NTV Telugu Site icon

మురిపించిన ముత్యాల సుబ్బయ్య

చిత్రసీమలో ‘గురువు’ అని అందరిచేతా అనిపించుకున్నవారు దాసరి నారాయణరావు అయితే, సినిమా రంగంలో పరిచయం ఉన్నవారినల్లా ‘గురువా’ అంటూ సంబోధించేవారు ముత్యాల సుబ్బయ్య. చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒకరోజు రాణించవచ్చునని పలువురు నిరూపించారు. ముత్యాల సుబ్బయ్య సైతం అలా నిరూపించిన వారే. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు తీసి, ఘనవిజయాలను చూసినా, తనదైన పంథాలోనే పయనిస్తూ ‘గురువా…’ అంటూనే సాగారు. ప్రస్తుతం సుబ్బయ్య చేతిలో సినిమాలు లేవు. కానీ, ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు ఈ నాటికీ బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నాయి.

‘మూడు ముళ్ళ బంధం’ చిత్రంతో దర్శకుడయ్యారు ముత్యాల సుబ్బయ్య. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో మళ్ళీ కొంతమంది దర్శకుల వద్ద కో-డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ప్రతిభావంతులకు ఏదో ఒక రోజున అవకాశాలు తలుపు తడతాయి అన్నట్టుగా ‘అరుణ కిరణం’ సుబ్బయ్య దరి చేరింది. అభ్యుదయ చిత్రాల దర్శకుడు టి.కృష్ణ సావాసంతో సుబ్బయ్యలోనూ అవే భావాలు తొంగి చూశాయి. ‘అరుణకిరణం’ జనాన్ని అలరించడంతో ‘నవభారతం’ చిత్రాన్నీ అదే తీరున రూపొందించి మురిపించారు సుబ్బయ్య. తరువాత బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’ తెరకెక్కించి విజయం
సాధించారు. ఆ పై “చిన్నారి స్నేహం, మమతల కోవెల, భారతనారి” వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సుబ్బయ్యకు దాసరితో తెరకెక్కించిన ‘మామగారు’ అనూహ్య విజయాన్ని అందించింది. “కలికాలం, ఎర్రమందారం, పల్నాటి పౌరుషం, అన్న, పవిత్రబంధం” చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు.

ముత్యాల సుబ్బయ్య పలువురు స్టార్ హీరోస్ తో సూపర్ హిట్స్ సాధించారు. అలాగే వర్ధమాన కథానాయకులకూ విజయాలను అందించారు. చిరంజీవితో “హిట్లర్, అన్నయ్య” చిత్రాలను, బాలకృష్ణతో “ఇన్ స్పెక్టర్ ప్రతాప్, పవిత్ర ప్రేమ, క్రిష్ణబాబు” సినిమాలను, వెంకటేశ్ తో “పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం” లాంటి మూవీస్ ను రూపొందించి అలరించారు. పవన్ కళ్యాణ్ ‘గోకులంలో సీత’, రాజశేఖర్ ‘అన్న, మనసున్న మారాజు’ సినిమాలు సైతం సుబ్బయ్య దర్శకత్వంలోనే రూపొంది జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. కుటుంబ కథా చిత్రాలను, అభ్యుదయ సినిమాలను, ప్రేమకథలను రూపొందించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ముత్యాల సుబ్బయ్య మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.