NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

నేడు విశాఖ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ..
ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, అభ్యర్థి ఖరారు, ఎన్నికల్లో గెలుపుపై విశాఖ పట్నాంకు చెందిన నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కార్పోరేటర్లను తమ వైపుకు ఎన్డీయే కూటమి పార్టీలు తిప్పుకుంది. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. జనసేన పార్టీతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఢీ కొనాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే అంశాన్ని టీడీపీ అస్త్రంగా తీసుకోనుంది. స్థానిక సంస్థల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా సర్పంచులు, ఎంపీటీసీలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోరనుంది.

నేడు నంద్యాల జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించేందుకు వెళ్తున్నారు. నేటి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి బయలుదేరి 10. 15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురం వెళ్లి.. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని.. బెంగళూరుకు వెళ్లనున్నారు. అయితే, వైఎస్ జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు లేదు. అయితే, మూడు నాలుగు రోజుల పాటు అక్కడే బస చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పదే పదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు బెంగళూరు వెళ్లి వచ్చారు.

నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడిజైన్ సెంటర్‌కి వెళతారు. యూనివర్సిటీలోని సస్టైనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో వివిధ అంశాలపై చర్చిస్తారు. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తగిన అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. గూగుల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సమావేశం కానుంది. ఆ తర్వాత Z స్కాలర్ జై చౌదరిని, కంపెనీ వ్యవస్థాపకుడు మరియు CEO కలుస్తారు. ఎనోవిక్స్, ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రొఫెసర్ సాల్మన్ స్మార్ట్ విలేజ్ మూమెంట్స్‌లో డార్విన్‌ను కలుసుకున్నాడు. అనంతరం ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.

నేడు వైరాలో భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నేడు ఖమ్మం జిల్లాలోని వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు వైరాలో అమృత్ 2.0 పథకం పనులతో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12-30 గంటలకు భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఆలయం వద్ద స్నానఘట్టాలు, చెక్‌డ్యామ్‌, ప్రహరీ గోడ నిర్మాణ పనులు, అనంతరం వైరా రిజర్వాయర్, ప్రహరీ గోడ ఆధునిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులపై ప్రజలతో మాట్లాడి ఆరా తీయనున్నట్లు సమాచారం. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ బీట్ ప్రాంతంలో వన మహోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటలకు మొక్కలు నాటారు. అనంతరం అశోక్‌నగర్‌లో డ్రైనేజీలు, పాల్వంచలో సింథటిక్ టెన్నిస్ కోర్టు, కలెక్టరేట్‌లో ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 15న పోలీసు కవాతు మై దానంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల వివరాలతో సిద్ధం చేయాలని సూచించారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకి మోడీ అభినందనలు..
అనేక రోజుల రాజకీయ గందరగోళం తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహమ్మద్ యూనస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా పౌరులందరికీ భద్రత కల్పించాలని కోరారు. ప్రధాని మోదీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాశారు, ‘కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌కు నా శుభాకాంక్షలు. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు భరోసానిస్తూ.. సాధారణ స్థితికి త్వరగా తిరిగి రావాలని మేము ఎదురుచూస్తున్నాము. శాంతి, భద్రత, అభివృద్ధి కోసం ఇరు దేశాల ప్రజల భాగస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చడానికి బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది.” అని రాసుకొచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ముహమ్మద్ యూనస్‌ను అభినందించారు. దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించడం ఈ సమయంలో అవసరమని అన్నారు. “బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్‌ ముహమ్మద్‌ యూనస్‌కు అభినందనలు. త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం అవసరం” అంటూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో రాహుల్‌ ఫొటో పోస్ట్‌ చేశారు.

లోక్‌సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ!..వీడియో వైరల్..బీజేపీ నేతల ట్రోల్స్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకుడిని గిరిరాజ్ సింగ్ ఎలా ఎగతాళి చేశాడో చూపించిన వీడియోను బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే వైరల్ అవుతున్న వీడియో అప్పటిదా కాదా అనేది తెలియదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చాలా మంది రైట్ వింగ్ మద్దతుదారులు.. బీజేపీ నాయకులు చర్చ నడుస్తున్న టైమ్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిద్రపోయారని పేర్కొంటూ ఆయన చిత్రాన్ని పోస్ట్ చేశారు.

గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డే: నీరజ్‌ చోప్రా తల్లి
పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరాడు. భారత స్టార్ జావెలిన్‌ త్రో ప్లేయర్ నీరజ్‌ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు. నీరజ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. నీరజ్‌ కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని పండగ చేసుకున్నారు. నీరజ్‌ తల్లి సరోజ్‌ దేవి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు. బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కూడా తన కుమారుడి లాంటివాడే అని నీరజ్‌ చోప్రా తల్లి సరోజ్‌ దేవి పేర్కొన్నారు. ‘నా కుమారుడు నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గోల్డ్‌ మెడల్‌ కంటే కూడా ఎంతో విలువైంది. నీరజ్‌ ప్రదర్శనపట్ల గర్వంగా ఉంది. ఇంటికి వచ్చాక అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా’ అని సరోజ్‌ దేవి చెప్పుకొచ్చారు.

అదే జరిగితే ఆగస్టు 15 రిలీజ్ కష్టమే.. అసలేం జరిగిదంటే..?
ఆగస్టు 15న 5 సినిమాలు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ – రవితేజ ల మిస్టర్ బచ్చన్, నార్నె నితిన్ ఆయ్, మరొక డబ్బింగ్ సినిమా తంగలాన్, మరో చిన్న సినిమా 35. ఇప్పటికే హాన్ని హంగులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అటు ప్రమోషన్స్ ఎవరికీ వారు సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే. రెండు వైపు వ్యవహారం ఇంకోలా జరుగుతోంది. ముక్యంగా రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ కు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ సినిమా నష్టాలకు సంబంధించి పంచాయితీ తేల్చేందుకు సిటింగ్స్ మీద సిట్టింగ్స్ వేస్తున్నారు, కానీ సమస్యకు పరిష్కారం రాలేదు. లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తనకు రావాల్సిన నష్ట పరిహారం విషయాన్ని తేల్చి అప్పుడు రిలీజ్ చేసుకోమని మొండి పట్టు పట్టాడు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ కనుక తమ సమస్య విషయం సీరియస్ గా తీసుకోకుండా డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయాలని చుస్తే మాత్రం ఊరుకునేది లేదు, అవసరమైతే ఈ నెల 15 నుంచి థియేటర్లు బంద్ చేయాలనీ, ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని నైఙాం ఎగ్ఙిబిటర్ల ఆలోచన చేస్తున్నారు. అటు ఆంధ్రలో మాత్రం ఈ సినిమాకు అన్ని రూట్లు క్లియర్ అయ్యాయి. నైజాం విషయం త్వరగా తేల్చాలని లేదని డే 1 కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని రామ్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

Show comments