NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..
రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.. ఇకపై రూ.4000 ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3000 పెంచాం.. ఇకపై వారికి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.. 28 వర్గాలకు చెందిన 65, 18, 496 మంది పెన్షన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక, కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పెన్షన్లు పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ. 819 కోట్ల భారం పడుతున్నా.. ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం పెన్షన్ విషయంలో వృద్ధులను ఎంతో క్షోభ పెట్టింది.. ఆ మూడు నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి చలించిపోయా.. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి.. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా..!
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం అని ఆయన మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టును అసలు కేంద్రానికే వదిలి పెట్టి ఉంటే బాగుండేది అని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నివేదిక ప్రజలను మోసం చేయడానికే.. అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం నిర్మాణం జగన్ ప్రభుత్వంలోనే కట్టారు అని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలవరం ప్రాజెక్టుపై అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. అలాగే, రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చినతకు నోటీసులు జారీ చేయడంపై కూడా రియాక్ట్ అయ్యారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసి ఎన్ని భూములను లీజుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోనూ తెలుగు దేశం పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను తీసుకున్నారు.. తెలంగాణలోని టీడీపీ కార్యాలయానికి తీసుకున్న భూములను ఎన్టీఆర్ ట్రస్ట్ కు తరలించడం నిజం కాదా అని మాజీ ఎంపీ భరత్ రామ్ ఆరోపించారు.

ఏపీ డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం.. గజమాలతో సన్మానం
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కాసేపట్లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు బయల్దేరిన పవన్ కు.. అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. మొదటగా తుర్కపల్లి దగ్గర పవన్ కల్యాణ్ కు జనసేన, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కు గజమాలతో ఘనంగా సన్మానించారు అభిమానులు. ఈ సందర్భంగా.. ఓపెన టాప్ కారు నుంచి పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పని చేస్తుందని అన్నారు. మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టులోని బృందావనం గార్డెన్ దగ్గర ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. ఈ క్రమంలో.. జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా చేరుకుని స్వాగతం పలికారు. అటు.. కొండగట్టులో కూడా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మరికాసేపట్లో పవన్ కల్యాణ్ అంజన్నను దర్శించుకోనున్నారు. అనంతరం.. మళ్లీ హైదరాబాద్ కు తిరుగ పయనం కానున్నారు. పవన్ కల్యాణ్ రాక దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..
తెలంగాణ పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయినప్పటికీ స్పష్టత రాలేదు. మరోసారి సోమవారం సమావేశం ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ సమక్షంలో అంతిమ నిర్ణయం ఉండబోతోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవిపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు రాష్ట్రానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవుల భర్తీపై ఎల్లుండి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పదవుల భర్తీలో అన్ని సామాజికవర్గాలకు సముచిత స్థానం, న్యాయం లభించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఎస్సీ మాదిగ, ఎస్టీ, బీసీలకు, ఇతర వెనకబడిన వర్గాలకు సమమైన న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పదవుల భర్తీపై పాటించాల్సిన విధివిధానాలపై కేసీ వేణుగోపాల్ నివాసంలో స్థూలంగా చర్చ జరిగింది. ఇప్పటికే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులివ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన నాయకుల సమ్మతి లేకుండా, సంప్రదించకుండా పార్టీలోకి కొత్తవారిని తీసుకోరాదని, గతంలో కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్ఎస్‌లోకి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.

మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం కేసు..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. గవర్నర్ సీవి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. సీఎంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై గవర్నర్ శుక్రవారం కలకత్తా హైకోర్టులో కేసు వేశారు. రాజ్‌భవన్‌లో జరుగుతున్న కార్యక్రమాల వల్ల మహిళలు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ పరిణామం ఎదురైంది. గవర్నర్ ఆమె వ్యాఖ్యల్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యలే చేసిన కొంతమంది టీఎంసీ నేతలపై గవర్నర్ పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు సమాచారం. గురువారం సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సంఘటనల కారణంగా రాజ్‌భవన్ వెళ్లేందుకు భయపడుతున్నామని మహిళలను నాకు చెప్పారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టుని ఆశ్రయించినట్లు, సీఎంతో పాటు పలువురు టీఎంసీ నేతలపై పరువు నష్టం కేసు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అయితే, ఈ కేసును గురించి టీఎంసీ రాజ్యసభ ఎంపీ డోలా సెన్‌‌ని సంప్రదించినప్పుడు, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ విషయంపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని అన్నారు. మరోవైపు గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. అయితే, చాలా కాలం క్రితమే అతనను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని చెప్పారు. సీఎం, గవర్నర్ మధ్య వైరం రాష్ట్రానికి ఉపయోగపడటం లేదని సీపీఎం సీనియర్ నేత సుజన్ చక్రవర్తి అన్నారు.

లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు మృతి
లడఖ్‌లోని నదిలో ప్రాక్టీస్ చేస్తున్న సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. సైనికులు నదిలో ట్యాంక్‌తో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి ఐదుగురు సైనికులు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఒక మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన సైనికుల మృతదేహాలు కూడా ఇంకా లభ్యం కాలేదు. టీ-72 ట్యాంక్ నది నుండి బయటకు తీశారు.. ఎల్‌ఏసీ సమీపంలోని నియోమా చుషుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంక్‌ను నది దాటేలా రక్షణ అధికారులు సాధన చేస్తున్నారని చెప్పారు. అప్పుడు నదిలో ఒక్కసారిగా వరద వచ్చింది. ఐదుగురు జవాన్ల మృతితో పాటు అనేక మందికి గాయాలైనట్లు సమాచారం. ఇది లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఉన్న నది అని, విన్యాసాలకు ముందు ఎక్కువ నీరు లేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన నలుగురు సైనికుల మృతదేహాల కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గతేడాది లడఖ్‌లో ఆర్మీ వాహనం గుంతలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు చనిపోయారు. మేఘాలు పేలడం లేదా కొండచరియలు విరిగిపడడం వల్ల కొన్నిసార్లు పర్వత నదులలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పెద్ద ప్రమాదం జరుగుతుంది.

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. బయల్దేరిన యాత్రికులు
అమర్‌నాథ్ యాత్ర ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హిమాలయాల్లో ఉన్న బోలేనాథుడి ద‌ర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. హిమాల‌యాల్లోని ద‌క్షిణ క‌శ్మీర్‌లో సుమారు 3880 మీట‌ర్ల ఎత్తులోని ఓ గుహ‌లో భ‌క్తులు మంచు శివ‌లింగాన్ని ద‌ర్శనం చేసుకోనున్నారు. నువాన్‌-ప‌హ‌ల్గామ్ రూట్లో 48 కిలోమీట‌ర్లు, బ‌ల్తాల్ రూట్లో 14 కిలోమీట‌ర్ల మార్గంలో భ‌క్తులు వెళ్తున్నారు. ఈ రెండూ అమర్‌నాథ్ యాత్రకు మార్గాలు. రెండు మార్గాల్లో యాత్రికుల బృందాలను సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, పోలీసు పరిపాలనలోని సీనియర్ అధికారులు పంపినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఉదయం జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్రి బేసిక్ క్యాంప్ నుండి 4,603 మంది యాత్రికులను జెండా ఊపి పంపించారు. ప్రభుత్వ అధికారులు జెండా ఊపి యాత్రికులకు గుడ్‌ల‌క్ చెప్పారు. ఈ క్రమంలో.. యాత్రికులు మధ్యాహ్నం కాశ్మీర్ లోయకు చేరుకోగా అక్కడ వారికి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు.. ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈసారి ఈ యాత్ర నెలన్నర పాటు కొనసాగనుంది. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది.

ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. బార్బడోస్ పిచ్ రిపోర్ట్
ఈరోజు ఇండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. టాస్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు బార్బడోస్‌లో వర్షం పడే అవకాశం ఉంది.. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే భారీ వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే ఉంది. ఇక.. బార్బడోస్ పిచ్ గురించి చెప్పాలంటే స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ మద్దతునిస్తుంది. ఇంతకుమందు ఈ పిచ్లో నమీబియా వర్సెస్ ఒమన్, స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఫైనల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తలపడనుంది. నమీబియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ తక్కువ స్కోరింగ్ నమోదైంది. మరోవైపు.. ఇంగ్లండ్‌పై స్కాట్లాండ్ 10 ఓవర్లలో 90 పరుగులు చేసినప్పటికీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగలేదు. ఈ పిచ్లో ఫాస్ట్ బౌలర్లు అత్యధిక వికెట్లు పడగొట్టారు. బార్బడోస్‌లో ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు 20.22 సగటుతో 59 వికెట్లు తీశారు. ఈ పిచ్లో భారత్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక మ్యాచ్ ఆడింది. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా 181 పరుగులు చేసింది. మరోవైపు.. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌ ఇక్కడే ఆడింది.

కల్కి సినిమాపై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి సినిమా మానియా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల అగ్రతారాలందరూ సినిమాలో నటించడంతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యం గురించి చేస్తుంది. సినిమాలో చూపించిన విజువల్ వండర్స్, దానిని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. తాను కల్కి సినిమాను చూశానని.. ఇది ఎంతో గొప్ప సినిమా అని., దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లడంటూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. అలాగే చిత్ర నిర్మాత అశ్విని దత్ కు నా ప్రియమైన స్నేహితుడుకు హృదయపూర్వక అభినందనలు అంటూ ఆయనని ట్యాగ్ చేశారు. ఇక ఆ ట్వీట్ లోనే కమల్ హాసన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె లాంటి వారిని ట్యాగ్ చేస్తూ కల్కి బృందం తీసే పార్ట్ 2 కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపాడు. అందుకోసం భగవంతుడు ఆశీర్వదిస్తాడు అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.