NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

డి శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్..
ఆదివారం నాడు నిజామాబాద్ లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ కార్యకర్త డి.ఎస్. అని ఆయన అన్నారు. గాంధీ కుటుంబాలకు అంతరంగికుడని., తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ లో ఎవరు మరచిపోలేని పాత్ర పోషించారని సీఎం అన్నారు. 2004 లో పీసీసీ అధ్యక్షుని హోదా లో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను సోనియాకు ఆయన చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి డి.ఎస్. ఆలోచన విధానం ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు. నిజామాబాద్ లో నేడు డి.శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం ప్రగతి నగర్ నుంచి అంతిమ యాత్ర మొదలు కానుంది. బైపాస్ రోడ్డులోని డి.ఎస్. సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరు అయ్యారు. ఇక శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత సీఎం రేవంత్ తిరిగి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

పార్టీ ఫిరాయింపులపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ పార్టీ ఫిరాయింపుల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాలనే నేడు కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకే నిధులు కేటాయించడం సమంజసం కాదని పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని..తెలంగాణలో అధికార పార్టీ దుర్మార్గమైన విధానం ఆలోచిస్తుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ లో ఘన విజయం సాధించిన భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందని గుర్తుచేశారు. కాగా..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ కథ ముగిసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో అందులో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటే తమకు భవిష్యత్ ఉండని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నాట్లు సమాచారం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసులు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా చేవెళ్ల నుంచి గెలిచిన కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.

కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
ఆదివారం కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడిని ఉపయోగిస్తామని ఆవిడ చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని ఆవిడ తెలియజేశారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్ మృతి తనకి తీవ్ర ఆవేదనను కలగజేసిందని తెలిపింది. అలాగే తనకి అత్యంత సన్నితుడిగా ఉండే రమేష్ రాథోడ్ మృతి తనను కలిసివేసిందంటూ ఆవిడ పేర్కొంది. రమేష్ రాథోడ్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేసింది సీతక్క. ప్రతి మారుమూల గ్రామాలకు, వాడలకు తాగునీరు అందిస్తామని అందుకు సంబంధించిన నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలియజేశారు.

ప్రభుత్వ తీరుపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి..
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. ఇళ్లులు కూల్చుతున్నారు.. మా వారిని పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు.. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు.. పోలీసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారు.. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అని ఆయన వెల్లడించారు. 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు.. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా.. అధికారం శాశ్వతం కాదు.. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము.. మీరు వెళ్ళడానికి లేదు.. హౌస్ అరెస్టు చేస్తున్నాము.. అని నాకు నోటీస్ ఇచ్చారు.. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇక, నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న ఇలాంటివి ఎప్పుడు చేయలేవు.. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్నాను.. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకి వెళ్ళారు.. నేను అరెస్టు కైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి భద్ర పర్చుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారు అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం..
పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి నాలుగు రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణుల రానున్నారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో నిన్న డిల్లీలో సమావేశం అయిన నిపుణులు.. ఆ తర్వాత రాత్రికి రాజమండ్రికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్ లో నిపుణులు పరిశీలన చేస్తున్నారు. ఇక, డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు (ఎగువ, దిగువ ), గైడ్ బండులను విదేశీ జలవనరుల నిపుణులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ లు హాజరు అయ్యారు. నేటి నుంచి జులై 3వ తేదీ వరకు ప్రాజెక్టు సైట్ లో పనులను నిపుణులు పరిశీలించనున్నారు. అనంతరం కేంద్ర- రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి రివ్యూ చేయనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.

తమిళనాడులోని హిజ్బ్-ఉత్-తహ్రీర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
తమిళనాడు రాజధాని చెన్నైలో నిషేధిత సంస్థకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, హిజ్బ్-ఉత్-తహ్రీర్ (HUT) అనే నిషేధిత సంస్థపై దర్యాప్తు చేస్తున్నప్పుడు, చెన్నై, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, ఈరోడ్, తిరుప్పూర్‌తో సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మందయ్యూరు సమీపంలో పొలం కౌలుకు తీసుకున్న అబ్దుల్ ఖాన్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. తంజావూరులోని కులంధై అమ్మాల్ నగర్‌లో నివాసముంటున్న అహ్మద్ ఇంటిపై మరో బృందం దాడులు చేస్తోంది. ఇది కాకుండా, హెచ్‌యుటితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి.. సాక్ష్యాలను సేకరించడానికి రాష్ట్ర పోలీసులతో పాటు దర్యాప్తు ఏజెన్సీ బృందం ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. తదుపరి విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థ చెన్నైలోని ఐదు నగరాల్లో మొత్తం పది చోట్ల సోదాలు ప్రారంభించింది. ఇందులో తంజావూరులో ఐదు చోట్ల, ఈరోడ్‌లో రెండు చోట్ల, తిరుచ్చి, పుదుకోట్టై, కాంచీపురంలో ఒక్కో చోట దాడులు జరిగాయి. హిజ్బ్-ఉత్-తహ్రీర్ సభ్యులపై సుమోటోగా కేసు నమోదు చేయబడింది.

ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పూజలు..హిందుత్వం నుంచే ప్రేరణ పొందానని వ్యాఖ్య
సార్వత్రిక ఎన్నికల కారణంగా బ్రిటన్‌లో తీవ్ర రాజకీయ గందరగోళం నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి వారంలో బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్, అతని భార్య అక్షతా మూర్తి లండన్‌లోని ఐకానిక్ BAPS స్వామినారాయణ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీనిని నీస్డెన్ ఆలయంగా పిలుస్తారు. అతను పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆలయ సముదాయాన్ని సందర్శించి, అనంతరం వాలంటీర్లు, కమ్యూనిటీ నాయకులతో సంభాషించారు. క్రికెట్ అభిమాని అయిన సునక్ భారతదేశం టీ20 ప్రపంచ కప్ విజయాన్ని ప్రస్తావించారు. ప్రపంచకప్‌ను భారత్‌ అద్భుతంగా ఆడి గెలిచిందన్నారు. భారత్ టీంకి అభినందనలు తెలిపారు. సునక్ తన మతం గురించి మాట్లాడుతూ.. “నేను హిందువుని.. మీ అందరిలాగే నేను కూడా నా హిందు మతం నుంచే ప్రేరణ సాంత్వన పొందుతాను. భగవద్గీతతో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేసినందుకు నేను గర్వపడుతున్నాను. మన ధర్మం మన విధిని నిర్వర్తించాలని బోధిస్తుంది. మనం నిజాయితీగా చేస్తే దాని పర్యవసానాల గురించి చింతించకండి. ఇది నా ప్రేమగల తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నేను నా జీవితాన్ని ఇలా గడుపుతున్నాను. నా కుమార్తెలు పెద్దయ్యాక ఇదే నేను వారికి అందించాలనుకుంటున్నాను. ప్రజాసేవ పట్ల నా దృక్పథంలో నాకు మార్గనిర్దేశం చేసేది మతం.” అని వ్యాఖ్యానించారు.

రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్న రోహిత్‌ శర్మ!
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో అద్భుతమే చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న రోహిత్ సేన.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన ఫైనల్ పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి.. 13 ఏళ్ల ప్రపంచకప్, 11 ఏళ్ల ఐసీసీ టోర్నీ నిరీక్షణకు తెరదించింది. భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన వేళ టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. మైదానంలో డాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక కెప్టెన్‌ రోహిత్ శర్మ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్నాడు. రోహిత్‌ నడుచుకుంటూ వస్తుండగా.. ప్లేయర్స్ అందరూ చప్పట్లు కొట్టారు. బీసీసీఐ సెక్రటరీ జై షా ట్రోఫీని రోహిత్‌కు అందించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్‌ రోబోలా నడిచిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్‌ చరణ్‌
టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాని 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు కట్టడి చేసింది. జట్టు విజయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ కీలక పత్రాలు పోషించారు. కీలక సమయంలో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యాడు. అద్భుతంగా ఆడిన భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌ 2024 ఫైనల్ విజయం అనంతరం భారత జట్టుకు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత జట్టు అనూహ్య విజయం సాధించింది. టీమిండియా ప్రదర్శన అమోఘం. జస్ప్రీత్ బుమ్రా అదరహో. విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా పెర్ఫామెన్స్‌ అద్భుతం. మా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన మ్యాచ్‌ ఇది. ఎంతో గర్వంగా ఉంది. భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోహ్లీ ఇన్నింగ్స్‌, బుమ్రా బౌలింగ్‌, సూర్యకుమార్‌ క్యాచ్‌, రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతం. ఇది చరిత్రాత్మక విజయం. నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో రాహుల్ ద్రవిడ్‌ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు మనం ఛాంపియన్స్‌. మనం అజేయులం, మనం భారతీయులం’ అని లోకనాయకుడు కమల్‌ హాసన్‌ పోస్ట్ చేశారు.