సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ సినిమా రంగానికి అనుబంధంగా ఉండే మరో రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిజానికి ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. కానీ లేట్ ఈజ్ బెటర్ దేన్ నెవ్వర్ అన్నట్టుగా ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం కూడా హర్షదాయకమే. ఇంతకూ విషయం ఏమిటంటే… మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేశ్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోందట. చిత్ర నిర్మాణం, స్టూడియో నిర్వహణ, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్విప్ మెంట్స్, అవుట్ డోర్ యూనిట్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్… ఇలా సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలోనూ సురేశ్ ప్రొడక్షన్స్ తన సత్తాను చాటుతూనే ఉంది. అయితే… ఎందుకో మరి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ఇంతవరకూ అడుగుపెట్టలేదు. అయితే… ఇప్పుడా పనిచేయబోతోందట. నిజానికి గతంలో మాదిరి సినిమాల పాటల ఆడియో క్యాసెట్స్, సీడీల అమ్మకాలు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా డిజిటలైజ్డ్ గా మారిపోయింది. పాట వినాలన్నా, చూడాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ నేపథ్యంలోనూ మ్యూజిక్ ఇండస్ట్రీ లాభసాటిగానే ఉంది. పాటల ఆడియో, వీడియో హక్కులతో మ్యూజిక్ ఇండస్ట్రీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అలానే కొన్ని ఆడియో కంపెనీలు యూ ట్యూబ్ ఛానెల్స్ నెలకొల్పి, డిజిటల్ మార్కెట్ లోనూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో శతాధిక చిత్రాలను నిర్మించిన సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం తెలివైన నిర్ణయం అనే అనుకోవాలి.
కొత్త రంగంలోకి సురేశ్ ప్రొడక్షన్స్!
