NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

ఇవాళ పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కీలక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చే అంశంపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక, పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
అలాగే, కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. అక్టోబర్ నాటికి మద్యం కొత్త పాలసీ రూపొందించే అవకాశం ఉంది. పాత విధానంలో ఉన్న లోపాలను సరి చేయాలా..? లేక ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా..? అనే అంశంపై ఈ సమీక్ష సమావేశంలో అధికారులతో సీఎం చర్చ జరిపే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, హోలో గ్రామ్ స్టిక్కర్ల స్కాంపై కూడా ఏపీ సర్కార్ చర్చించనుంది.

రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. రూ.2,737.41 కోట్లను విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆగస్టు నెలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64. 82 లక్షల మందికి రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96 శాతం, 2న 100 శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు. ఇక, సీఎం చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టు పురుగుల షెడ్లను కూడా పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో సీఎం మాట్లాడనున్నారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని, ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వనున్నారు.

రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరు కానున్న కవిత..
ఢిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించింది సీబీఐ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని అభియోగం గావించింది. ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఇవాళ లిక్కర్ కేసు విచారణ జరగనుంది. నేడు లిక్కర్ కేసులో సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ చేపట్టనున్నారు న్యాముర్తులు. నేడు కవిత తోపాటూ ఇతర నిందితులను వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పర్చనున్నారు. ఈ కేసును జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.

వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో నిందుతుడి అరెస్ట్..
వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా మద్యం తాగించాడు గౌతమ్. దాంతో మద్యం తాగగానే స్పృహ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన మహిళ పై అత్యాచారం చేసాడు గౌతం. అలా అమ్మాయిపై అత్యాచారం చేసిన తర్వాత తన మిత్రుడైన శివాజీని పిలిచాడు గౌతం. అతనితో కూడా కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇక కొద్దిసేపటికి మహిళ స్పృహలోకి వచ్చి చూసేసరికి ఇద్దరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డట్టుగా గుర్తించింది. ఆ సమయంలో హోటల్ గదిలో ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి గౌతమ్, శివాజీలు పారిపోయారు. ఇక జరిగిన గ్యాంగ్ రేప్ విషయాన్ని తన మిత్రులకు చెప్పింది మహిళ. దాంతో ఆ లేడీ సాఫ్ట్వేర్ ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె మిత్రులు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. దింతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితుడు గౌతమ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా.. శివాజీ పరారీలో ఉన్నాడు.

సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌తో కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జ‌రిగిన ఈ స‌మావేశం చాలా విధాలుగా ప్రాధాన్యత సంతరించుకుందని చెబుతున్నారు. ఎందుకంటే తాజాగా కర్ణాటకలో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య కొనసాగుతున్న వర్గపోరు దృష్ట్యా నేతలంతా కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వాన్ని సమన్వయంతో నడపాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పటిష్టం చేసేందుకు సమావేశంలో సమగ్రంగా సమీక్షించామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి గల కారణాలపై దృష్టి సారించాలని ఎంపీ రాహుల్ గాంధీ సమావేశంలో కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా నాయకులను కూడా ఏకం చేసి పరిష్కరించాలని కోరారు. సమావేశం అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, మేము కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను కలిశామని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. తద్వారా ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, వేగవంతమైన ప్రగతి సాధ్యమవుతుంది. బసవన్న, బాబాసాహెబ్ అంబేద్కర్‌ల ఆశయాలు, ఆశయాలే కర్ణాటక అభివృద్ధికి పునాది అవుతాయని అన్నారు.

వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం… ఇప్పటివరకు 151 మంది మృతి
భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించే ఘోర ప్రమాదాలలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 151మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) నుండి పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లు ప్రతికూల వాతావరణం మధ్య బాధితుల కోసం వెతుకుతున్నాయి. బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి బహుళ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 45 సహాయ శిబిరాలకు మూడు వేల మందికి పైగా ప్రజలను తరలించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రాత్రి 2 గంటలకు మొదటి కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ తర్వాత తెల్లవారుజామున 4:10 గంటలకు రెండోసారి కొండచరియలు విరిగిపడ్డాయని విజయన్ తెలిపారు. డ్రోన్‌లు, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ప్రజలను కనుగొని సహాయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మృతదేహాలను బయటకు తీయడంలో రెస్క్యూ టీం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రింకు, సూర్య సంచలన బౌలింగ్‌.. సూపర్‌ ఓవర్‌లో శ్రీలంకపై భారత్‌ విజయం!
పల్లెకెలె వేదికగా మంగళవారం రాత్రి శ్రీలంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరిదైన మూడో టీ20లో భారత్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ముందుగా మ్యాచ్ టై కాగా.. సూపర్‌ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్‌కు శ్రీలంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది. తీక్షణ వేసిన తొలి బంతికే సూర్యకుమార్‌ యాదవ్ ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ భారత్‌ సొంతమైంది. సుందర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. పొట్టి సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక శ్రీలంక, భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ శుక్రవారం నుంచి ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (39; 37 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌. జైస్వాల్ (10), శాంసన్ (0), రింకూ (1), సూర్యకుమార్‌ (8), దూబే (13) విఫలమయ్యారు. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను పరాగ్‌ (26), సుందర్‌ (25) ఆదుకున్నారు. లంక బౌలర్లు తీక్షణ (3/28), హసరంగ (2/29) చెలరేగారు. స్వల్ప ఛేదనలో నిశాంక (26), కుశాల్‌ మెండిస్‌ (43), కుశాల్‌ పెరీరా (46) రాణించడంతో లంక సునాయాస విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరి 5 ఓవర్లలో తడబడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. లంక చివరి 5 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా.. 16వ ఓవర్‌లో కుశాల్‌ మెండిస్‌ను బిష్ణోయ్‌ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో హసరంగ (3), అసలంక (0)లను సుందర్‌ ఔట్‌ చేయడంతో లంక ఒత్తిడిలో పడింది. 18వ ఓవర్లో ఖలీల్‌ 12 పరుగులు (అయిదు వైడ్లు) ఇవ్వడంతో సమీకరణం 2 ఓవర్లలో 9గా మారింది. ఆశల్లేని స్థితిలో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లయిన రింకు (2/3), సూర్యకుమార్‌ (2/5) సంచలన బౌలింగ్‌తో భారత జట్టుకు విజయాన్ని అందించారు.

ధనుష్ ‘రాయన్’ సరికొత్త రికార్డులు నమోదు చేసెన్..
ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జూన్ 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలోసందడి చేస్తోంది. కాగా ఈ చిత్రం రిలీజ్ కేవలం 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 105.38 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వందకోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా పలు రికార్డులు తన పేరిట నమోదు చేసాడు ధనుష్. ఇండియన్ బాక్సఫీస్ చరిత్రలో ‘A’ రేటింగ్ సినిమా వంద కోట్లు సాధించిన సినిమాల సరసన 3వ స్థానంలో నిలిచింది. అటు తమిళ్ లో మొట్టమొదటి 100 కొట్ల రూపాయల ‘A’ రేటింగ్ తో కలిగిన సినిమాగా రాయన్ నిలిచింది. దానితో పాటుగా కోలీవుడ్ సెకండ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిన సినిమా కూడా రాయన్ మాత్రమే. ‘రాయన్’ తెలుగులోను అద్భుతంగా రాణిస్తోంది. రూ.2.1 కోట్లకు థియేట్రికల్ కొనుగోలు చేయగా 4 రోజుల్లో ఈ సినిమా రూ.4.05 కోట్ల షేర్ ను రాబట్టింది.ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించి రూ 2 కోట్లు లాభాలు తెచ్చి పెట్టింది. ఆగస్టు 15వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం రాయన్ కు ప్లస్ పాయింట్. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు రాయన్ ను వీక్షించి ధనుష్ మరియు టీమ్ మొత్తానికి విషెస్ తెలిపారు.