NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తెగిపోయిన తుంగభద్ర డ్యాం గేటు.. పోటెత్తిన వరద నీరు..
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యాం 19వ గేటు ఊడిపోవడంతో భారీగా నీరు బయటికి వెళ్లిపోతుంది. డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం (ఆగస్టు10) అర్ధరాత్రి 11 గంటల సమయంలో డ్యామ్‌ గేట్లు మూసేందుకు అధికారులు ట్రై చేశారు. చీకటి కావడంతో గేటు కొట్టుకుపోయిందా లేక అక్కడే పడిపోయిందా తెలుసుకోలేకపోయిన అధికారులు.. చైన్ లింక్ తెగిపోవడంతో పాటు గేటు కనిపించకపోవడాన్ని దృవీకరించారు. దీంతో తుంగభద్ర డ్యామ్ నుంచి ప్రస్తుత ఔట్ ఫ్లో 75 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్‌ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి శివరాజ్‌ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్ల నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి లక్ష వేల క్యూసెక్కుల నీరు బయటికి వెళ్లిపోతుంది. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..
నార్సింగ్ మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్ కార్ అత్యంత వేగంగా ప్రయాణించి టిప్పర్ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో థార్ లో ప్రయాణిస్తున్న ముగ్గరు ఇంజనీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుండి నార్సింగ్ మై హోమ్ అవతార్ వద్ద టిప్పర్ (TS 31 TA 6776) లారీ డ్రైవర్ సతీష్ వెళుతున్నాడు. అయితే అదే రూట్ లో థార్ కారు (TS 09 EQ 1512) ముగ్గురు ఇంజనీర్లు సిరి, గౌతమ్, సుదీప్ ప్రయాణిస్తున్నారు. థార్ ఓవర్ స్పీడ్ తో అక్కడే వున్న లారీని బలంగా ఢీకొట్టింది. లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటన తెల్లవారుజాము 4:30 గంటలకు జరిగింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. కారులో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డ వారిని పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించారా లేదా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మై హోమ్ అవుతార్ జంక్షన్ వద్ద సిగ్నల్స్ లేవని అందుకే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు నిర్లక్ష్యం వలన రాష్ డ్రైవింగ్ తోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి మై హోమ్ అవుతార్ జంక్షన్ వద్ద సిగ్నల్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒక వేళ మై హోమ్ అవుతార్ జంక్షన్ వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు ఇంకా చోటుచేసుకుంటాయని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు, పోలీసులు, ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అభిశంసన తీర్మానానికి విపక్షాల సన్నాహాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇంతవరకు ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 50 మంది రాజ్యసభ ఛైర్మన్‌ను తొలగించే ప్రతిపాదనపై 87 మంది ఇండియా బ్లాక్ ఎంపీలు సంతకం చేశారు. అయితే ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనను సమర్పించే ముందు చర్చల ద్వారా మధ్యేమార్గాన్ని కనుగొని పరస్పర విభేదాలను పరిష్కరించుకోవాలి. ఈ వ్యూహంతో ముందుకు సాగాలని విపక్షాలు సంకల్పించాయి. అంకెల ఆటలో వెనుకబడ్డామని ప్రతిపక్షాలు గ్రహించినా చరిత్రలో చీకటి అధ్యాయం నమోదవడమే పెద్ద విషయం. రాజ్యసభ ఛైర్మన్‌ను భారత ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగిస్తే మాత్రమే అతడు పదవీచ్యుతుడు అవుతాడు. ఛైర్మన్‌ను తొలగించే ప్రతిపాదనను రాజ్యసభలో మాత్రమే సమర్పించవచ్చు. అంతేకాకుండా.. దీని కోసం 14 రోజుల ముందస్తు నోటీసు కూడా ఇవ్వాలి.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అదానీపై సంచలన ఆరోపణలు..
అదానీ కేసులో సెబీ చీఫ్‌పై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్‌కు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తెలిపింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టబడిన ఆఫ్‌షోర్ ఫండ్‌లో బుచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని పత్రాలను ఉటంకిస్తూ హిండెన్‌బర్గ్ తెలిపింది. ‘నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గుర్తించాం. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. విజిల్‌బ్లోయర్‌ పత్రాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయి. ఇందులో మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయి’ అని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో హింస తర్వాత.. ఇప్పుడు మరో సంక్షోభం.. ప్రజల ఆరాటం దేనికంటే?
బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు.. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వం దేశం మొత్తం సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈలోగా బంగ్లాదేశ్ ప్రజలు మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. హింస తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రతి పైసా కోసం ఆరాటపడుతున్నారు. బంగ్లాదేశ్‌లోని చాలా బ్యాంకుల ఏటీఎంలు ఇప్పటికీ మూసి ఉన్నాయి. భద్రతా కారణాల వల్ల చాలా ఏటీఎంలకు డబ్బు డెలివరీ కావడం లేదు. ఇది కాకుండా ఇంకా చాలా బ్యాంకు శాఖలు తెరవలేదని నివేదిక పేర్కొంది. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు నగదు విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. జూలై నుంచి బంగ్లాదేశ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదట కోటా సంస్కరణ ఉద్యమం, తరువాత వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం, పోలీసు చర్యల కారణంగా మొత్తం నాలుగు వందల మందికి పైగా మరణించారు. పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగినట్లు సమాచారం. పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడినప్పటికీ చాలా మంది ఇప్పటికీ సురక్షితంగా లేరని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ఢాకాలోని కారవాన్ బజార్ ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో వివిధ ఏటీఎంలు మూతపడ్డాయి. దీంతో వ్యాపారులు నగదు విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్‌!
గత 19 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను అలరిస్తున్న పారిస్‌ ఒలింపిక్స్‌ నేడు ముగియనున్నాయి. జులై 26న అధికారికంగా క్రీడలు ఆరంభమవ్వగా.. ఆగష్టు 11తో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 12.30 గంటలకు క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముగింపు వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్‌ మను బాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్‌ వ్యవహరించనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 చివరి రోజు అథ్లెటిక్స్‌ (మహిళల మారథాన్‌), బాస్కెట్‌బాల్, సైక్లింగ్‌ ట్రాక్, హ్యాండ్‌ బాల్, మోడర్న్‌ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్‌ పోలో, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో పోటీలు ఉన్నాయి. బాస్కెట్‌బాల్‌ అమ్మాయిల ఫైనల్‌తో విశ్వ క్రీడల పోటీలు ముగుస్తాయి. ఇక శనివారంతోనే భారత ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. భారత్ మొత్తం 6 పతకాలు గెలుచుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముగింపు కార్యక్రమం స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత పాప్‌ గాయని, రచయిత హెచ్‌ఈఆర్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నృత్యకారులు, సంగీత కళాకారులు తదితరులు తమ ప్రదర్శనలతో అలరించన్నారు.

Show comments