Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు
దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్‌ 3న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టైన్‌ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును గురువారం వెల్లడించనుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం..

నేడు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌.. ఆంక్షలు, కండిషన్లతో ఉత్కంఠ..
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కాసేపట్లో ప్రారంభంకానుంది. జనసమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగనుంది. తాడేపల్లిలోని నివాసం నుంచి నెల్లూరు చేరుకుంటారు జగన్‌. సెంట్రల్ జైల్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శిస్తారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్‌. కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. జగన్ పర్యటన వేళ.. నెల్లూరు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున జగన్ పర్యటనకు జనసమీకరణ చేయొద్దని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనాలు తరలిరాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించవద్దని.. 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టంచేశారు. ఇక, నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్‌ దగ్గర హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిపాడ్‌ దగ్గర 15 వాహనాలు, 10మందికే అనుమతి ఇచ్చారు. జైల్లోకి జగన్‌తోపాటు మరో ముగ్గురికి అకాశం కల్పించారు. ఇటు.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ దామోదర్‌. అడుగడుగునా డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. వైసీపీ నేతలు, కార్యకర్తల కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులతోపాటు వారి వివరాలు కూడా ఇవ్వాలన్నారు పోలీసులు. అయితే.. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి చర్యలు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తలకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). టికెట్‌ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది. ఈ ప్రయోగం రేపటి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది. ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెల టిక్కెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులను నవంబర్ నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో తిరుమలలో 800 టిక్కెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టులో 200 టిక్కెట్లు జారీ చేయనుంది టీటీడీ. ఇకపై ఏ రోజుకు ఆ రోజు దర్శన టిక్కెట్లు జారీ చేయనున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉదయం 7 గంటల నుండి, తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు ఇస్తారు.

మాలేగావ్ పేలుళ్ల కేసులో నేడే తీర్పు.. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు శిక్షా..విముక్తి?
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈరోజు (జూలై 31న) తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుతో నిందితుల భవిష్యత్తు నిర్ణయించబడనుంది. అయితే, దాదాపు 17 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసు విచారణ.. అనేక చట్టపరమైన మలుపులు, సుదీర్ఘ విచారణకు ముగింపు పలికింది. అయితే, ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి లాంటి మరో ఐదుగురు నిందితులు విచారణను ఎదుర్కొన్నారు. అయితే, 2008 సెప్టెంబర్ 29వ తేదీన మాలేగావ్‌లోని భికు చౌక్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన IED బాంబు కారణంగా ఈ పేలుడు సంభవించింది. తొలుత మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) విచారణ చేసిన తరువాత 2011లో కేసు ఎన్ఐఏకి అప్పగించింది.

పాక్‌తో అమెరికా వాణిజ్య డీల్.. భారత్‌కు చమురు విక్రయించొచ్చన్న ట్రంప్
పాకిస్థాన్‌తో అమెరికాకు వాణిజ్య డీల్ కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్ చమురు కూడా విక్రయించొచ్చని తెలిపారు. ఇక భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. భారత్ మంచి స్నేహితుడు అని చెబుతూనే ట్రంప్ సుంకం విధించారు. పాకిస్థాన్‌తో జరిగిన ట్రేడ్‌ డీల్స్‌ గురించి ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇక భవిష్యత్తులో భారత్‌కు పాక్‌ చమురు విక్రయించొచ్చు అని పేర్కొన్నారు. అమెరికాతో భారత్ ఐదు రౌండ్ల వాణిజ్య చర్చలు జరిపింది. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంకోవైపు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తు్న్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనంగా పెనాల్టీలు కూడా ఉంటాయని హెచ్చరించారు.

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. రేపటి నుంచే కొత్త రూల్స్!
రేపటి నుంచి ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతుంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, ఈసారి కేంద్ర ప్రభుత్వం యూపీఐ సేవల విషయంలో కూడా అనేక మార్పులు చేసింది. ఆగస్టు నెల నుంచి ఏ నియమాలు మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తేదీ నుంచి UPIకి సంబంధించి అనేక కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. మీరు PhonePe, G Pay, Paytm లను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, మెరుగైన చెల్లింపు సౌకర్యాలను అందించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక నియమాలను మార్చింది. ఇందులో భాగంగా NPCI కొన్ని కొత్త పరిమితులను సైతం విధించింది. ఇది మీ చెల్లింపులను ప్రభావితం చేయదు.. కానీ, బ్యాలెన్స్ చెక్, స్టేటస్ రిఫ్రెష్, ఇతర విషయాలపై ఆంక్షలను విధిస్తుంది. అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి UPI యాప్ నుంచి ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే తనిఖీ చేయగలరు. నెట్‌ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల లాంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు కేవలం 3 టైమ్ స్లాట్‌లలో ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు.. అలాగే, రాత్రి 9.30 తర్వాత.. మీరు ఒక రోజులో 3 సార్లు మాత్రమే విఫలమైన లావాదేవీల స్థితిని తనిఖీ చేసే వీలుంటుంది. ప్రతి చెకింగ్ కు మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.

ఓజీ మొదటి పాటకు కౌంట్‌డౌన్ షురూ.. డేట్ ఇదేనా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓజి’. ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజీత్ మెగాఫోన్ పట్టగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని అంటించేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి పాట విడుదలపై ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, ‘ఓజి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల కానుంది. ఆగస్ట్ 3 లేదా 5 తేదీల్లో ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌తో పాటుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం భారీ ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు. ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోండగా, పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నా, ‘ఓజి’ కోసం చేసిన కమ్‌బ్యాక్ హంగామా ప్రేక్షకుల్లో పజిటివ్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో థమన్ సంగీత బాణీలు మరోసారి మ్యాజిక్ చేస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

కింగ్డమ్ ఓవర్శీస్ రివ్యూ..
విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం నేడు ప్రిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.. సూరిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ బాగుంది. పాత్రలను పరిచయం సన్నివేశాలు చక్కగా డీల్ చేసి, ఆపై ఎటువంటి ల్యాగ్ లేకుండా కథలోకి వెళ్లాడు దర్శకుడు. కానీ ఇక్కడ కథలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ అది చాలా వరకు పాజిబుల్ గానే ఉంటుంది. జైల్ సీక్వెన్స్ లో సూరీ గా విజయ్ అదరగొట్టాడు. శ్రీలంక అడవి, జాఫ్నా జైళ్ల నేపథ్యం సూపర్ గా ఉంది. ఫస్టాప్ ను డీసెంట్ గానే డీల్ చేసి సెకండాఫ్ కు సెటప్ పర్ఫెక్ట్ గా సెట్ చేసాడు. ఇక సెకండాఫ్ ప్రారంభం సూపర్ గా స్టార్ట్ అవగా కొద్దిసేపటికి కథ గాడీ తప్పుతుంది. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదరగొట్టాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కధనం కాస్త నెమ్మదిగా అక్కడక్కడ కాస్త బోరింగ్ గా సాగుతుంది ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా పుంజుకుంటుంది.

నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఆఖరి టెస్టు.. సమమా.. సమర్పణమా!
ఇంగ్లండ్‌- భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ చివరి దశకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాళ్టి నుంచి ఓవల్‌ స్టేడియంలో ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2–1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2–2తో సిరీస్‌ సమం అవుతుంది.. మ్యాచ్‌ గెలిచినా లేక ‘డ్రా’ అయినా ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ సిరీస్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంటుంది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌ లేకపోవడంతో పాటు పలు మార్పులతో భారత్‌ రెడీ కాగా, ఇక, బెన్ స్టోక్స్‌ దూరం కావడంతో పాటు నాలుగు మార్పులతో ఇంగ్లండ్‌ రంగంలోకి దిగుతుంది. 2007లో ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ గెలిచిన తర్వాత ఆడిన నాలుగు సిరీస్‌లనూ భారత్‌ ఓడిపోయింది. ఓవల్‌లో గెలిస్తే సమంగా నిలిచి సగర్వంగా స్వదేశానికి టీమిండియా చేరవచ్చు. అయితే, ఈ సిరీస్‌కు ముందు అనుకున్నట్లుగానే బుమ్రా మూడు టెస్టులే ఆడాడు. అతని స్థానంలో మరో పేసర్‌ ఆకాశ్‌దీప్‌ ఆడటం ఫిక్స్ అయింది. గత టెస్టులో పూర్తిగా విఫలమైన అన్షుల్‌ కంబోజ్‌ను కూడా జట్టు నుంచి తప్పించి ప్రసిధ్‌ కృష్ణను తుది టీమ్‌లోకి తీసుకోనున్నారు. వీరితో పాటు సిరాజ్‌ పేస్‌ బౌలింగ్‌ను ముందుండి నడిపించనున్నారు. ఓవల్‌ పిచ్, వాతావరణాన్ని బట్టి చూస్తే స్పిన్నర్‌ల కంటే పేసర్‌లకే ఎక్కువగా సహకరిస్తుంది. పైగా ముందే చెప్పినట్లు టీమిండియా స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కంటే బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాడికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది.

Exit mobile version