పసిడిని దాటిన మిర్చి రేటు.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది. వరంగల్ జిల్లాలో మిర్చి ధర బంగారం రేటు దాటి పోయింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ.80,100 పలికింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి చరిత్రలోనే హై రేట్ నమోదు చేసుకుంది. శుక్రవారం 3 వేల మిర్చి బస్తాలు మార్కెట్ కి వస్తే గంటన్నర లోనే కొనుగోళ్లు పూర్తీ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మిర్చికి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు కొనేందుకు పోటీ పడ్డారు. దీంతో ఉదయం 8 లోపు మిర్చి కొనుగోలు పూర్తి కావడం ఇది రికార్డు బద్దలు కొట్టినట్టైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎన్నడు లేని విధంగా కొత్త దేశీ మిర్చికి రికార్డు ధర పలికింది. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం రావి చెట్టు తండాకు చెందిన రాములు నాయక్ దేశీ మిర్చి నాలుగు బస్తాలు తేవడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. దీంతో క్వింటాలు మిర్చి బస్తా 80 వేల ఒక వందకు చేరింది. దీంతో రాములు నాయక్ ఆనందం వ్యక్తం చేశారు.
ఏపీలో పెట్టుబడిదారుల సమ్మిట్.. మస్క్, కుక్‌లకు ఆహ్వానం
విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. ఈ సమ్మిట్ మార్చి 3, 4 తేదీలలో వైజాగ్‌లో జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్రమంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు. పోర్ట్ సిటీలో జరగనున్న సమ్మిట్‌కు ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ ఛైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్.చంద్రశేఖరన్ వంటి భారతీయ వ్యాపారవేత్తలు ఆహ్వానించబడ్డారు.
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్.. వైసీపీ కార్యకర్తల కంటే ఓవరాక్షన్ చేస్తున్నారు
ఏపీలో వైసీపీ సర్కారు వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరం నాటి పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైఖరిని ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు. అసలు సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగే స్వేఛ్చ కూడా చంద్రబాబుకు లేదా అని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో పోలీసులే వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. చెత్త బండ్లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని భవిష్యత్తులో పోలీసులే చెత్త ఎత్తుతారేమో అని చురకలు అంటించారు. కావాలంటే చెత్త ఎత్తుకోండి… మమ్మల్ని మాత్రం ఎత్తకండి అని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఏర్పడిందని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
బడ్జెట్‌కు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం?
కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే విస్తరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు నెలరోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుండడంతో ఈ మార్పులు బీజేపీ సంస్థను పునరుద్ధరించడంతో ముడిపడి ఉండవచ్చు. అంతేకాకుండా జనవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్లు కొందరు ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ నుంచి కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చని సమాచారం. వచ్చే ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశాలు ఉన్నాయి.
ప్రొఫెషనల్స్ ఇలాగే ఆడతారా? నో బాల్స్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే భారత్ ఓటమికి నోబాల్స్ కారణమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా నోబాల్స్‌పై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ ఘాటుగా స్పందించాడు. ఇటీవల కాలంలో ఆటగాళ్లు తరచూ పరిస్థితులు తమ నియంత్రణలో లేవని చెప్తున్నారని.. కానీ నోబాల్ వేయడం, వేయకపోవడం మాత్రం ఆటగాడి నియంత్రణలోనే ఉంటుందని గవాస్కర్ చురకలు అంటించాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లు నోబాల్స్ వేయకూడదని హితవు పలికాడు. అటు అర్ష్‌దీప్ సింగ్ వరుసగా నోబాల్స్ వేయడంపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. నోబాల్ వేయడం ఓ క్రైమ్ అని.. ఇది క్షమించరాని నేరమంటూ పాండ్యా అభిప్రాయపడ్డాడు.
ప్రభాస్ సినిమా యూనిట్‌లో విషాదం
హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ చిత్ర యూనిట్‌లో విషాదం నెలకొంది. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్న ‘సునీల్ బాబు’ గుండెపోటుతో మరణించారు. బెంగుళూరు డేస్, గజినీ, వారిసు లాంటి సినిమాలకి ఆర్ట్ వర్క్ చేసిన మలయాళ అర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు 50 ఏళ్ల వయసులో కేరళలోని ఎర్నాకులంలో చనిపోయారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా, మహేశ్ బాబు నటించిన మహర్షీ సినిమాలకి కూడా సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో బెంచ్ మార్క్ సినిమాలకు ప్రొడక్షన్ డిజైన్ చేసిన సునీల్ బాబు చనిపోవడంతో కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో ఆయనతో వర్క్ చేసిన వాళ్లు కూడా దిగ్బ్రాంతికి లోనయ్యారు.