NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

నేడే తెలంగాణ బడ్జెట్.. రూ. 3.20 లక్షల కోట్ల పైనే పద్దు..?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి సుమారు 3. 20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్‌ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ఆర్ఆర్ఆర్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉంది. అయితే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.

నేడే తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం
నేడు (మార్చ్ 19న) తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉదయం 11:14 నిమిషాలకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ప్రస్తుతం ఆసక్తి్కరంగా మారింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈసారి రూ. 3.20 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

నేడు బిల్ గేట్స్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌తో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఏపీకి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై బిల్‌ గేట్స్‌తో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా బిల్ గేట్స్ ఉన్నారు. ఏపీకి వివిధ రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సుపరిపాలన, ఉపాధి కల్పన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. బిల్‌ గేట్స్‌, సీఎం చంద్రబాబు చర్చల అనంతరం ఏపీ గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

14వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
నేడు 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఆర్ధిక సాయం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి అండ్ దిగుమతి, పశు వైద్యశాలలపై సభ్యుల ప్రశ్నలు అడగనున్నారు. విశాఖ రైతులకు భూ కేటాయింపు, దొనకొండలో పారిశ్రామికవాడ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలపై ప్రశ్నలు సందించనున్నారు. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రెవెన్యు సమస్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పంచాయతీరాజ్, నగరపాలక, పురపాలక, నగర పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల లెక్కలపై ఏకీకృత ఆడిట్ సమీక్షా నివేదికను సభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన 2025, ఏపీ మహానగర ప్రాంత, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లును మంత్రి పొంగూరు నారాయణ ప్రతిపాదించనున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయముల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లును బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించనున్నారు.

త్వరలో భారత్‌లో పర్యటించనున్న సునీతా విలియమ్స్!
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమ్మీద ల్యాండ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే సునీతా కుటుంబ సభ్యులు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుందని తెలిపారు. అంతేకాకుండా త్వరలో సునీతా విలియమ్స్ భారత్‌లో పర్యటిస్తారని బంధువు ఫల్గుణి పాండ్యా వెల్లడించారు. సురక్షితంగా భూమ్మీదకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తిరిగి సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్తారా? లేదా? అనేది ఇంకా తెలియదు అని చెప్పారు. సునీతాదే ఫైనల్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. సునీతా అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. సునీతా తన 59వ పుట్టిన రోజు సెప్టెంబర్ 19న అంతరిక్షంలోనే జరుపుకుందని చెప్పారు. అన్ని క్షేమంగా జరిగేలా చేసిన దేవునికి పాండ్యా కృతజ్ఞతలు తెలిపారు.

వెల్ కమ్ బ్యాక్ సునీత.. భూమిపైకి తిరిగొచ్చిన నాసా వ్యోమగాములు
ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుధీర్ఘ విరామానికి తెరపడింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చింది. బుచ్ విల్మోర్ కూడా ఆమెతో తిరిగి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు క్యాప్సూల్స్ ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఇద్దరు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 17 గంటలు పట్టింది. క్యాప్సుల్స్ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని బోట్ల సాయంతో నౌకపైకి తెచ్చి ఒడ్డుకు చేర్చారు. వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించనున్నారు. ఈ ఇద్దరు నాసా వ్యోమగాములు కేవలం ఎనిమిది రోజుల పర్యటనక కోసం వెళ్లారు. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం కారణంగా, ఇద్దరూ తొమ్మిది నెలల 14 రోజులు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.

నా కల ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు
ప్రజంట్ రష్మిక పేరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతగా మారుమ్రోగి పోతుందో చెప్పక్కర్లేదు. ‘యానిమల్‌’ మూవీతో యుత్ కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో శ్రీవల్లి స్టార్‌ హీరోయిన్‌గా అవరించింది. ఇక ‘ఛావా’ మూవీ తో నటిగా కూడా కితాబులందుకుంది. ఇక త్వరలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ‘సికిందర్‌’ చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. మార్చి 28న రంజాన్ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్, రాష్మిక జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ‘జోరా జబిన్’, ‘బమ్ బమ్ భోలే’ పాటలు ఇప్పటికే విడుదలై హిట్ అవ్వగా, ఇప్పుడు ‘సికిందర్ నాచే’ అనే టైటిల్ ట్రాక్ పాట టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఇద్దరి డాన్స్ అదిరిపోయింది. అయితే విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ సల్మాన్ గురించి వైరల్ కామెంట్స్ చేసింది..

రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ  డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కాగా తాజాగా రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మూవీ టీమ్. కాగా ఇటీవల మహా శివరాత్రి పండుగ సందర్భంగా ‘ఆదిత్య 369’ సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ, డేట్ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు 4K వెర్షన్‌లో ఏప్రిల్ 11న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సౌండ్ కూడా 5.1 క్వాలిటీ లోకి కన్వర్ట్ చేశామని.. ప్రసాద్స్ డిజిటల్ టీం 6 నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారని, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే వింటేజ్ బాలయ్యను మరోసారి థియేటర్ లో చూసి అభిమానులు ఎంజాయ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.