NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఆంధ్రపదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు..
ఆంధ్రపదేశ్, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు భారీ ర్యాలీ తో బయలు దేరారు. ర్యాలీలో భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రాబాబు ట్రస్ట్ భవన్‍కు తొలిసారి రావడంతో టీడీపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక పైకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ట్రస్ట్ భవన్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వేదికపైకి వచ్చిన వెంటనే అభిమానులు కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేశారు. అనంతరం సభా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళుల ఆర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలని తెలిపారు. మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైనే అని అన్నారు. తెలుగు జాతికి అన్యాయం జరిగిందని వారికి అండగా నిలబడడానికి తెలుగు దేశం పార్టీ పెట్టారని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వికసిస్తుంది అనిపిస్తుందని తెలిపారు. నాకు ఆంధ్రపదేశ్ తెలంగాణ రెండూ రెండు కళ్లని హర్షం వ్యక్తం చేశారు. పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసి వారికి స్వాతంత్య్రం కల్పించింది తెలుగు దేశం పార్టీ తరుపున నందమూరి రామారావు అన్నారు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ నుండి నాయకులు పోయారు.. కానీ కార్యకర్తలు వెళ్ళలేదని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఉన్న వరకు తెలుగుదేశం పార్టీ ఉంటదని తెలిపారు.

ముఖ్యమంత్రుల భేటీలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు..
రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.. ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వర్తిస్తుంది.. మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి కాపిటల్ గా పొడిగించాలి.. టీడీపీ ఎంపీలు ఎవరు ఈ భేటీ గురించి మాట్లాడలేదు అని మాజీ ఎంపీ అన్నారు. ఇక, భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు ప్రధాన పోర్టుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ నేతలు అడిగినట్లు తెలుస్తోంది.. వీటిపై పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లవిద్యుత్ బకాయిల గురించి ఏమాత్రం చర్చ జరగనట్టే తెలుస్తోంది అని మాజీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు. కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వం లేకుండా జరిగిన ఈ సమావేశానికి ఎంత మేర గుర్తింపు ఉంటుంది.. టీడీపీ నేతలు గుట్టల కొద్దీ తీసుకున్న ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు.. రాజ్యాంగం మీద ఒట్టేసి ఎన్ని గుట్టల ఇసుక అమ్ముకున్నారో రాజమండ్రి ఎమ్మెల్యే చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాటలు గౌరవంగా మాట్లాడాల్సి ఉంటుంది.. నా వాహనం దగ్ధానికి సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు.. నిన్ను నువ్వు ఆధికంగా ఊహించుకోకు.. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలుచావు.. నీ బఫూన్ ఫేస్ చూసి ఎవరు ఓటు వేయలేదు అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఉద్యమం చేస్తుంది..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఏపీ ఆస్తులు తీసుకోమని అప్పట్లో జగన్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాడు అని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ స్వాగతిస్తున్నాం.. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభ పరిణామం.. ఇది రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొని ధోరణితో ఉండాలి.. ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు అని ప్రశ్నించారు. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన శ్రీ లక్ష్మీ ప్రధాన మంత్రి కార్యాలయంలో పోస్టింగ్ లో ఉండాల్సిన ఆమె జైలు పాలు అయిందన్నారు. రాజకీయ పార్టీలకు ప్రజలిచ్చింది ఐదేళ్ళ సమయమే.. ఐదేళ్లు మిడిసి పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయాడు అని ఆయన మండిపడ్డారు. ఇక, మోడీకి చింత చచ్చినా పులుపు చావలేదు.. ప్రధానికి ఇంకా అహంభావం పోలేదు.. 400 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికిన మోడీ.. 2019 ఎన్నికల కంటే కూడా తక్కువ సీట్లు వచ్చాయిని సీపీఐ నారాయణ అన్నారు. ఇక, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన చట్టాలు అమలు చేస్తూ.. మోడీ ఆ చట్టాల పేర్లు మార్చారు అని సీపీఐ నారాయణ తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది.. వీరిద్దరూ ప్లేట్ ఫిరయించకుండా మోడీ పట్టుకున్నాడు.. ప్రమాదకరమైన బీజేపీని చంద్రబాబు రెండోసారి రాష్ట్రానికి రప్పించాడు.. ప్రత్యేక హోదా కోసం సిపిఐ తప్పకుండా ఉద్యమం చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాధ రథయాత్ర నిర్వహణలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా మంచి అనుభూతిని కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహక మండలి సభ్యుడు వేదాంత చైతన్యదాస్ తెలిపారు. ఉదయం ఎన్టీఆర్ స్టేడియం నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన ఇస్కాన్ ప్రతినిధులు ప్రారంభోత్సవ వేడుకలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నారాయణగూడ, హిమాయత్ నగర్, టీటీడీ టెంపుల్, బషీర్ బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ కూడలి మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు యాత్ర సాగుతుందని వివరించారు. అక్కడే పండుగ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో సంగీత కచేరీలు, మహా హారతి, ప్రవచనాలు ఉంటాయన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు 108 ఆలయాల్లో భగవధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు..
తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయన్నారు. రేవంత్ ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువు పొడిగించలేదు… వివిధ రాష్ట్రాల సీఎంలు అడిగారని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ,కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. వేములవాడ ఆలయాన్ని ఈసారి ప్రసాదం స్కీంలో చేర్చుతామన్నారు. రామాయణ సర్క్యూట్ కింద ఇళ్లందకుంట, కొండగట్టు దేవస్థానాలను చేర్చాలని ప్రతిపాదన ఉందన్నారు. కరీంనగర్ హాసన్ పర్తి రైల్వే లైన్ సర్వే పూర్తయిందన్నారు. కరీంనగర్ కి ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు. తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ లో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని.. అందుకే వాళ్లు తర్జనభర్జన అవుతున్నారని సంచలన వ్యాక్యలు చేశారు. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను వారి ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని.. త్వరలో పార్టీ ప్రెసిడెంట్ ని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు.

ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్తున్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ రేపు సోమవారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనకు ముందు మాస్కో విడుదల చేసిన ప్రకటనలో రష్యా ‘చాలా ముఖ్యమైన పర్యటన’ కోసం ఎదురుచూస్తోందని పేర్కొంది. భారత్, రష్యాల మధ్య పరస్పర సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని వారు భావిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని రష్యాను సందర్శించనున్నారు. ప్రధాని మోడీ మాస్కోకు చేరుకోవడానికి ముందు, రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయ క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శనివారం ఈ విషయాన్ని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 22వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఆయన జూలై 8, 9 తేదీలలో రష్యా రాజధాని మాస్కోలో ఉంటారు. ఈ అత్యున్నత స్థాయి పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం న్యూఢిల్లీలో అందించింది. ఇరు దేశాల మధ్య బహుళ సమస్యలు, సంబంధాలను ఇద్దరు అగ్రనేతలు వివరంగా సమీక్షిస్తారని చెప్పారు. పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా వారు చర్చించే అవకాశం. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా ప్రభుత్వ టెలివిజన్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు మాస్కోలో ఇతర కార్యక్రమాలతో పాటు అనధికారిక చర్చలు కూడా జరుపుతారని తెలిపారు.

తాత్కాలికంగా చార్ధామ్ యాత్ర నిలిపివేత..
ఉత్తరాఖండ్‌ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా, భక్తులందరూ జూలై 7న రుషికేశ్ దాటి చార్ ధామ్ యాత్రకు వెళ్లవద్దని అభ్యర్థించారు. ఇప్పటికే యాత్రకు వెళ్లిన వారు తమ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు వాతావరణం అనుకూలించే వరకు ఎక్కడున్నా వేచి ఉండాలని ఆయన కోరారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలపై కొండచరియలు విరిగి పడ్డాయని, కొండలపై నుంచి పడిన శిధిలాల కారణంగా బద్రీనాథ్‌ కు వెళ్లే హైవే చాలా చోట్ల మూసుకుపోయిందని సమాచారం. శనివారం నాడు చమోలి జిల్లాలోని కర్ణప్రయాగ్‌ లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుండి పడిపోయిన రాళ్లతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు. వారు బద్రీనాథ్ నుండి మోటార్ సైకిల్‌ పై తిరిగి వస్తుండగా ఈ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు.

అమరావతి జైలులో పేలుడు.. భయాందోళనలో తొక్కిసలాట
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని జైలులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు శబ్ధంతో జైలు సముదాయం అంతా భయాందోళనకు గురవుతోంది. ఈ పేలుడు జైలులోని ఆరు, ఏడు నంబర్ల బ్యారక్ మధ్య జరిగింది. ఈ పేలుడు కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. పోలీసు వర్గాల ప్రకారం.. ఈ పేలుడు ఒక చిన్న, స్వదేశీ బాంబు కారణంగా సంభవించింది. అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జైలు యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసు కమిషనర్ స్వయంగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. జైలులో ఆరు, ఏడు నంబర్ల బ్యారక్ దగ్గర బాంబు లేదా పటాకులు పేలుతున్నట్లు పెద్ద శబ్దం ఉందని అతను చెప్పాడు. దీంతో జైలులో తొక్కిసలాట జరిగింది. అయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. పోలీసు కమీషనర్ తెలిపిన వివరాల ప్రకారం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి పటాకుల నమూనాలను సేకరించడంతో పాటు ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలం చుట్టూ కనిపించే అన్ని రకాల వేలిముద్రలను సేకరిస్తోంది. ఈ వేలిముద్రలను జైలులో నివసిస్తున్న ఖైదీల వేలిముద్రలతో సరిపోల్చనున్నారు. పేలుడు జైలు లోపల ఉంటున్న ఖైదీ వల్ల జరిగి ఉండవచ్చు. దీన్ని ఏదో గ్యాంగ్ వార్‌తో అనుసంధానం చేసేందుకు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!
రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి రెండు మూడు సినిమాలు చొప్పున రిలీజ్ చేసినా అవేవి ఆశించనంత విజయాన్ని ఇవ్వలేదు. యూవీ క్రియేషన్స్ లో వచ్చిన ‘వినరో భాగ్యం విషు కథ’ ఓ మాదిరి విజయాన్ని నమోదు చేసి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. కానీ SR కల్యాణమండపం అంతటి సక్సెస్ దక్కలేదు . బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ తో కొంత విరామం ప్రకటించి కొత్త కథలు వినడంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు అబ్బవరం. మరోవైపు రియల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ కొట్టాడు కిరణ్. తన మొదటి చిత్రంలో కథానాయికగ నటించిన రహస్య గోరక్‌ తో ప్రేమాయణంలో హిట్ కొట్టాడు కుర్రహీరో. ఇటీవల వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కాస్త విరామం తర్వాత నేడు తన నూతన చిత్రాన్ని ప్రారంభించాడు కిరణ్ అబ్బవరం. తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్క్కనుంది ఈ చిత్రం. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇద్దరు దర్శకులు డైరక్ట్ చేయబోతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్‌ పర్యవేక్షిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్ముతున్నాడు ఈ హీరో. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘క’ అనే టైటిల్ పరిశీలిస్తోంది యూనిట్.

ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ఆమె కోసమే కట్ చేయించాడు!
2004 డిసెంబర్ 23న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన ధోనీ.. ఆ తర్వాత 3 మ్యాచ్‌లలో పెద్దగా పరుగులు చేయలేదు. అయితే పాకిస్థాన్‌తో విశాఖ వేదికగా జరిగిన వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 123 బంతుల్లో 148 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ధోనీ పేరు మాత్రమే కాదు.. అతడి హెయిర్ స్టైల్‌కు కూడా భారీ క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే.. మహీ హెయిర్‌స్టైల్‌ను యువత మొత్తం అనుకరించింది. అప్పట్లో ఎంఎస్ ధోనీ హెయిర్ స్టైల్‌కు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా ఫిదా అయ్యారు. 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ధోనీతో ముషారఫ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. జుట్టు కట్‌ చేయించుకోవద్దని, ఈ హెయిర్‌ స్టైల్‌ను ఇలానే మెయింటైన్ చేయాలని మహీని ముషారఫ్‌ రిక్వెస్ట్‌ కూడా చేశారు. అయితే 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం జులపాల జుట్టును కత్తరించిన ధోనీ.. అందరికీ షాకిచ్చాడు. ధోనీ హెయిర్ స్టైల్‌ను ఎందుకు కట్ చేశాడు అని ఫాన్స్ అందరూ చాలా బాధపడ్డారు. యావత్ ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ఎంఎస్ ధోనీ ఎందుకు కట్ చేశాడన్నది ఇప్పటికీ పెద్ద సస్పెన్స్. అయితే అప్పట్లో ధోనీ హెయిర్ కట్ గురించి రకరకాల ఉహాగానాలు వచ్చాయి. ధోనీ హెయిర్‌ స్టైల్‌ను కట్ చేయడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో దీపికాతో ధోనీ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వెలువడ్డాయి. మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని దీపికా కోరిందట. ఆమె కోరిక మేరకే మహీ హెయిర్ స్టైల్ కట్ చేయించాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు.