NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక చర్చ..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 6) ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది.. నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే పరిష్కారం సూచించిన కూటమి ప్రభుత్వం.. పంచ గ్రామాల భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడే ఛాన్స్ ఉంది. ఇక, స్టేట్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB)లో ఆమోదించిన 44 వేల 776 కోట్ల రూపాయల విలువ చేసే 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి.. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉద్యోగా అవకాశాల కల్పనే ధ్యేయంగా పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం.. అయితే, ఈ నెల ఆఖరు వారంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై కేబినెట్‌ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాష్ట్రంలో జరగనున్న రెండు గ్యాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జగనునున్న ఎన్నికల వ్యూహాలపై ఆయా జిల్లాల మంత్రులు, ఇంఛార్జ్‌ మంత్రులతో చర్చిoచే ఛాన్స్ ఉంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

నేడు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం..
నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు (ఫిబ్రవరి 6) మీడియా ముందుకు రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సూపర్ సిక్స్, మున్సిపల్, కార్పోరేషన్ పదవుల ఎన్నికల్లో కూటమి నేతలు ప్రవర్తిస్తున్న తీరుతో సహా మరిన్నీ అంశాలపై మాట్లాడే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెలకొన్న పరిస్థితులపై వైఎస్ జగన్ స్పందించనున్నారు. అలాగే, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ప్రతీకార దాడులకు పాల్పడుతున్న అంశంపై కూడా మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే, నిన్న విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన జగన్.. కష్టాలు ఎల్లకాలం ఉండవని.. ఎవ్వరికి ఏ ఇబ్బందులు వచ్చినా తన జీవితాన్ని గుర్తుతెచ్చుకోవాలని భరోసా ఇచ్చారు. అలాగే, ఎన్డీయే కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని, ఈసారి జగనన్న 2.O వేరుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఈరోజు నిర్వహించబోతయే ప్రెస్‌మీట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.

నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం..
హైదరాబాద్‌లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమావేశమవుతారు. ఆ తర్వాత జిల్లాల వారీగా భేటీలు జరుగుతాయి. మొదట ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత కరీంనగర్‌, వరంగల్‌.. అనంతరం నల్గొండ, హైదరాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల్లోని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు కూడా హాజరవుతారు.

భార్య మోసానికి భర్త బలి.. ఇంటిని అమ్మిన డబ్బుతో ప్రియుడితో జంప్
కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది. గత నెల రోజులుగా భార్య సునీతకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం చెందిన బెంజమిన్ సౌదీ నుండి స్వగ్రామానికి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. భార్యపై భర్తకు ఉన్న ఇష్టంతో ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో ప్రియుడితో పరారైన సునీత ప్రవర్తన భర్తను ఆత్మహత్యకు దారితీసింది. తన జీవితంలో జరిగిన మోసంపై బాధపడిన బెంజమిన్ వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లడించాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య సునీత, ఆమె ప్రియుడు సైజు అలాగే ఆమె చెల్లెలు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్..!
సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీ గా వారీ జీవితాలు ఉండవు. వారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా చిన్నది. దీంతో వారు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఇట్టే వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఓ చిన్న పోస్ట్ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే పుకార్లకు ఆజ్యం పోసింది.. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే. కెరీర్ పరంగా దూసుకుపోతున్న తమన్నా గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ‘ప్రేమించబడడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం.. ఆసక్తికరంగా ఉండటమే. వేరే వాళ్ళు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా ఉండాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది తమన్నా. ప్రజంట్ స్టోరీ వైరల్ అవుతుండటంతో.. ఇప్పటికిప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది.. కొంప తీసి వర్మతో తమన్నా విడిపోయిందా? అంటూ రూమర్స్ వైరలవుతున్నాయి.

అజిత్ విదాముయార్చి.. ట్విట్టర్ రివ్యూ..
తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. నేడు వరల్డ్ వైడ్ గా ‘విదాముయార్చి’ థియేటర్లలో విడుదలైంది. నిన్నటి నుండే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదనే చెప్పాలి. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. కాగా ఓవర్సీస్ లో ఈ ప్రీమియర్స్ తో విడుదల అయిన ఈ సినిమా ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే. అనుకున్నట్టు గానే ఈ సినిమా హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ రీమేక్ అని కథ నేపథ్యం ఆ హాలీవుడ్ సినిమా నుండి తీసుకున్నారు. ఇక సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిముషాలు స్లో పేజ్ స్టార్ట్ అయి అనంతరం కథలోకి వెళ్లిన దర్శకు ఎంగేజ్ చేయగలిగాడు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ స్టైలిష్ గా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఫస్ట్ ముగించాడు. ఇక సెకండ్ ఆఫ్ అక్కడక్కడ కాస్త మెప్పించింది తప్ప ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా విదాముయార్చి ఓ సారి అజిత్ కోసం చూడగలిగే యాక్షన్  చిత్రం అని ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ ఏ మాత్రం బాలేదు అనే ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ఈ  సినిమా తెలుగులో పట్టుదల పేరుతో  ప్రముఖ పంపిణి దారులు ఏషియన్ సురేష్ విడుదల చేస్తున్నారు.

వన్డేలకు వేళాయే.. నాగ్‌పూర్‌ వేదికగా మొదటి మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు చేయగా, భారత్ జట్టులో అనేక కొత్త ముఖాలను చేర్చుకుంది. అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా మరికొందరు ఆటగాళ్ళు జట్టులోకి తిరిగి వచ్చారు. టీ20 సిరీస్‌లో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారింది. అయితే, అతను వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. దీనికోసం ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్ ఆటగాళ్లలో ఒకరైన రూట్‌ను మిడిల్ ఆర్డర్‌లో చేర్చడం కొంత ఉపశమనం కలిగించవచ్చు. వన్డే మ్యాచ్‌లలో భారత్, ఇంగ్లాండ్ మధ్య హెడ్-టు-హెడ్ రికార్డును పరిశీలిస్తే, టీమిండియా బలమైన స్థితిలో ఉంది. రెండు జట్ల మధ్య మొత్తం 107 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారతదేశం 58 మ్యాచ్‌ల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగా, ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక నేడు మ్యాచ్ జరగబోయే నాగ్‌పూర్ పిచ్ ఎల్లప్పుడూ స్పిన్నర్లకు మద్దతుగా ఉంటుంది. కాబట్టి నేటి మ్యాచ్ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లలో ఒకటి కాకపోవచ్చు. ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్‌లో అధిక నాణ్యత గల స్పిన్‌పై భారతదేశం తమ బలహీనతలను చూపించింది.