NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

నేడు అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీయే కూటమి సర్కార్ ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు బిల్లుపై సభలో చర్చించిన ఆమోదం తెలిపిన తర్వాత.. విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్‌ పేరు పెడుతూ.. చట్టసవరణ చేసే బిల్లుపై చర్చిస్తారు. ఇక, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, కేజీహెచ్​లో బెడ్స్, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రశ్నలకు మంత్రులకు ఆన్సర్లు ఇవ్వనున్నారు. అలాగే, రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్యకారులకు జీవో 217 ఇబ్బందులపై కూడా సభలో మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద జగన్ ధర్నా..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురి కేంద్రమంత్రుల అపాయింట్మెంట్‌ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి మాజీ సీఎం జగన్‌ కంప్లైంట్ చేయనున్నారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే (టీడీపీ+ జనసేన+ బీజేపీ) కూటమి ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరే అవకాశం ఉంది. ఇవాళ్టి ధర్నాలో హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించేందుకు వైసీపీ నిర్ణయించింది. ఇక, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు.

నేడు టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకే..!
నేడు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్‌ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. జులై 27వ తేదీన తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకే అక్టోబర్‌ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురి పరిస్థితి విషమం!
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఫర్నిచర్‌ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పది ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫర్నిచర్‌ తయారీ గోదాంలో 20 మంది ఉన్నారు. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక బాగా ఇబ్బందిపడ్డారు. అధికారులు నిచ్చెన ద్వారా వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. 20 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఫర్నిచర్‌ తయారీ గోదాంలో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ అంతమంది గోదాంలో ఎందుకు ఉన్నారు?, వారంతా పని చేసేవారేనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బడ్జెట్‌కు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ఇండియా బ్లాక్ ఎంపీలు
కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని పార్లమెంట్‌లో, వెలుపల నిరసన తెలియజేయాలని ఇండియా బ్లాక్ పార్టీలు మంగళవారం నిర్ణయించాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు రాజాజీ మార్గ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్‌ పార్టీల ఫ్లోర్‌ లీడర్‌ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ప్రమోద్ తివారీ, లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ , ఈ సమావేశంలో టిఎంసి నాయకులు డెరెక్ ఓబ్రెయిన్, కళ్యాణ్ బెనర్జీ, డిఎంకె టిఆర్ బాలు, జెఎంఎం మహువా మాజీ, ఆప్ నుండి రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, సిపిఐ(ఎం) జాన్ బ్రిట్టాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఇప్పటికే బడ్జెట్ భావనను నాశనం చేసింది. చాలా రాష్ట్రాలపై పూర్తిగా వివక్ష చూపింది, కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిందేనని ఇండియా బ్లాక్ మీటింగ్ భావిస్తోంది. ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా వివక్షత, ప్రమాదకరమైనది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ఫెడరలిజం, ఫెయిర్‌నెస్ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం” అని అన్నారు. దీనికి నిరసనగా జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.

విషమించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ లో చేరిక
ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో మంగళవారం (జులై 23) ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రత్యేక వైద్యుల బృందం అతడిని పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ప్రస్తుతం లాలూ యాదవ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. లాలూ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కనిపించారు. ఆయన సోమవారం నాడు పాట్నా నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎయిమ్స్ వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ఆస్పత్రిలో చేరిన లాలూ యాదవ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. అతని చుట్టూ మద్దతుదారుల గుంపు కూడా కనిపిస్తుంది. ఆర్జేడీ నేత ప్రిన్స్ యాదవ్ కూడా లాలూ యాదవ్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. లాలూ యాదవ్ సోమవారం (జూలై 22) ఢిల్లీకి చేరుకున్నారు. అదే రోజు బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్‌ డిమాండ్‌పై లాలూ యాదవ్‌ కార్నర్‌ చేశారు. 77 ఏళ్ల మాజీ సీఎం లాలూ యాదవ్ గత కొన్నేళ్లుగా అనేక వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. 2022లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. సమాచారం ప్రకారం లాలూకి కిడ్నీ వ్యాధి ఉంది. వైద్యులు అతనికి మార్పిడి చేయాలని సూచించారు.

టెర్రిరిస్ట్ లతో సంబంధాలు.. నలుగురు ఉద్యోగులను తొలగించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం
వివిధ శాఖలకు చెందిన నలుగురు ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. వీరిలో ఇద్దరు పోలీస్ డిపార్ట్‌మెంట్ (కానిస్టేబుల్), ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (జూనియర్ అసిస్టెంట్), మరొకరు రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ (విలేజ్ లెవల్ వర్కర్) ఉద్యోగులు. రాజ్యాంగంలోని సెక్షన్ 311 (2) (సి) ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. ఎందుకంటే వారు ఉగ్రవాద సంస్థల తరపున పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వారికి వ్యతిరేకంగా నేరారోపణలు చేసే సాక్ష్యాలను సేకరించాయి. ఇది ఉగ్రవాద కార్యకలాపాలలో వారి ప్రమేయాన్ని వెల్లడించింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కానిస్టేబుల్ ఇంతియాజ్ అహ్మద్ లోన్, పుల్వామా జిల్లా ట్రాల్‌లోని గామ్‌రాజ్‌లో నివసిస్తున్న మొహమ్మద్ అక్రమ్ లోన్ ఇద్దరు ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు తేలింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్, కుప్వారా జిల్లా ఖుర్హామా లాల్‌పోరా నివాసి మంజూర్ అహ్మద్ మీర్ కుమారుడు బజీల్ అహ్మద్ మీర్ కూడా లోలాబ్ ప్రాంతంలో డ్రగ్స్ సిండికేట్‌ కు సాయం చేస్తున్నట్లు తేలింది. డ్రగ్స్‌కు ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధం ఉంది. జమ్మూకశ్మీర్‌లో సెలక్షన్‌ గ్రేడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ముస్తాక్‌ అహ్మద్‌ పీర్‌ పాకిస్థాన్‌లో డ్రగ్స్‌ స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరుచుకుని డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతను సరిహద్దులో పనిచేస్తున్న నార్కో-టెర్రరిస్ట్ సిండికేట్‌ల నాయకులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు.

నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్  సినిమా చరిత్రలో ఏ హీరో  సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి -2. రాజమౌళి లేకుండా  కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898AD’. ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్  రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు హీరో ఎవరు అవుతారోనని ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ రేస్ లో ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప తెలుగుతో పాటు నార్త్ బెల్ట్ లో అదిరే కలెక్షన్స్ రాబట్టింది. వీరి కాంబోలో రాబోతున్న పుష్ప -2తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అవకాశం ఉందని ట్రేడ్  టాక్. ఇక ‘RRR’తో సూపర్ హిట్ సాధించిన రామ్ చరణ్, jr.ఎన్టీయార్ లకు నార్త్ లో  మంచి మార్కెట్ ఏర్పడింది. శంకర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ఫై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కెలెక్షన్లు సాదించడం మ్యాటర్ కాదు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో  అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే  రూ.1000కోట్లు రాబట్టి తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయనడంలో సందేహం లేదు.