గుడ్ బడ్జెట్.. మా నాలుగు సూచనలు కేంద్రం పాటించింది..
లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24పై సంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది గుడ్ బడ్జెట్.. అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు.. అయితే, ప్రీ బడ్జెట్‌లో మేం చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తుందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక, వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును రూ.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలకు పెంచటం ఆహ్వానించదగిన అంశం.. ఓవర్ ఆల్‌గా ట్యాక్స్ రూపంలో సగటు వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే, వ్యవసాయం, పౌర సరఫరాలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి.. కేంద్రం నుండి రాష్ట్రాలకు వస్తున్న వాటా ఈసారి ఇంకా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషరీస్ మేత దిగుమతి సుంకం తగ్గించమని అడిగాం.. కేంద్రం ఆ మేరకు నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేశారు.. విద్య, విద్యుత్, రోడ్లు, మౌలిక సదుపాయాల్లో కేటాయింపులు పెరిగాయి.. దేశ అప్పు గత ఏడాది కంటే 50 వేల కోట్లు పెరిగింది.. విమానాశ్రయాలు, పోర్టులపై శ్రద్ధ కూడా రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు.. మరోవైపు.. మూడు రాజధానుల వ్యవహారంపై స్పందించిన బుగ్గన.. విశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తుచేశారు.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సీఎం ఆఫీస్ అవుతుందన్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.
పవన్‌కు మంత్రి సవాల్.. నాకు అంత భూమి ఉందని నిరూపిస్తే జనసేనకు విరాళం ఇస్తా..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. నా దగ్గర 600 ఎకరాల భూమి ఉన్నట్టు ఆరోపిస్తున్నారు.. నా దగ్గర అంత భూమి ఉందని నిరూపిస్తే.. ఆ భూమిని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించారు.. నిరాధారమైన ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ మానుకోవాలని హితవుపలికిన ఆయన.. కాపులను కట్టగట్టి చంద్రబాబుకు అమ్మే ప్రయత్నం పవన్ చేస్తున్నారని విమర్శించారు. ఒక కాపు వాడిగా సలహా ఇస్తున్నా.. సీట్ల కోసం ఆరాటం కంటే పార్టీని బలోపేతం చేసి ఎడిగితే మంచిదని సూచించారు.. తెలుగుదేశం మూతబడితే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం జనసేనకు ఉందని వ్యాఖ్యానించారు మంత్రి గుడివాడ. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై స్పందించిన మంత్రి అమర్నాథ్.. యువగళం పాదయాత్ర చూస్తే జాలేస్తోందన్నారు.. చంద్రబాబుకు ఇంటి పోరు ఎక్కువైంది.. టీడీపీ భవిష్యత్ యువనాయకుడి చేతుల్లో పెట్టాలని ఒత్తిడి ఎక్కువైందని చెప్పుకొచ్చారు.. చంద్రబాబు మాత్రం తన మీదే ఫోకస్ ఉండాలని కోరుకుంటున్నారని సెటైర్లు వేశారు.. అందుకే యువగళం పాదయాత్ర ప్రారంభమైన ఇప్పటి వరకు వెళ్లలేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
జగన్‌తో పెట్టుకున్నవాళ్లకు రాజకీయ సన్యాసమే..! ఆయనకు ద్రోహం చేస్తే పుట్టగతులుండవు..!
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పెట్టుకున్న వాళ్లంతా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.. జగన్‌కు ద్రోహం చేసినవాళ్లు పుట్టగతులు లేకుండా పోతారంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో ఉంటూ జగనన్నకు ద్రోహం చేసే వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు.. సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి ,చంద్రబాబు నాయుడు, ఎర్రమునాయుడు కుటుంబం అడ్రస్ లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు.. ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం లాంటివాడు.. మీరు ఎంతమంది మందలు మందలుగా వచ్చినా.. ఆయను ఏం చేయలేరని ప్రకటించారు.. అయితే, మన పార్టీకి సంబంధించిన ఒకరు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అనవసరమైన ప్రకటనలు ఇస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు నారాయణస్వామి.. జగనన్నకు ద్రోహం చేసిన వాళ్లు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించిన ఆయన.. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడుగా మనం అంటున్నాం.. మన పార్టీ వాళ్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి జగనన్న వెన్నుపోటుదారులుగా ముద్ర వేసుకోకండి అంటూ హితవుపలికారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
మోడీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఈ బడ్జెటే ఉదాహరణ
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం విఫలమైందని అనడానికి ఈ బడ్జెటే ఉదాహరణ అని విమర్శించారు. ఇది కేవలం కొన్ని రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రూ.10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తారని తాము ఆశించామన్నారు. ఎందుకంటే.. తెలంగాణలోని ఉద్యోగులకు తాము మంచి జీతాలు ఇస్తున్నామని, కానీ కేంద్రమంత్రి ప్రకటించిన రిబేట్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు మాత్రమే లబ్ది చేకూరేలా డెవలప్మెంట్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించిందన్నారు. మౌళిక సదుపాయాల కల్పన కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారని, కానీ అవి ఎలాంటి మౌళిక సదుపాయాలో బడ్జెట్‌లో వెల్లడించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల వరకు రుణపడి ఉందని, ఆ బాకీలను చెల్లించాలని ఆర్ధికమంత్రిని కవిత డిమాండ్ చేశారు. ఇదిలావుండగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. దీంతో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు.. సీతారామన్ ఇప్పటివరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. కేంద్ర బడ్జెట్‌ను 87 నిమిషాల్లో పార్లమెంటు వేదికగా ప్రజల ముందు ఉంచారు. అంతకుముందు.. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 (2 గంటల 42 నిమిషాలు) నిమిషాల పాటు ప్రసంగించారు. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం.. నిడివిపరంగా రెండో అతిపెద్దది.
ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్‌లో దీన్ని వ్యతిరేకిస్తాం
కేంద్ర బడ్జెట్‌పై ఖమ్మం నామా నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. ఎన్నో ఆశలతో ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారని, కానీ రైతులకు అనుకూలంగా ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్.. డిజిటల్ అగ్రికల్చర్‌తో అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు. గత 9 ఏళ్లలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎంఎస్పీ గురించి ఒక్క మాట మాట్లాడలేదని దుయ్యబట్టారు. బడ్జెట్ మిల్లెట్స్ చుట్టూ తిప్పారన్నారు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కర్ణాటకలోనే కరువు ఉందని బీజేపీ చెప్తోందని ఫైర్ అయ్యారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పన ఏది? అని నిలదీశారు. ఈ బడ్జెట్‌లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా చెప్పలేదని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు, నీతి అయోగ్ నిధులు ఇవ్వాలని తాము సూచించినా.. ఆ నిధుల్ని కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తపరిచారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ప్రాజెక్టులకు అనుమతులు కూడా ఇవ్వట్లేదని బీజేపీపై నిప్పులు చెరిగారు. రూరల్ డెవప్మెంట్ ఏమైందని ప్రశ్నించిన ఆయన.. గ్రామ అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతున్నారు. తాము పార్లమెంట్‌లో ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తామన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇలా!
దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్ 2023-24ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని మంత్రి పేర్కొన్నారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం కాస్త తక్కువనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయగా.. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..
కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
ఈరోజు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచిందని పేర్కొన్నారు. ఇది పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి ప్రసంగంలో తెలంగాణకు ప్రత్యేక ప్రకటనలేవీ లేవన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో మిల్లెట్ రిచెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నట్లు.. గతంలోనూ అనేక ఉత్తుత్తి హామీలు ఇచ్చారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి సీఎం కేసీఆర్ బాధ్యత కూడా ఉందన్నారు. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా.. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఇది పెత్తందారులకి అనుకూల బడ్జెట్ అని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేసే పనిలో నిర్మలా సీతారామన్ ఉన్నారన్నారు. ఈ బడ్జెట్ పేదలకు ఉపకరించేది లేదని, బడ్జెట్‌లో కూడా బీజేపీ రాజకీయమే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేశారన్నారు. మోడీ హామీల అమలుకు కేటాయింపులు లేవని, ఉద్యోగాల కల్పనపై దృష్టి లేదని దుయ్యబట్టారు. పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీకి నిధుల కోత పెట్టారన్నారు. ఏకంగా రూ.29 వేల కోట్లు కోత పెట్టారంటే.. పేదల పట్ల బీజేపీ కపట ప్రేమ బయటపడింద్నారు. ఉపాధి హామీ కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన అపూర్వ పథకమని తెలియజేశారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ మెల్లమెల్లగా పక్కకు పెట్టే పనిలో ఉందని విమర్శించారు.
ఎక్సర్‌సైజ్ ఎప్పుడు చేస్తున్నారు..? ఎలా చేస్తే బరువు తగ్గుతారు..?
ఉరుకులు పరుగుల జీవితంలో అంతా గందరగోళ పరిస్థితి.. మానసికగా, శరీరకంగా కాస్త రిలాక్స్ కావాలంటే ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయాల్సిందే.. కొందరు తమ ఉద్యోగాలను బట్టి ఉదయమే వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే.. మరికొందరు వారి ఉద్యోగాల్లో షిఫ్ట్‌లకు అనుగుణంగా కూడా వర్కౌట్స్ చేస్తుంటారు.. అయితే, వర్కౌట్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతందని కొందరు భావిస్తే, మరికొంతమంది వర్కౌట్లతో లాభాలు పెద్దగా లేవని కూడా అనుకుంటారు. స్పీడ్ కార్డియో చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.. ఫాస్ట్ కార్డియో చేయడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుందని.. మీరు ఖాళీ కడపుతోనే ట్రెడ్ మిల్, సైక్లింగ్ చేస్తే.. కొవ్వు తగ్గుతుందని చెబుతున్నారు.. తినడానికి ముందే వర్కౌట్ చేస్తే.. శరీరంలోని అదనపు కేలరీలు తగ్గిపోతాయని.. శరీరం అప్పటి వరకూ నిల్వ చేసిన కొవ్వు తగ్గేందుకు ఇది ఎంతో దోహదపడుతుందంటున్నారు నిపుణులు. దీనిపై కూడా భిన్నవాదనలే ఉన్నాయి.. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత పెద్దగా తినేవాళ్లు ఉండరు.. నిద్ర కారణంగా ఏం తినకుండా ఉంటారు.. ఆ తర్వాత ఉదయమే నిద్రలేచి వర్కౌట్లు చేయడం వల్ల కొవ్వు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నమాట.. ఇదే సమయంలో.. దీంతో పెద్దగా ఉపయోగం లేదని.. శరీరంలోని కొవ్వు అలానే ఉంటుందని కూడా సూచిస్తున్నాయి.. అయితే, కండలు పెంచుకోవాలని భావించేవారు మాత్రం కార్డియో వర్కౌట్స్‌కి ముందు తినాలి. తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవడం వల్ల కండరాలకు మంచిదని చెబుతున్నారు.. కానీ, ఏం తినకుండా కష్టపడి వర్కౌట్ చేయడం వల్ల మీకు అసిడిటీ వచ్చే ప్రమాదం ఉందని.. కండరాలకి కూడా నష్టం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ముందుగా ఏమైనా తినడం.. వర్కౌట్ తర్వాత కూడా తినడం వల్ల కండరాలకి బలం ఇచ్చినట్లుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.. మొత్తంగా.. వర్కౌట్ ముందు తినడం, తర్వాత తినడం అనేది వారివారి వ్యక్తిగత అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది మరి.
నాకు తెల్సిన బ్రహ్మానందం అంటూ చిరు ట్వీట్.. వైరల్
ఇండస్ట్రీలో ఎవరి పుట్టినరోజు అయినా.. మెగాస్టార్ చిరంజీవి విష్ లేకుండా పూర్తవదు. ఆయనకు అత్యంత ఆప్తులు అయితే ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్ డే విషెస్ తెలుపుతారు. తాజాగా చిరుకు అత్యంత ఆప్తుడైన బ్రహ్మానందం నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో నేడు చిరు.. బ్రహ్మీ ఇంటికి వెళ్లి ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. పుష్పగుచ్చంతో పాటు బ్రహ్మానందంకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించాడు. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.. బ్రహ్మానందంతో ఉన్న ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు చిరు. “నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలి లో ఒక లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీ కి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ,పదిమందిని నవ్విస్తూ వుండాలని, బ్రహ్మానందం కి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు వుండాలని,తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రామ్ ప్రసాద్, రాకేష్ రాఘవ, రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.
ఇన్నాళ్లకు మైకేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. 50 ఏళ్ళ వయస్సులో ఆయన మృతి చెందారు. ఇక ఆయన మరణాన్ని ఇప్పటికి సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న విషయం తెల్సిందే. ఆయన మన మధ్యలేకపోయిన బ్రేక్ డాన్స్ రూపంలో నిత్యం జీవించే ఉన్నాడు. మైకేల్ చనిపోయాకా ఆయన బయోపిక్ ను తీయడానికి చాలామంది ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అందులో ఏది నిజం కాదని తెలిసింది. మైకేల్ జీవితం అంటే వివాదాల పూతోట. సర్జరీలు, గొడవలు, ప్రేమలు, పెళ్లిళ్లు.. ఇలా అన్ని వివాదాలే. అవన్నీ కూడా సింగింగ్ రారాజు మీద అభిమానాన్ని చంపలేకపోయాయి. ఇక వాటన్నింటిని తెరమీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక మైకేల్ బయోపిక్ కు కథను అందిస్తోంది కూడా అల్లాటప్పా రైటర్ కాదు.. మూడుసార్లు ఆస్కార్ ను అందుకున్న జాన్ లోగన్. ఇక ఈ సినిమాకు అంటోనియో ఫుకో దర్శకత్వం వహిస్తుండగా మైకేల్ జాక్సన్ కుటుంబం నిర్మిస్తోంది. ఇక ఈ బయోపిక్ లో మైకేల్ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఆయనలా సంగీతంలోను, పోలికలోనూ సరిసమానంగా ఉన్నది ఎవరు అని ఆలోచిస్తుండగా.. మైకేల్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జాఫర్ జాక్సన్ లైన్లోకి వచ్చాడు. జాఫర్.. మైకేల్ తమ్ముడు కుమారుడు.. పాప్ సింగర్ అండ్ డాన్సర్. పెద్దనాన్న బయోపిక్ లో నటించడానికి అతడికి మించి అర్హత ఇంకెవరికి ఉంటుంది. అతను కూడా ఈ పాత్ర చేయడానికి అదృష్టం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన డైరెక్టర్.. త్వరలోనే ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. మరి ఈ బయోపిక్ ను ఇండియాలో కూడా రిలీజ్ చేయమని అభిమానులు కోరుకుంటున్నారు.