గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని చెప్పారు.. అయితే, గవర్నర్‌ను విమర్శించొద్దనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాసనానికి తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. దీంతో, రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య సయోధ్య కుదిరందననే చెప్పాలి.. హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత.. అడ్వొకేట్ జనరల్ చాంబర్‌లో గవర్నర్ తరపు లాయర్ అశోక్ రాంపాల్.. ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే.. అడ్డొకేట్ జనరల్ దాదాపు గంట పాటు సమావేశమై అనేక అంశాలపై చర్చించారు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి ప్రభుత్వంపై వచ్చే విమర్శలు.. అధికార పక్షం నుంచి గవర్నర్‌ను టార్గెట్ చేస్తూ చేసే విమర్శలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ఈ వాతావరణం ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారు.. ఈ చర్చలు సఫలం అయ్యాయి.. అయితే, తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దుష్యంత్ దవే.. ఇదే సమయంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.. గవర్నర్ తరపు లాయర్ తో మాకు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు.. దీంతో.. ఈ కథ సుఖాంతం అయినట్టు అయ్యింది..
అవన్నీ రూమర్స్.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ ప్రకటన
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ప్రకటన చేశారు నందమూరి రామకృష్ణ.. బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన ఆయన.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగు పడింది.. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి.. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు.. అయితే, సీటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని తెలిపారు.. మధ్యాహ్నం 1.30 గంటలకు సీటీ స్కాన్ చేశారు.. రిపోర్ట్ వచ్చాక ఏంటి? అనే పరిస్థితి తెలుస్తుందన్నారు.. తారకరత్న స్వయంగా ఆక్సిజన్ కొంత వరకు తీసుకుంటున్నారని తెలిపారు. న్యూరాలజీ సంబంధించి కొంత రికవరీ కావడానికి టైం పడుతుందన్నారు రామకృష్ణ.. అయితే, ఎక్మో విషయంపై మీడియా ప్రశ్నించగా.. ఎక్మో అసలు పెట్టలేదు.. ఎమ్మో పెట్టారనే ప్రచారంలో వాస్తవం లేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు.. త్వరలోనే తారకరత్న నవ్వుతూ ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆకాక్షించారు నందమూరి రామకృష్ణ..
పార్టీ పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్.. 2వ తేదీన కీలక భేటీ..
మరోసారి వైసీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్య ఉండేలా.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన.. మధ్యలో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.. పార్టీ కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల ప్రచారం వెనుకబడిన నేతలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.. ఈ సారి టార్గెట్ 175.. మొత్తం సీట్లు గెలవాల్సిందే.. అందరూ కలిసి పనిచేస్తేనే అది సాధ్యమని.. నేను ఒక్కడినే కాదు.. మనమంతా కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. ఇక, వచ్చే నెలలో కీకల సమావేశానికి సిద్ధమయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. వచ్చే నెల (ఫిబ్రవరి) 2వ తేదీన పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల ఎంపిక ప్రక్రియను సమీక్షించనున్నారు.. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల ఎంపికకు ఈ రోజుతో గడువు ముగిసిన నేపథ్యంలో.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు.. ఫిబ్రవరి మొదటి వారంలో మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది వైసీపీ.. వచ్చే నెలలో మరికొన్ని కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టే దిశగా కసరత్తు జరుగుతోంది.. ఈ సమయంలో.. జరగనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. కాగా, ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వరుస సమావేశాలతో వైసీపీ జోష్ పెంచుతోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2వ తేదీన కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
మూడు రాజధానులపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. మూడు రాజధానుల చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదన్న హైకోర్టు.. అమరావతి ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట గడువు పెట్టింది.. ఆరు నెలలలోపు రాజధాని నిర్మాణం పూర్తి కావాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసింది వైఎస్ జగన్ సర్కార్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. అయితే, గత నవంబర్‌లో విచారణ సందర్భంగా మౌలిక సదుపాయాల కల్పన డెడ్ లైన్లపై స్టే విధించింది సర్వోన్నత ధర్మాసనం.. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. ఇక, రాజధానుల విషయంలో దాఖలైన కేసుల్లో ప్రతి వాదులు సైతం రేపు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.. దీంతో, ఈ కేసులో ఎలాంటి విచారణ జరుగుతోంది.. ఎవరు ఎలాంటి వాదనలు వినిపిస్తారు.. రేపు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో ప్రభుత్వం కోరింది.. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. కాలపరిమితితో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ది చేసి మూడు నెలల్లోపుగా భూ యజమానులకు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించింది.. కానీ, అమరావతి రాజధానిపై మాత్రం స్టే ఇవ్వలేదు. దీంతో.. రేపటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.. కాగా, చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ.. కర్నూల్‌ను న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.. మూడు రాజధానులను విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నా.. వెనక్కి తగ్గేదేలే అనే విధంగా ముందుకు సాగుతున్నారు సీఎం వైఎస్ జగన్.
బీబీసీ డాక్యుమెంటరీ వివాదం..విచారణకు సుప్రీంకోర్టు ఓకే
గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇది భారత్‌లో ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం వచ్చే వారం విచారిస్తామని వెల్లడించింది. వీటిని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని.. ఈ నేపథ్యంలో దీనిపై దాఖలైన పిల్‌లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరారు. పరిశీలించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే సోమవారం వీటిని విచారిస్తామని వెల్లడించింది. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై తాము దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసర జాబితాలో చేర్చి విచారించాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తరఫున న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్‌లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పౌరులు, విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారని.. అందుకే దయచేసి ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరారు. అలాగే 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై వచ్చే నివేదికలు, వార్తలు, వాస్తవాలను చూసే హక్కు పౌరులకు ఉందో లేదోననే విషయాన్ని కూడా సుప్రీం కోర్టు నిర్ణయించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిల్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జనవరి 21న ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. వీటిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జే బీ పార్దీవాలా ధర్మాసనం.. వచ్చే వారం విచారణ చేపడతామని తెలిపింది.
ఇలియానాకు అస్వస్థత..
అసలు ఇండస్ట్రీకి ఏమవుతుంది.. ఒకపక్క ఆగని మరణాలు.. ఇంకోపక్క అరుదైన వ్యాధుల బారిన పడుతున్న హీరోయిన్లు. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అని ఆనందపడేలోపే.. ఇలాంటి విషాద వార్తలు ఇండస్ట్రీని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే నటుడు నందమూరి తారకరత్న హాస్పిటల్ లో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న విషయాన్నే జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు టాలీవుడ్ నటి ఇలియానా మరో చేదు వార్తను చెప్పుకొచ్చింది. తానూ కూడా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో ఆమె పంచుకుంది. గత మూడు రోజులుగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యిందని తెలుస్తోంది. ఇక ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆమెకు వైద్యులు మూడు సైలెన్స్ బాటిల్స్ పెట్టినట్లు తెలిపింది. కనీసం ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి అని కానీ, అసలు ఆమె దేనివలన బాధపడుతుంది అనేది మాత్రం చెప్పుకు రాలేదు. ఇక ఇలియానాకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించి తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కటి గోవా బ్యూటీ ధన్యవాదాలు తెలిపింది. ” ప్రతి ఒక్కరు నా హెల్త్ గురించి మెసేజ్ చేస్తున్నారు. నా మీద అంత ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి నిజమైన ప్రేమను అందుకుంటున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా ఇప్పుడు బావున్నాను అని చెప్తున్నాను. దేవుని దయవలన తగిన సమయంలో తగిన చికిత్స నాకు దొరుకుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇల్లూ బేబీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది.
ఏయ్.. బాంచత్ .. నాని నట విశ్వరూపం
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దసరా. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో నాని నటవిశ్వరూపం చూపించేశాడు. డీ గ్లామరస్ రోల్ లో పక్కా నాటు కుర్రాడిగా అదరకొట్టేశాడు. ” వీర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి చూస్తే కానీ.. కనిపించని ఊరు ” అంటూ నాని వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. బొగ్గు గనుల మధ్య ఉన్న ఒక పల్లెటూరులో జరిగిన కథనే దసరా.. కథ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ నాని యాక్షన్ తో అదరగొట్టేసాడని తెలుస్తోంది. ఇక విలన్ గా సాయి కుమార్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ మొత్తం నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.. ఆ ఊర మాస్ లుక్, స్వాగ్.. ఇప్పటివరకు చూడని నానిని ఈ సినిమాలో చూడనున్నారు ప్రేక్షకులు.. ఇక చివర్లో నాని చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. సంతోష్ నారాయణ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటింగ్ స్కిల్స్ టీజర్ పైనే కాదు సినిమాపైనే ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ లో కీర్తి సురేష్ మాత్రం కనిపించకపోవడం అభిమానులను కొద్దిగా అసహనానికి గురిచేస్తోంది. మొత్తం నాని యాక్షన్ కట్స్ తో నింపేశాడు శ్రీకాంత్. ఇకపోతే ఈ సినిమా మార్చి 30 న రిలీజ్ కానుంది. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
లేడీ సూపర్ స్టార్ ను కమిట్మెంట్ అడిగే ధైర్యం చేసిందెవరు..?
సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే కచ్చితంగా హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాలి .. ఇది ఒక్కరి మాట కాదు. చాలామంది హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పిందే. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మొట్టమొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. మొదట్లో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నట్లు తెలిపింది. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. లేదా అనేది నేను చెప్పలేను. కానీ నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. మన ప్రవర్తనను బట్టే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. నన్ను అడిగారు.. నేను ముఖం మీదే నో అని చెప్పాను. నమ్ముకొని పైకి వచ్చాను. ఇప్పటికి అలాగే కొనసాగుతున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక నయన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ ను కమిట్మెంట్ అడిగే ధైర్యం చేసిందెవరు.. అని కొందరు అంటుండగా.. నయన్ నిజంగానే ట్యాలెంట్ ను నమ్ముకొని వచ్చిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు.