంచి వేగంగా వెళ్లి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విమానం అంతా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో అధికారులు ఇద్దరి ప్రాణాలు కాపాడారు. విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగా, ‘‘బెల్లీ ల్యాండింగ్’’ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. విమానం పొట్ట భాగం రన్ వేపై ఉంది. దీంతో ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణం తెరుచుకోకపోవడంతోనే పైలట్ ఈ విధంగా చేసినట్ల తెలుస్తోంది. ఎయిర్ పోర్టు అధికారులను ఉటంకిస్తూ యోన్‌హాప్ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. సాధారణ ల్యాండింగ్ విఫలం కావడంతో పైలట్ క్రాష్ ల్యాండింగ్‌కి ప్రయత్నించినట్లు తెలిపింది. విమానాన్ని అంతకుముందే ‘‘పక్షి’’ ఢీకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పక్షి ఢీకొట్టిన తర్వాతే ఒకదాని వెనక ఒకటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం, బెల్లీ ల్యాండింగ్ ప్రమాదానికి కారణమయ్యాయి. “విమానం యొక్క ల్యాండింగ్ గేర్, టైర్లు వంటివి యాక్టివేట్ కాలేదని, బహుశా క్రాష్ ల్యాండింగ్‌కు ప్రయత్నించి ఉండొచ్చు బహుశా ఇదంతా పక్షి ఢీకొనడం వల్ల పనిచేయకపోవడం వల్ల కావచ్చు” అని నివేదిక పేర్కొంది.

H-1B వీసాలకు ట్రంప్ మద్దతు.. భారతీయులకు గుడ్ న్యూస్..
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈలోపే సొంత వర్గంలోనే విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ వలసలు, H-1B వీసా వివాదం ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ మస్క్ మద్దతుదారులుగా మారింది. సంప్రదాయ ట్రంప్ మద్దతుదారులు వలసల్ని వ్యతిరేకిస్తుంటే, ఎలాన్ మస్క్‌లో పాటు వివేక్ రామస్వామి వంటి వారు అధిక నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశంలోకి ప్రవేశించేందుకు సహాయపడే వీసా ప్రోగ్రామ్‌కి మద్దతు తెలిపారు. ట్రంప్ పరిపానలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానానికి భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, మస్క్ స్నేహితుడు శ్రీరామ్ కృష్ణన్‌ని నియమించడంతో వివాదం ప్రారంభమైంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్‌కార్డ్‌పై ఉన్న పరిమితుల్ని తొలగించాలని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ట్రంప్ మద్దతుదారులకు రుచించడం లేదు. కరుగుగట్టిన రైటిస్ట్ నేత లారా లూమర్ శ్రీరామ్ నియామకాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కొంతమంది భారత విద్వేష వైఖరిని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ H-1B వీసాకి మద్దతు తెలపడం కీలకంగా మారింది. ముఖ్యంగా భారతీయులకు ఇది ఎక్కువ ప్రయోజనంగా మారే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడో తెలిసిపోయిందోచ్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి మొదలు కానుంది. కానీ అంతకంటే ముందు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు రెడీ ఉండండని గేమ్ ఛేంజర్ మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే.. లక్నోలో గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేసే అసలు సిసలైన థియేట్రికల్ ట్రైలర్ రాబోతోందట. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ పై ఉన్న హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలంటే పవర్ ఫుల్ ట్రైలర్ రావాల్సిందే. ఇప్పటికే ట్రైలర్ కట్‌ వర్క్ జరుగుతోందట. అయితే డిసెంబర్ 27న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకున్నారు కానీ ఎందుకనో వాయిదా వేశారు. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చే అవకాశముందని అంటున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 4, 2025న ప్రత్యేక ఈవెంట్ సందర్భంగా విడుదల చేస్తారని తెలుస్తోంది.

Show comments