మొంథాపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..
మొంథా తుఫాన్ తెలంగాణ మీద భారీ ప్రభావం చూపించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లోనూ భారీ వానలు పడుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్ ప్రభావంపై నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అందులో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉంది.. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వచ్చాయనేది తెలుసుకుంటారు. సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు కీలక ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. వాగులు, వంకల ఉధృతితో పాటు పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై కూడా సమీక్ష జరపనున్నారు. వరిపంట నష్టం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై కూడా ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రెండు రోజుల దాకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వాటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. తెగిపోయిన బ్రిడ్జిలు, విరగిన స్తంభాలు, ధ్వంసమైన రోడ్లపై కూడా ఆరా తీయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీటి రిపేర్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి.
వరంగల్ ను ముంచేసిన మొంథా.. నగరమంతా నీళ్లలోనే
మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాను ముంచేసింది. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ముంపు ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగాయి. శాఖ రాసి కుంట, శివనగర్, బి ఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి దాకా భారీ వర్షాలు కురిసేసరికి చాలా కాలనీలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల స్తంభాలు విరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి. చెట్లు నేలకూలాయి. అర్ధరాత్రి వరకు వర్షం ఆగిపోయినా జరగాల్సిన నష్టం భారీగానే జరిగింది. ఎటు చూసినా రోడ్ల మీద వర్షం నీళ్లే కనిపిస్తున్నాయి. నాలాలు ఉప్పొంగుతున్నాయి. ప్రజలంతా వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.
నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్..
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాల్లో ఈరోజు (అక్టోబర్ 30న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. వరద ప్రాంతాలను పరిశీలించి, బాధితులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
మొంథా తుఫాను నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 30న) తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం లాంటి వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే, బాధితులకు కూటమి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకు రావడంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, మొన్న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న జగన్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేసిన పార్టీ నేతలు, కేడర్.
శాంతియుత అణుశక్తికి భారత్ అండగా నిలుస్తుంది..
శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఐఏఈఏ నివేదికపై మన దేశ ప్రతినిధిగా రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారత్ తరపున జాతీయ ప్రకటనను ఆమె వినిపించారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారతదేశం తరపున మద్దతును ప్రకటించారు. అయితే, అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు లాంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైనదని అన్నారు.
ఊపందుకున్న బీహార్ ఎన్నికల ప్రచారం.. నేడు పలుచోట్ల మోడీ ర్యాలీలు
బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు వారం రోజుల సమయమే మిగిలి ఉంది. ఇక దీపావళి, ఛత్ పండుగలు ముగియడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ, అమిత్ షా, కేంద్రమంత్రులు జోరుగా ప్రచారం చేస్తుండగా.. గురువారం ప్రధాని మోడీ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించనున్నారు. గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నా రాష్ట్ర సోదరులు, సోదరీమణులు గొప్ప విజయ శంఖం మోగిస్తారని నాకు నమ్మకం ఉంది.’’ అంటూ ప్రధాని రాసుకొచ్చారు. ఎన్డీఏ కూటమి సమగ్ర విజయాన్ని నమోదు చేస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముజఫర్‌పూర్‌లో.. మధ్యాహ్నం 12:45 గంటలకు చాప్రాలో మోడీ ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. ఆయుధాలతో లొంగిపోయిన 21 మంది మావోలు
దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామంటూ కేంద్ర నిర్ణయం సత్‌ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కాంకేర్ జిల్లాలో 13 మంది మహిళలు సహా 21 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. నక్సలిజం వెన్నెముక విరిగిపోయిందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అన్నారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. యువత మావోయిజాన్ని వదిలిపెట్టి.. అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్ ఇన్‌స్పెక్టర్ పి.సుందర్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 26న 21 మంది మావోయిస్టులు.. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసి పోయారని తెలిపారు. లొంగిపోయిన వారి కోసం పునరావాసం కలిస్తామని.. అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని చెప్పారు.
నేడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ.. 6 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!
దక్షిణ కొరియా వేదికగా గురువారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ట్రంప్-జిన్‌పింగ్ కలవనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. జిన్‌పింగ్‌ను ముఖాముఖిగా కలవడం ఇదే తొలిసారి. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇద్దరూ సమావేశం అవుతున్నారు. సుంకాలు కారణంగా అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల చైనాపై భారీగా ట్రంప్ సుంకాలు విధించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇద్దరు నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగవచ్చని తెలుస్తోంది.
నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు – చెన్నైలో పోలీసుల హడావిడి!
చెన్నైలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ప్రభు నివాసం సహా అమెరికా రాయబారి కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో త్వరలోనే బాంబు పేలుతుందని, ఆ తరువాత నటుడు ప్రభు ఇంట్లో కూడా బాంబు పేలుతుందని పేర్కొన్నారని అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో కలిసి అన్ని ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా కాన్సులేట్‌లో పనిచేస్తున్న మరికొందరు అధికారుల ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు మెయిళ్లు వచ్చినట్టు సమాచారం. అన్ని ప్రదేశాల్లోనూ బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.
SS రాజమౌళి ‘బాహుబలి’ ఎపిక్ రివ్యూ..
బాహుబలి, భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. కానీ ఇది పాత సినిమాలా కాదు ఒక కొత్త సినిమాలా, అన్నీ రీ డిజైన్ చేసి ఎక్స్ పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్‌ని మన కళ్లముందుకి తీస్కోస్తున్నాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో ఫైర్ క్రియేట్ చేస్తోంది. బాహుబలి ఎపిక్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తూ దూసుకెళ్తోంది. తెలుగు స్టేట్స్ కంటే ఒకరోజు ముందు ఓవర్సీస్ లో రిలీజ్ అయింది బాహుబలి. మరి ఎపిక్ రివ్యూ ఎలా ఉందొ చూద్దామా.. ఎపిక్ టైటిల్ కార్డ్ తోనే మనం రొటీన్ రెగ్యులర్ రీరిలీజ్ చేయడం లేదని అర్ధం అవుతుంది. అక్కడి నుండి మిమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వదు. క్రిస్పీ ఎడిటింగ్ తో సినిమాను జెట్ స్పీడ్ లో పరిగెత్తించాడు జక్కన్న. పదేళ్ల తర్వాత కూడా అదే సౌండ్ అంతే అద్భుతమైన క్వాలిటీ. ముఖ్యంగా మహేంద్ర బాహుబలి మొదటిసారి మాహిష్మతిలోనికి ప్రవేశించినప్పుడు మరియు భల్లాలదేవుడి గ్రాండ్ ఎంట్రీ, ఇద్దరి మధ్య ఫైట్ సమయంలో వచ్చే సీన్స్, మ్యూజిక్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. అనుష్క ఎంట్రీ సీన్ కు సూపర్బ్. ఇక కట్టప్ప బాహుబలిని పొడవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
టైటాన్స్ ఆటకు తెర.. క్వాలిఫయర్-2లో అక్కడే వెనకపడిపోయింది!
ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ అద్భుత ఆటకు తెరపడింది. బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో పోరాడి ఓడింది. పుణెరి పల్టాన్ చేతిలో 50-45తో టైటాన్స్ ఓడిపోయింది. ఈ ఓటమితో టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. విజయం సాధించిన పల్టాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక టైటిల్ పోరు కోసం శుక్రవారం దబంగ్ ఢిల్లీని పల్టాన్ ఢీకొంటుంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన తెలుగు టైటాన్స్ పీకేఎల్ 2025లో మాత్రం అద్భుతంగా ఆడింది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. మంచి ప్రదర్శనతో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. అయితే క్వాలిఫయర్-2లో ఒత్తిడి చిత్తయింది. మ్యాచ్ ఆరంభంలో పుణెరి పల్టాన్ దూకుడుగా ఆడింది. దాంతో టైటాన్స్ 1-10తో వెనుకబడింది. మ్యాచ్ ఏకపక్షం అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ టైటాన్స్ పుంజుకుని రేసులోకి వచ్చింది. భరత్ హుడా రాణించడంతో బ్రేక్ సమయానికి 24-20తో ఆధిక్యంను తగ్గించింది.
నేడు టీమిండియాకు కఠిన సవాల్.. కంగారూలను దాటితే కప్పే!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన భారత్.. సెమీస్‌లో విజయం సాధించాలంటే మాత్రం అత్యుత్తమంగా ఆడాల్సిందే. నేడు టీమిండియాకు కఠిన సవాల్ అనే చెప్పాలి. ఆసీస్ గండం దాటితే కప్ కొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓపెనర్ ప్రతీక రావల్ గాయంతో టోర్నీకి దూరం కావడం టీమిండియాకు ప్రతికూలతే. అయితే డాషింగ్ ఓపెనర్ షెఫాలి వర్మ జట్టులోకి రావడం సంతోషించాల్సిన విషయం. షెఫాలి మంచి ఆరంభాన్ని ఇస్తే భారీ స్కోర్ చేయొచ్చు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాడిన పడాల్సి ఉంది. కీలక సెమీస్‌లో హర్మన్ చెలరేగుతుందని జట్టు ఆశిస్తోంది. రేణుక సింగ్, అమన్‌జ్యోత్, క్రాంతి గౌడ్‌లతో పేస్ విభాగమూ పటిష్టంగా ఉంది. దీప్తి శర్మ, శ్రీ చరణితో పాటు రాధ యాదవ్ స్పిన్ తిప్పితే తిరుగుండదు. స్పిన్‌కు సహకరించే డీవై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఈ ముగ్గరు కట్టడి చేస్తే విజయానికి చేరువకావొచ్చు.
