Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

ఘోర రోడ్డు ప్రమాదం.. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. లాస్య నందిత వయసు 33. బీఆర్‌ఎస్‌ యువ ఎమ్మెల్యే మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. 2023 ఫిబ్రవరిలో సాయన్న మరణించడంతో.. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. నందితపై మాజీ సీఎం కేసీఆర్ నమ్మకం ఉంచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి సాయన్న వెంటే ఉంటూ.. నియోజకవర్గంలో మంచి పట్టు పెంచుకున్నారు. అయితే రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య నందిత.. ఇలా చిన్న వయసులో దుర్మరణం కావడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. సీఎం రేవంత్, నాయకుల దిగ్భ్రాంతి
ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్‌ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్యనందిత మృతి బాధకలిగించిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపారు. ఇక, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం.. లాస్య నందిత అతిపిన్న వయసులో ప్రజామన్ననలు పొంది ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం.. లాస్య నందిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే, ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్ర్భాంతి.. లాస్య మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్.. లాస్య అకాల మరణం బాధాకరం.. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ..
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. నేటి ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.15 గంటలకు ఒంగోలు అగ్రహారం దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. పది నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు.. ఆ తర్వాత అక్కడ నుంచి అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న ఇంటి స్థలాల లేఔట్ పైలాన్ దగ్గరకు చేరుకుంటారు.. ఇక, ఉదయం 10. 40 గంటలకు సభావేదికకు చేరుకుంటారు.. 10.45 గంటలకు ఒంగోలు ఇక, ఆ తరువాత 11.05 గంటలకు సభా వేదికపైకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకుంటారు.. 11.25 గంటల నుంచి 11.35 గంటల వరకు లబ్ధిదారులతో సమావేశం కానున్నారు. 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు గంట పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.40 గంటలకు వేదిక వద్ద నుంచి బయల్దేరి 12.45 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. గంట పాటు స్థానిక నేతలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అలాగే, మధ్యాహ్నం 1. 50 గంటలకు హెలి కాప్టర్లో బయల్దేరి మ. 2.25 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు అంగప్రదక్షిణం టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు, శ్రీవారి సేవ కోటా టోకెన్లు రిలీజ్ చేస్తారు. తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. అలాగే, మే నెల‌కు సంబంధించిన మరోవైపు రేపు ( ఫిబ్రవరి 24న) ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌పైనా క్లారిటీ కూడా ఇచ్చారు. తిరుమల, తిరుపతిల‌లో మే నెల గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నారు.

వారణాసిలో ప్రధాని రోడ్ షో.. సీఎం యోగితో శివపూర్-లహర్తర రహదారి పరిశీలన
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్నారు. గుజరాత్‌లో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోడీ వారణాసికి చేరుకున్న సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. రాత్రి 11 గంటలకు శివపూర్-ఫుల్వారియా-లహర్తర రహదారిని పరిశీలించేందుకు ప్రధాని మోడీ వెళ్లారు. ఇది ఇటీవలే ప్రారంభించబడింది. విమానాశ్రయం, లక్నో, అజంగఢ్, ఘాజీపూర్ వైపు వెళ్లాలనుకునే BHU, BLW మొదలైన దక్షిణ భాగంలో నివసిస్తున్న సుమారు 5 లక్షల మంది ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 360 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే BHU నుండి విమానాశ్రయానికి ప్రయాణ దూరం 75 నిమిషాల నుండి 45 నిమిషాలకు తగ్గుతోంది. అదేవిధంగా లహర్తర నుంచి కచారి చేరుకునే సమయాన్ని కూడా 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించారు. వారణాసి పౌరులకు జీవితాన్ని సులభతరం చేయడానికి రైల్వేలు, రక్షణతో సహా ఈ ప్రాజెక్ట్ అంతర్-మంత్రిత్వ సమన్వయాన్ని చూసింది. ప్రధాని మోడీ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని స్వతంత్ర భవన్‌లో ఎంపీ నాలెడ్జ్ పోటీ, ఎంపీ ఫొటోగ్రఫీ పోటీలు, ఎంపీ సంస్కృతం పోటీల్లో పాల్గొనే వారితో ప్రధాని సంభాషిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు ప్రముఖులను కూడా ప్రధాని సత్కరిస్తారు.

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత!
మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. ఆయన వయసు 86. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. మానోహర్ జోషికి వృద్యాప్య సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. మనోహర్ జోషి మరణ వార్తను పీడీ హిందూజా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాయ్ చక్రవర్తి ధృవీకరించారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2023 మేలో మెదడులో రక్తస్రావం కారణంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి హాస్పిటల్‌లో చేరారు. అప్పటినుంచే ఆయన ఆరోగ్యం సరిగా లేదు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో పీడీ హిందుజా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు.

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో చౌక ధరలో ఎరువులు
ప్రస్తుతం దేశంలో ఒకవైపు రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీకి రావడానికి మొండిగా ఉన్నారు. మరోవైపు, పంజాబ్-హర్యానా సరిహద్దులో ప్రభుత్వం వారిని నిలువరించింది. వారితో మాట్లాడటానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో రైతులకు ఎంతో ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో పొటాష్ ధరలు చౌకగా మారే అవకాశం ఉంది. వాస్తవానికి చక్కెర కర్మాగారాలు ఎరువుల కంపెనీలకు విక్రయించే ‘పొటాష్ డెరైవ్డ్ ఫ్రమ్ మొలాసిస్’ (పీడీఎం) ధరను ప్రస్తుత ఏడాదికి టన్నుకు రూ.4,263గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరను చక్కెర కర్మాగారం, ఎరువుల కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది.

బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తుది జట్లు ఇవే!
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచిలో నాలుగో టెస్టు ఆరంభం కానుంది. జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆరంభం కానున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్‌ వుడ్‌ స్థానంలో ఓలీ రాబిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ తుది జట్టులోకి తీసుకుంది. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాశ్‌ దీప్‌ అరంగేట్రం చేశాడు.

రెడ్ శారీలో ఘాటు మిర్చీలా అరియనా.. మైండ్ బ్లాక్ చేస్తున్న పిక్స్..
బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా రెడ్ శారీలో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సోషల్ మీడియాలో అరియనా మంటలు పుట్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. అవి ఎంతగా దుమారం రేపుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అరియనా గ్లోరీ గ్లామరస్ షో హద్దులు దాటేస్తుంది. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది.. తాజాగా రెచ్చిపోయింది.. ఎర్రని చీరలో మెరిసింది.. చీరకట్టులో సంప్రదాయంగా కనిపించింది. కానీ మత్తెక్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది. కొంగును చేతికి చుట్టుకొని ఇచ్చిన కొంటె ఫోజుతో కుర్ర గుండెల్ని పిండేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. బుల్లితెర సందడి చేస్తూ వస్తుంది.. బుల్లితెరపై వరుసగా ఏదోక షోతో మాత్రం అరియానా అల్లరి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన పోస్టులతో ఆకట్టుకుంటోంది..

Exit mobile version