బాధ్యతలు స్వీకరణ.. సీఎంను కలిసిన కొత్త సీఎస్
తెలంగాణ కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు తెలంగాణ నూతన సీఎస్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. తనకు సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసిఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
నేటి నుండి ఉచిత బియ్యం పంపిణీ
కొత్త సంవత్సరం వచ్చేసింది.. జనవరి నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా.. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ పంపిణీ చేయడం లేదు ఏంటి? అంటూ రేషన్‌కార్డు దారులు అంతా ఎదురుచూస్తున్నారు.. సాధారణంగా 5వ తేదీ నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.. కానీ, ఈ నెల మాత్రం 10వ తేదీ దాటినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తాయి.. ఈ సమయంలో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.. పేదల కోసం నిరంతరం తపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్న ఆయన.. కరోనా కష్టకాలంలో 10 కిలోల బియ్యం ఉచితంగా అందించిన ప్రభుత్వం తమదన్నారు.. అయితే, ఈ నెలలో సాఫ్ట్‌వేర్ మాడిఫికేషన్ వల్లే రేషన్ పంపిణీలో కొంత జాప్యం జరిగినట్టు వెల్లడించారు..
విమర్శలు చేయడం తప్ప.. ఏపీ మంత్రులకు ఏ పని లేదు
జనసేన నేత కొణిదెల నాగబాబు మరోసారి ఏపీ మంత్రులపై నిప్పులు చెరిగారు. విమర్శలు చేయడం తప్ప ఏపీ మంత్రలకు ఏ పని లేదని.. మంత్రులకు తాము చేయాల్సిన పని వారు చేయడం లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో రణస్థలం, యువశక్తి కార్యక్రమం సభా స్థలంలో నాగబాబు మాట్లాడుతూ.. యువకులతో సభ అనేది చాలా అవసరమన్నారు. అలోచన, ఆవేదన చెప్పడానికి ఈ సభ మంచి అవకాశమని పేర్కొన్నారు. యువత చాలా పవర్‌ఫుల్ అని, ఈ సభను యువత ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీ కంకణం కట్టుకుందన్నారు. సభకు తాము పెట్టిన రణస్థలం పేరు.. యూత్ పవర్‌కి తగ్గట్టుగా ఉందన్నారు. ఏపీలో ఈరోజు ఉద్యోగాలు గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ లేవని మండిపడ్డారు. యువతకు తమ జనసేన పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయంలో మూత్రం
ఇటీవల విమానాల్లో మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. అయితే ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయం బయట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంట్రీ వద్ద ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. అది గమనించిన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. జనవరి 8వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-3 డిపార్చర్ ఏరియాలోని గేట్ వద్ద మూత్ర విసర్జన చేసినందుకు 39 ఏళ్ల తాగుబోతు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఘటన తర్వాత అతడిని గమనించిన సిబ్బంది అరెస్ట్ చేశారు. అరెస్టయిన బీహార్‌కు చెందిన జౌహర్ అలీ ఖాన్ బెయిల్‌పై అదే రోజు విడుదలయ్యారని వారు తెలిపారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3లోని డిపార్చర్ ఏరియాలోని గేట్ నంబర్-6 వద్ద ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తమకు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
గంగానదిలో ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్.. ప్రారంభించనున్న ప్రధాని
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసిలోని గంగానది ఒడ్డున టెన్త్ సిటీని ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం సర్క్యూట్‌ను జనవరి 13న వారణాసిలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంగానది, బ్రహ్మపుత్ర నదులపై 51 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఈ సందర్భంగా రూ. వెయ్యి కోట్ల కంటే విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గంగా విలాస్ వారణాసి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి 51 రోజుల్లో 3,200 కి.మీ ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ చేరుకుంటుంది, రెండు దేశాల్లోని 27 నదీ వ్యవస్థల మీదుగా ప్రయాణిస్తుంది. 51 రోజుల రివర్ క్రూయిజ్ ప్రయాణం దేశంలో సాంస్కృతిక మూలాలను అనుసంధానించడానిక ఒక ప్రత్యేకమైన అవకాశం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రూయిజర్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు ఉన్నాయి. ఇందులో 36 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్థ్యం, అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. వారణాసిలో 13న ప్రారంభమయ్యే ఈ షిప్ టూరిజంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన 32 మంది పర్యాటకులు ప్రత్యేకంగా ప్రయాణించనున్నారు. ఈ 52 రోజుల్లో వీరు 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. గంగానది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభమై.. మార్చి 1న అస్సాంలోని దిబ్రూగఢ్ లో ముగియనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పెద్ద నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యాటన జరిపిన సందర్భాలు లేవని.. అందుకే గంగ, బ్రహ్మపుత్రలపై జరిగే ఈ పర్యాటకయాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తక్కువ ధరకే మరో ఎలక్ట్రిక్ స్కూటర్..
ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ నడుస్తోంది. పెరుగుతున్న పెట్రలో ధరలకు చెక్ పెట్టేందుకు.. జనాలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ఒకదానికి మించి మరొక వాహనాల్ని లాంచ్ చేస్తున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు.. తక్కువ ధరల్లోనే అధునాతన ఫీచర్స్ తో స్కూటర్లను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు కబీరా మొబిలిటీ అనే కంపెనీ.. అతి తక్కువ ధరకే అదిరిపోయే స్కూటర్ ని కొలిజియో నియో పేరిట మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? ఎక్స్ షోరూమ్ ధరను ఆ కంపెనీ కేవలం రూ. 45,990గా నిర్ణయించింది. ఇక ఆన్ రోడ్ ధరను రూ. 49,200 గా కేటాయించింది. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే.. దీని డిజైన్ కూడా చాలా వినూత్నంగా, చూడముచ్చటగా ఉంటుంది.
జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఊరట..
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ ఊరట లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను తయారు చేయడానికి, విక్రయించడానికి మరియు పంపిణీ చేయడానికి బాంబే హైకోర్టు ఇవాళ అనుమతి ఇచ్చింది.. మహారాష్ట్ర ప్రభుత్వం కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ, ఉత్పత్తి తయారీ మరియు అమ్మకాలను నిలిపివేయాలని కోరింది.. అది కఠినమైన, అసమంజసమైన మరియు అన్యాయమైనదిగా పేర్కొంటూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, ఆ మూడు ఉత్తర్వులను రద్దు చేసింది బాంబే హైకోర్టు.. డిసెంబర్ 2018లో స్వాధీనం చేసుకున్న కంపెనీ బేబీ పౌడర్ నమూనాపై పరీక్షలు చేయడంలో జాప్యం చేసినందుకు రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)పై న్యాయమూర్తులు గౌతమ్ పటేల్ మరియు ఎస్‌జీ డిగేలతో కూడిన డివిజన్ బెంచ్ తీవ్రంగా ఖండించింది.
గూగుల్‌కు షాక్.. ఆ భారీ జరిమానా కట్టాల్సిందే..!
గూగుల్‌కు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లోనూ షాక్ తగిలింది.. ప్లేస్టోర్ విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్‌సీఎల్ఏటీ.. ఇప్పటికే విధించిన జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాల్సిందేనని స్పష్టం చేస ఇంది.. దీంతో, ఎన్‌సీఎల్‌ఏటీలో వారం రోజుల వ్యవధిలోనే గూగుల్‌కు వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలినట్టు అయ్యింది.. ఇక, జరిమానాపై అప్పీల్‌ను ఏప్రిల్ 17వ తేదీన విచారించనుంది. అయితే, భారతీయ కస్టమర్ల కోసం గూగుల్ “డిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్”ని ఆశ్రయిస్తున్నట్లు సీసీఐ ఇంతకు ముందు చెప్పింది. జనవరి 16న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది.
పోటీ ఉంటేనే మంచి సినిమాలు వస్తాయి
చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి, సంక్రాంతికి రిలీజ్ అయ్యే రెండు సినిమాలు బాగా ఆడాలి అన్నాడు బాలకృష్ణ. వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ, “ఈ సంక్రాంతికి రెండు సినిమాలు హిట్ అవుతాయి. పోటీ ఉంటేనే మంచి సినిమాలు వస్తాయి అప్పుడే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.” అన్నాడు. చిరుతో పోటీ గురించి బాలయ్య మాట్లాడడం ఇదే మొదటిసారి.
థాంక్యూ చంద్రబాబు మావయ్య.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో నేడు ఇండియన్ సినిమా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా అవార్డులను అందుకుంటూనే ఉంది. ఇక ఆస్కార్ కు మొదటిమెట్టు గా నేడు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకొని ఇండియా రేంజ్ ను ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ప్రశంసలు అందిస్తున్నారు. ప్రధాని మోడీ దగ్గరనుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తమ శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఇక తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ” ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకుంది తెలుసుకొని సంతోషిస్తున్నాను. ఎమ్ఎమ్ కీరవాణి, రాజమౌళికి మరియు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. ఇది గర్వించదగ్గ విషయం. నేను ముందే చెప్పినట్లుగానే తెలుగు భాష ఇప్పుడు శక్తివంతంగా మారింది” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై ఎన్టీఆర్ స్పందించాడు. ‘థాంక్యూ సో మచ్ మావయ్య’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒకానొక సమయంలో టీడీపీ ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఏనాటికైనా ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడు అని టీడీపీ అభిమానుకు కోరుకుంటున్నారు. ఇక మరోపక్క ఎన్టీఆర్.. తనకు ప్రస్తుతం సినిమాలు చాలు అని, రావాల్సిన టైమ్ వస్తే వస్తాను అని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.