NTV Telugu Site icon

తెలుగువారితో రఫీ బంధం!

కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా మధురగాయకుడు మహ్మద్ రఫీ గానం మురిపించింది. ఆయన గాత్రంలో జాలువారిన వందలాది పాటలు ఈ నాటికీ అభిమానులకు ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. మహ్మద్ రఫీ అనగానే తెలుగువారికి యన్టీఆర్ ‘భలేతమ్ముడు’ చిత్రం ముందుగా గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ సినిమా కంటే ముందే నటగాయక నిర్మాతదర్శకుడు చిత్తూరు వి.నాగయ్య నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘రామదాసు’లో మహ్మద్ రఫీ పాట పాడారు. అందులో కబీర్ పాత్ర ధారి గుమ్మడికి రఫీ నేపథ్యగానం చేశారు. అయితే ఆ పాట హిందీలోనే ఉండడం విశేషం. “కహే కరోనా…” అంటూ సాగే ఆ పాటతోనే రఫీ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఈ పాటకు స్వతహాగా సంగీత దర్శకుడైన నాగయ్య పర్యవేక్షణలో అశ్వథ్థామ బాణీలు కట్టారు. ఆ సినిమాలో యన్టీఆర్, ఏయన్నార్, శివాజీగణేశన్, జెమినీగణేశన్ వంటి మేటి నటులు నాగయ్యపై అభిమానంతో బిట్ రోల్స్ లో కనిపించారు. అలాగే రఫీ కూడా గాయకుడైన నాగయ్య నిర్మించిన చిత్రం కాబట్టి తనకు పారితోషికం వద్దన్నారు. అప్పటికే రఫీ తమ చిత్రంలో ఒక్క పాట పాడినా చాలు అనుకుంటూ ఉత్తరాది చిత్ర నిర్మాతలు భావించేవారు. అంతటి స్టార్ డమ్ చవిచూస్తున్నా, నాగయ్య గారిపై అభిమానంతో రఫీ పైసా పుచ్చుకోలేదు. ‘రామదాసు’ ఎప్పుడో ఆరంభమైనా, ఆ సినిమా 1964లో విడుదలయింది.

మహ్మద్ రఫీ మధురగానం యావద్భారతదేశాన్నీ ఉర్రూతలూగించింది. తెలుగునాట కూడా ఆయన పాటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే హిందీలో విజయం సాధించిన ‘చీనా టౌన్’ చిత్రాన్ని తెలుగులో ‘భలేతమ్ముడు’గా నిర్మించే సమయంలో నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య, రఫీతోనే తెలుగులోనూ పాటలు పాడించాలని భావించారు. ‘భలేతమ్ముడు’ చిత్రంలో యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. రామారావు కూడా రఫీ పాట అనగానే ఓకే అన్నారు. అలా టి.వి.రాజు స్వరకల్పనలో మహ్మద్ రఫీ తెలుగు పాటలు పాడి అలరించారు. ‘భలే తమ్ముడు’లోని “ఎంతవారు గానీ… వేదాంతులైన గానీ…”, “గోపాలా బాలా నిన్నే కోరి…”, “గుమ్మా గుమ్మా గుమ్మా…” , ఖవ్వాళీ పాట… ‘చీనా టౌన్’ ట్యూన్స్ లోనే రూపొందాయి. అయితే “నేడే ఈ నాడే… “, పాటను టి.వి.రాజు సొంతగా కంపోజ్ చేశారు. ఆ పాటలో ‘నేడే ఈ నాండే…’ అని రఫీ పలకడం అప్పట్లో చర్చకు దారి తీసింది. అయినా ఆ మధురగానం జనాన్ని విశేషంగా అలరించింది.

తెలుగులో యన్టీఆర్ ‘భలే తమ్ముడు’తోనే అలరించిన రఫీ గానం, ఆ తరువాత కూడా యన్టీఆర్ సంబంధం ఉన్న చిత్రాలతోనే సాగడం విశేషం. ‘భలే తమ్ముడు’ తరువాత యన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తల్లా పెళ్ళామా’లో “నువ్వు నవ్వుతున్నావు…నేను నవ్వుతున్నాను…” అనే పాటను పాడించారు. ఆ పై యన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా రూపొందిన ‘రామ్-రహీమ్’లో హరికృష్ణకు నేపథ్యగానం చేశారు రఫి. యన్టీఆర్ తో పుండరీకాక్షయ్య నిర్మించిన మరో రీమేక్ ‘ఆరాధన’. ఈ చిత్రంలోనూ మహ్మద్ రఫీ పాడిన పాటలు ఎంతగానో అలరించాయి. హిందీ చిత్రం ‘గీత్’ ఆధారంగా తెరకెక్కిన ‘ఆరాధన’ 1976 బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందులోని “నా మది నిన్ను పిలిచింది గానమై…” పాట ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం. ఈ సినిమా తరువాత యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘అక్బర్ సలీమ్ అనార్కలి’లోనూ సలీమ్ పాత్రధారి బాలకృష్ణకు నేపథ్యగానం చేసి ఆకట్టుకున్నారు రఫి. ఇందులోని “తారలెంతగా మురిసేనో చందురుని కోసం…”, “రేయి ఆగిపోని…రేపు ఆగిపోని…”, “తానే మేలి ముసుగు తీసి…”, “హసీనా… ఓ హసీనా…” పాటలు రఫి గాత్రంలో జాలువారి మధురామృతం పంచాయి. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’లో ముస్లిమ్ రాజు పాత్రధారి సత్యనారాయణకు “దేవుడు ఒకడే ఆ దైవం ఒకడే…” అనే పాటను గానం చేశారు రఫి. ఇదే ఆయన తెలుగులో పాడిన చివరి పాట. అలా రామారావుతో రఫీ బంధం తెలుగువారికి మధురం పంచింది.