Site icon NTV Telugu

త్రిష తొలి మలయాళ చిత్రం ‘ఆహా’లో!

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించిన అందాల భామ త్రిష… మల్లూవుడ్ లోకి మాత్రం ఆలస్యంగా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి మలయాళ చిత్రం ‘హే జూడ్’ 2018 ఫిబ్రవరి 2న విడుదలైంది. శ్యామ్ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష సరసన ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌల్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది. సినిమా ప్రారంభమయ్యేది కొచ్చిలోనే అయినా ఆ తర్వాత కథ గోవాకు మారుతుంది. హీరో జూడ్ కొచ్చి నుండి తన తండ్రితో కలిసి అనుకోకుండా వచ్చిన ఓ ఆస్తిని పొందడానికి గోవాకు వెళ్ళడం, అక్కడ హీరోయిన్ క్రిస్టల్ తో పరిచయం కావడం… ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందన్నదే ఈ చిత్ర కథ.

ఇందులో నివిన్ పౌల్ బుద్ధిమాద్యం ఉన్న యువకుడిగా నటించాడు. మేథస్సులో అతనికి తిరుగులేకపోయినా, వ్యవహారిక విషయాలలో తన వయసుకు తగ్గ పరిపక్వత లేని యువకుడి పాత్రను పోషించాడు. ఆ కారణంగా అతనికి సమాజం నుండి, తోటి వ్యక్తుల నుండి రకరకాల సమస్యలు ఎదురవుతాయి, అతను వాటిని ఎలా అధిగమిస్తూ ముందుకు సాగాడన్నదే సినిమా. సిద్ధిక్‌, నీనా కురూప్, విజయ్ మీనన్, అపూర్వ బోస్, అజూ వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోని నాలుగు పాటలకు నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చడం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘ఆహా’లో జనవరి 21 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.

Exit mobile version