NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు వివిధ శాఖల అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం..
నేడు సెక్రటేరియట్ లో వివిధ శాఖల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ సమావేశం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (HYDRA)పై సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్‌ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకొని.. ప్రజలకు విస్తృత సేవలను అందించేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ.. అక్రమ నిర్మాణాల నియంత్రణ.. ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలనేది ప్రభుత్వ యోచనలో ఉంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. హైడ్రా ఏర్పాటుకు వీలుగా ఇప్పుడున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని వారం రోజుల కిందటే సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఔటర్‌ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహిస్తుంది.

నేడు కవిత.. లిక్కర్, సీబీఐ కేసు విచారణ..
ఇవాళ కవిత లిక్కర్ సీబిఐ కేసు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరపనున్నారు. సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంతో పాటూ, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవిన్యూ కోర్టు విచారణ జరపనున్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ విచారణ జరపనుంది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించిన విషయం తెలిసిందే… ఈ నేపథ్యంలో జూలై 8న ట్రయల్ కోర్టులో కవిత సీబీఐ కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా ఇవాల్టికి పిటిషన్ ను వాయిదా వేశారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సీబీఐ పలు ఆధారాలతో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై నేడు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా.. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది. మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఇద్దరు వ్యక్తులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించాడు.. మరోవ్యక్తి పోలీసులపై రాళ్లు విసిరాడు. తనిఖీలు చేస్తుండగా పోలీసులపై దాడికి యత్నించడంతో అప్రమత్తమై పోలీస్ డెకాయ్ టీం వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని అనీస్, రాజ్ గుర్తించారు. గాయపడ్డ వారితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గాల్పుల్లో గాయపడ్డ వారు దోపిడి దొంగలుగా అనుమానిస్తున్న వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగరంలో ఐదవ సారి సిటీ పోలీసులు కాల్పులు జరిపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో కాల్పులకు గాయపడ్డ నిందితుడికి చికిత్స కొనసాగుతుంది. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలికి బుల్లెట్ తగలడంతో కొద్దిసేపటి క్రితమే బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని , ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెలిపారు. కొద్ది రోజుల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో పార్డి ముఠాపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. గత వారం హైదరాబాద్‌లో దొంగల ముఠాను పట్టుకునేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న దంపతులపై ముగ్గురు వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి నగలు దోచుకెళ్లారు. అయితే ఈ క్రమంలో హయత్ నగర్ మీదుగా ఎల్బీనగర్ వైపు వెళ్తున్న ఆటోను నిందితులు ట్రాక్ చేశారు. ఎల్బీ నగర్ వద్ద వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.

ముచ్చుమర్రిలో ఇంకా దొరకని 9వ తరగతి బాలిక మృతదేహం..
కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ముగ్గురు మైనర్ బాలురను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేసామని సదరు మైనర్ బాలురు చెప్పారు. దీంతో మొదట కాలువలో ఒక చోట పడేసామని చెప్పిన మైనర్ బాలురు.. ఆ తరువాత కాలువలో పంప్ హౌస్ సమీపంలో పడేసామని మరోసారి చెప్పారు. అయితే, ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో 9వ తేది సాయంత్రం నుంచి బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆధునిక కెమెరాలు నీటిలోకి పంపి గాలించిన సిబ్బంది.. అయినా చిన్నారి మృతదేహం జాడ దొరకలేదు. అయితే, మరోవైపు విద్యార్థి వాసంతి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఆందోళనకు దిగారు. అదృశ్యమైన వాసంతిని ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారని వాసంతి తల్లిదండ్రులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు కేజీ రోడ్డుపై ధర్నా విరమించే లేదని ఆందోళన చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 65, 392 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29, 015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, హుండి ఆదాయం 4. 23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక, ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్పపల్లకిలో మలయప్పస్వామి దర్శనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే, తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇందు కోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి.. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు.

నేడు కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు..
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే 17వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు జారీ చేసింది. అయితే, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్‌ చేసింది.. జూన్ 25వ తేదీన ఢిల్లీ హైకోర్టు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇచ్చింది. అయితే, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ డిప్యూటి సీఎం, మనీష్ సిసోదియా, మంత్రి సత్యేంద్ర జైన్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2021- 22లో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకు వచ్చారు. కానీ, ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్, ఇతర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఒక్కసారిగా రావడంతో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

హత్రాస్ తొక్కిసలాట ఘటన.. పిటిషన్‌పై నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. జూలై 2న జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జూలై 12న విచారణ చేపట్టనుంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ ఘటనపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని.. పిటిషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులు, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనితో పాటు ఏదైనా మతపరమైన లేదా ఇతర కార్యక్రమాలలో ప్రజల భద్రత కోసం తొక్కిసలాటలు లేదా ఇతర సంఘటనలు జరగకుండా మార్గదర్శకాలను జారీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలని డిమాండ్ కూడా చేశారు. భోలే బాబా సత్సంగం జూలై 2, మంగళవారం నాడు హత్రాస్‌లోని సికంద్రరావులోని ఫుల్రాయ్ ముగల్‌గర్హి గ్రామంలో ప్రారంభమైంది. 80 వేల మందికి అనుమతి ఉన్నప్పటికీ సత్సంగానికి 2.5 లక్షల మందికి పైగా వచ్చారు. బాబా తన సత్సంగాన్ని ముగించినట్లు ప్రకటించిన వెంటనే, బాబా ప్రైవేట్ సైన్యం వేదిక మొత్తాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ బాబా వ్యక్తిగత సైన్యం లేదా పోలీసులు జనాన్ని నిర్వహించడానికి సరిపోలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బాబా కాన్వాయ్ దాటగానే గుంపు ఆగింది. ఈ సమయంలో పాదాలను చూసుకునే క్రమంలో అనుచరులు అదుపుతప్పారు. తొక్కిసలాట సమయంలో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. బాబా సేవకులు వాహనాల్లో పారిపోతూనే ఉన్నారు. ఎవరూ ఆగి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

రాహుల్‌ ద్రవిడ్‌ కంటే ముందే.. రూ.5 కోట్లు వదులుకునేందుకు సిద్దమైన రోహిత్‌!
టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తంలో 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు దక్కనున్నాయి. బీసీసీఐ ఇచ్చిన బోనస్‌పై ద్రవిడ్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బోనస్‌ను సగానికి తగ్గించాలని బీసీసీఐని కోరారు. మిగతా కోచ్‌లకు ఇచ్చిన విధంగానే రూ.2.5 కోట్లు తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ద్రవిడ్‌ కంటే ముందే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన బోనస్‌ను వదులుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. హాయక సిబ్బందిలో తక్కువ బోనస్ అందుకున్న వారి కోసం రోహిత్ శర్మ తన బోనస్‌ను (రూ.5 కోట్లు) వదులుకునేందుకు సిద్ధపడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. జట్టు కోసం శ్రమించిన సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ సమానంగా డబ్బు అందాలనే ఉద్దేశంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. బార్బడోస్‌ నుంచి భారత్‌ వచ్చే సమయంలో రోహిత్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడట. ‘టీమిండియా గెలుపు కోసం త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌లు, మసాజర్స్‌, ఫిజియోలు.. ఇలా ఎంతో మంది శ్రమించారు. తక్కువగా వచ్చిన సహాయ సిబ్బందిలో అందరికీ సమానంగా నా బోనస్‌ను చెందాలని ఆశిస్తున్నా’ అని రోహిత్‌ ఓ రిపోర్టర్‌తో అన్నాడట. ట్టులోని 15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు, రిజర్వ్‌ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున అందించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌కే రూ.5 కోట్లు.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు దక్కనున్నాయి. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి బోనస్‌ను ప్రకటించారు. ఇక సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లను బీసీసీఐ ప్రకటించింది.

‘భారతీయుడు 2’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్‌. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్‌ హాసన్‌ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఫస్ట్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రతీయుడు 2 చిత్రంకు మిక్స్‌డ్ టాక్‌ వస్తోంది. ‘సినిమా బాగానే మొదలైంది. సినిమా ఊహాజనితంగా మరియు బోరింగ్‌గా ఉంది. ఎక్సైటింగ్ సీన్స్ లేవు. సెకండ్ హాఫ్ బాగుంటేనే సినిమా నిలబడుతుంది’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘శంకర్ తీసిన వరెస్ట్ సినిమా ఇదే. మూడున్నర గంటలు వేస్ట్ చేసుకున్నా’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ‘శంకర్ గారు తన ఆస్థాన రచయిత సుజాత గారిని మిస్ అవుతున్నారేమో. ఆయన చనిపోయాక గట్టిగా దెబ్బ పడింది’ అని నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా ఉందని చాలామంది కామెంట్స్ చేస్టున్నారు. శంకర్ అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో విసిగించాడని అంటున్నారు. డైరెక్టర్ శంకర్ అవుట్ డేటెడ్ అని అంటున్నారు. ట్విట్టర్‌లోని ఈ టాక్ నిజమేనా? అని తెలియాలంటే ఇంకో 2-3 గంటల వరకు ఆగాల్సిందే. భారతీయుడు 2లో సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, ఎస్ జే సూర్య, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.