NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి!
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దాంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం 8:30కి మహంకాళి ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు వెళ్లనున్నారు. శనివారమే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ డిల్లీకి వెళ్లారు. నేడు అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. వరంగల్ నగరంలో జరిగే రైతుసభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. నేడు సభ తేదీ ఖరారు అయ్యే అవకాశం ఉంది.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన పొన్నం ప్రభాకర్!
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ లార్సన్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్.. మొదటి బోనం సమర్పించారు. అనంతరం ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘అమ్మవారి దయవల్ల వర్షాలు సమృద్ధిగా పడి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. బోనాల జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు హైదరాబాద్ నగర ప్రజలు వారికి ఆతిథ్యం ఇచ్చి.. అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలి. ప్రజల సహకారంతోనే జాతర విజయవంతం అవుతుంది. హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల జాతరను విజయవంతంగా నిర్వహిస్తాం’ అని అన్నారు.

చింతూరులో పోటెత్తిన వరద.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు..!
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎటు వెళ్లే మార్గం లేక వరద నీటిలోనే వాహనాలు ఆగిపోయాయి. ఒక పక్క గోదావరి, మరోవైపు శబరి నది పొంగి పొర్లడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక, విలీన మండలాల్లో పలు చోట్ల రహదారులపైకి వరద నీవరు వచ్చి చేరింది. ఏటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల దగ్గరకు వరద నీరు చేరుతుంది. ముంపు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

పార్లమెంట్ సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశం… 23న బడ్జెట్‌
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ హాజరుకానున్నారు. దేశంలోని అతిపెద్ద పంచాయతీలో ప్రతిష్టంభన, గందరగోళాన్ని నివారించడానికి, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాలను సభ లోపల లేదా వెలుపల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శించకూడదని ఎంపీలు శనివారం గుర్తు చేశారు. వందేమాతరం, జై హింద్ వంటి నినాదాలు చేయవద్దని, సభలో నేలపై బైఠాయించి నిరసనలు చేయడం మానుకోవాలని సభ్యులకు సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 23న ప్రధాని నరేంద్ర మోడీ మూడో టర్న్ లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ సభ్యుల కోసం జూలై 15న రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్‌ను విడుదల చేసింది. వీటిలో పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాలు, పార్లమెంటరీ మర్యాదలపై సభ్యులను దృష్టిపెట్టాల్సిందిగా కోరింది. పార్లమెంటరీ మర్యాదలను ఉటంకిస్తూ, దూషణలు, అభ్యంతరకరమైన, అన్‌పార్లమెంటరీ వ్యక్తీకరణలతో కూడిన పదాలను ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలని పేర్కొంది. ఒక నిర్దిష్ట పదం లేదా వ్యక్తీకరణ అన్‌పార్లమెంటరీ అని ఛైర్మన్ భావించినప్పుడు, దానిపై ఎటువంటి చర్చను ప్రేరేపించకుండా వెంటనే దానిని ఉపసంహరించుకోవాలి. ఒక సభ్యుడు మరొక సభ్యుడిని లేదా మంత్రిని విమర్శించినప్పుడు, అతని సమాధానం వినడానికి సభలో ఉండవలసి ఉంటుంది. సంబంధిత సభ్యుడు లేదా మంత్రి సమాధానమిచ్చేటప్పుడు గైర్హాజరు కావడం పార్లమెంటరీ మర్యాదలను ఉల్లంఘించడమే.

ఇంఫాల్‌లో భారీ విధ్వంసం విఫలం.. 8 ఐఈడీలను నిర్వీర్యం చేసిన సైన్యం
భారత సైన్యం, మణిపూర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్‌లో, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో ఎనిమిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లను (ఐఇడి) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది. బాంబు నిర్వీర్య బృందంతో పాటు ఆర్మీ బృందం వేగంగా పని చేసి 33 కిలోల బరువున్న ఐఈడీని నిర్వీర్యం చేసింది. సైన్యం, పోలీసుల ఈ సత్వర చర్య భద్రతా దళాలు, ఇతర ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకున్న ప్లాన్ ను పటాపంచలు చేసింది. ఈ ప్రాంతాన్ని ఇంఫాల్ తూర్పులోని మొయిరంగ్‌పురేల్, ఇథమ్ గ్రామాలలో రైతులు, పశువుల కాపరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ చర్యతో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల దుశ్చర్యలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లా చానుంగ్ టాప్‌లో సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం, మణిపూర్ పోలీసులు జూలై 17న కాంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల నుండి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆయుధాలను విచారణ నిమిత్తం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో యాంటీ సెక్స్ బెడ్స్.. ఇక అథ్లెట్లకు కష్టమే!
పారిస్ ఒలింపిక్స్‌ 2024కు సమయం దగ్గరపడుతోంది. మరో ఐదు రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్‌ జరగనున్నాయి. విశ్వక్రీడలను ఘనంగా నిర్వహించేందుకు పారిస్‌ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే క్రీడాకారుల కోసం ఒలింపిక్ విలేజ్‌లో భిన్న ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్స్‌ సమయంలో అథ్లెట్లు శృంగారంలో పాల్గొనకుండా నిరోధించడానికి ‘యాంటీ సెక్స్ బెడ్స్’ సిద్ధం చేశారు. అంతేగాక బెడ్ సైజ్‌ను కూడా తగ్గించారు. కరోనా మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్‌లో శృంగారంను నిషేధించిన విషయం తెలిసిందే. కఠిన నిబంధనల మధ్య గత విశ్వక్రీడలు జరిగాయి. ఈసారి ఆంక్షలను ఎత్తివేశారు. దాంతో ఒలింపిక్ విలేజ్‌లో క్రీడాకారుల కోసం దాదాపు 3 లక్షల కండోమ్‌లను నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే శృంగారాన్ని అడ్డుకోవడానికి నిర్వాహకులు ప్రయత్నించడం విశేషం. ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా పడుకోవడానికి వీళ్లేకుండా.. బెడ్ పరిమాణంను తగ్గించారు. అంతేగాక బెడ్‌లను యాంటీ సెక్స్ పదార్థాలతో తయారుచేశారు. అథ్లెట్లకు శృంగారంపై పెద్దగా ఆసక్తి కలగకుండా ఈ చర్యలు తీసుకున్నారు.

ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటిసులు..అసలేమైందంటే..?
ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కాగా నిర్మాత అశ్వనీదత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ కు కల్కి ధామ్ పీఠాధిపతి కల్కిఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి సినిమాపై విమర్శలు గుప్పించారు. “తల్లి (దీపికా)కు కృత్రిమ గర్భం ద్వారా కల్కి పుట్టబోతున్నట్టు చూపించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే, హిందూ గ్రంధాలను ఇష్టానుసారంగా మార్చేసి చిత్రాలు తెరకెక్కించడం ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది” అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. కల్కి చిత్రం సనాతన ధర్మానికి, హిందూ పురాణాలకు కించపరిచినట్టు ఉందని నోటీసులో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. భారతదేశం “విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతో కూడినది సనాతన ధర్మం, వాటి విలువలను మార్చకూడదు. సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారు” అని కృష్ణం తెలిపారు. మరోవైపు కల్కి సక్సెస్ ఫుల్ గా నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. అటు ఓవర్ సీస్ లో 18మిలియన్ల దాటి దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు  అటు ఇటుగా రూ.100 కోట్లకు పైగా లాభాలు ఆర్జించారు నిర్మాత అశ్వనీదత్.

Show comments