NTV Telugu Site icon

సినిమా షెడ్యూల్స్ ప్రీ పోన్ కు కారణం అదేనా!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందా అని గట్టిగా అడిగితే లేదనే లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇంకా రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మన దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ విషయంలో నితిన్ ముందున్నాడు. ‘మాస్ట్రో’ బాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేసేశాడు. అలానే రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సైతం చాలా కాలం తర్వాత మొదలైంది. యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో ఆగిన చాలా సినిమాల షూటింగ్స్ అనుకున్న తేదీ కంటే ముందే పట్టాలెక్కేస్తున్నాయి.

Also Read: కొత్త రంగంలోకి సురేశ్‌ ప్రొడక్షన్స్!

‘ఆచార్య’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘థ్యాంక్యూ’ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’, మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల షూటింగ్ నిజానికి జూలై 5న మొదలవుతాయని వార్తలు వచ్చాయి. కానీ ఈ నెలాఖరుకే ఈ రెండు సినిమాల తాజా షెడ్యూల్స్ మొదలు పెట్టబోతున్నారట. ఇక ఇప్పటికే విశాల్ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్‌ – వరుణ్ తేజ్ ‘ఎఫ్‌ 3’, ప్రభాస్ ‘సలార్’ షూటింగ్స్ జూలై 1 నుండి తిరిగి మొదలవుతాయని తెలుస్తోంది. అలానే రవితేజ, నాగశౌర్య సైతం తమ చిత్రాల షూటింగ్ కు సమాయత్తమౌతున్నారు. ఓవర్ ఆల్ గా ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాల బాలెన్స్ వర్క్ ను పూర్తి చేసే పనిలో యూనిట్ సభ్యులు ఉన్నారు. అయితే… ఇన్ని సినిమాలు ఒక్కసారే సెట్స్ పైకి వస్తుండటంతో క్యారెక్టర్ ఆర్టిస్టుల డేట్స్ ను సెట్ చేయడం అనేది సహాయ దర్శకులకు పెద్ద టాస్క్. ఇంత హడావుడిగా ఈ సినిమాల షూటింగ్స్ ప్రారంభించడానికి మరో ప్రధాన కారణం ఉందని తెలుస్తోంది. టైమ్ బాగోక కరోనా థర్డ్ వేవ్ వస్తే, అది ఎలా ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి… ఈ లోగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలన్నదే అందరి లక్ష్యంగా కనిపిస్తోంది. మరి కరోనా థర్డ్ వేవ్ రాకముందే ఎన్ని సినిమాల షూటింగ్స్ పూర్తవుతాయో చూడాలి.