NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఐఐటీ హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ నేడు (ఆదివారం) కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్‌ (IIIT) డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తితో కలిసి హెలిపాడ్‌, సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉప రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీఐపీ పార్కింగ్‌, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌, హెలిపాడ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు, ఐడీ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ మాధురి, అదనపు ఎస్పీ సంజీవ్‌రావు, డీఎస్పీ సత్తయ్యగౌడ్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీపీవో సాయిబాబా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంబంధించి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్‌ మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి పర్యటన కోసం 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశామని వివరించారు.

నేడు వనపర్తిలో పర్యటించనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వనపర్తి పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా, ఉదయం 11.30 గంటలకు వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ZPHS పాఠశాలను సందర్శిస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని, పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం, రుణ మేళా, ఉద్యోగ మేళాల్లో పాల్గొనడం జరగనుంది. ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4.15 గంటలకు వనపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు.

మరికాసేపట్లో మృతదేహాలను వెలికి తీయనున్న రెస్క్యూ టీమ్స్..
SLBC టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. రక్షణ బృందాలు మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలను వెలికితీయనున్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్, వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మృతదేహాలను ఆయా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి.

ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు ఐదేళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. నాలుగు కేటగిరి లుగా ఉపాధ్యాయుల విభజన చేశారు. ఈ నెల 7వ తేదీ లోగా ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం అయ్యే లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయలాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియం­త్రణ ముసాయిదా చట్టం–2025 పేరుతో బిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, జూన్‌ 1 నుంచి మే 31వ తేదీ వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని, దాని ఆధారంగానే టీచర్ల బదిలీలు కొనసాగించే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు 9 నెలలు మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా లెక్కిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే, హెచ్‌ఎంలు, ఉపా­ధ్యాయులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రొఫార్మాను డౌన్‌లోడ్‌ చేసు­కుని పూర్తి వివరాలు నింపి ఈ నెల 7వ తేదీ సా­యం­త్రం 5 గంటల్లోగా మెయిల్‌ చేయాలని వెల్లడించింది.

నేడు స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ
ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ రోజు ( మార్చి 02వ తేది) స్థానిక దర్శన కోటా టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టికెట్లు ఇవ్వనున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి స్వామి వారి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక, తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరి నెలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గింది. గత నెలలో ఒక్క రోజు కూడా బయటకి రాని క్యూ లైన్లు.. ఎక్కువ రోజులు కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం కంప్లీంట్ అయింది. ఫిబ్రవరి నెలలో భక్తుల సంఖ్య తగ్గడంతో.. కేవలం స్వామివారిని 19.12 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.

సబ్ జైలుకు పోసాని.. నిలకడగా ఆరోగ్యం..
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని కొద్దీ రోజలు కిందట ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వర్గ వైషమ్యాలు కలిగించే విధంగా పోసాని మాట్లాడారని జనసేన నేత ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం 14 పోలీస్ రిమాండ్ లో ఉన్నారు. కాగా నిన్న రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో పోసానిని కడప రిమ్స్ కు తరలించి పలువైద్య పరీక్షలు నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రిలో పోసానికి ఎకో టెస్ట్ తో పాటు పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించారు పోలీసులు. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. పోసానికి ఎటువంటి అనారోగ్యం లేదని చాతి నొప్పి అని డ్రామా ఆడారుని, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని ధ్రువీకరించారు. అందుకే పోసానని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఉదయం అల్పాహారంగా గోదుమ ఉప్మా తిన్నారు పోసాని. రాజంపేట సబ్ జైల్లో మూడు రోజులు గా రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళికి నిన్న రాజంపేట, కడప ఆసుపత్రులలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి రాత్రి సబ్ జైలు కు తరలించిన తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్న జైలు అధికారులు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 2 బస్సులు ఢీ.. 37 మంది మృతి
బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని అక్కడి పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఇక, బొలీవియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 7 గంటలకు (బొలీవియా స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఉయుని, కొల్చాని రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు ఢీకొనగా.. ఇందులో ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు మృతి చెందగా గాయపడిన వారిని తక్షణమే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పుకొచ్చారు.

రికార్డులు తిరగరాసిన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఎప్పటి నుండో ఉరిస్తున్న ఈ సినిమా టీజర్ ను తమిళనాడులో సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసారు. ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్‌ ఓ రేంజ్ లో చూపించాడు. అయితే GBU టీజర్ కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తమిళనాడు హయ్యెస్ట్ వ్యూస్  పరంగా విజయ్ నటించిన మాస్టర్ 19.35 మిలియన్ వ్యూస్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ 17.46 మిలియన్ తో రెండవ ప్లేస్ లో ఉంది. ఇప్పడు ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టి GBU టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టీజర్ రిలీజైన 24 గంటల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ 32 మిలియన్ వ్యూస్ తో విజయ్ రికార్డును బద్దలు కొట్టి టాప్ 1 లో నిలిచించింది. కోలీవుడ్ హిస్టరీలో అత్యధిక వ్యూస్ రాబట్టిన హీరోగా అజిత్ కుమార్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదలవుతుంది.

టేబుల్ టాపర్‌గా నిలిచేదెవరో? నేడే భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ నేడు దుబాయ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్-A నుండి ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. దింతో గ్రూప్ స్టేజిలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. భారత క్రికెట్ జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో తొలిప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ మ్యాచ్ లోను 6 వికెట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్ చేరింది. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నేతృత్వంలో తన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 60 పరుగుల తేడాతో, రెండవ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రస్తుతం గ్రూప్-Aలో భారత్, న్యూజిలాండ్ చెరో 4 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ నికర రన్ రేట్ 0.863 ఉండగా, భారతదేశం నికర రన్ రేట్ 0.647 మాత్రమే ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో రెండు జట్లు అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో సులువైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలని చూస్తున్నాయి. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ 118 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 60 మ్యాచ్‌ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగియగా, 7 మ్యాచ్‌లకు ఫలితం రాలేదు.